హైదరాబాద్: అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా, ప్రజా ప్రతినిధిగా అర్ధశతాబ్ధానికి పైగా ప్రజలకు సేవలందించిన కొణిజేటి రోశయ్య మృతి పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరిస్తూ, పరిపాలనా దక్షుడిగా రోశయ్య పేరు పొందారన్నారు. ఆయన మృతి తెలుగు వారికి తీరని లోటన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలసి ఉండాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని రోశయ్య మనసారా కోరుకున్నారని ఎన్వీ రమణ పేర్కొన్నారు. విలువలకు, సత్సంప్రదాయాలకు మారుపేరుగా నిలిచిన పాతతరం నేతల్లో ఒకరని కొనియాడారు. తెలుగు భాష, కళలు, సంస్కృతికి రోశయ్య పెద్ద పీట వేశారని పేర్కొన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఎన్వీ రమణ సానుభూతి తెలిపారు.