NRI ల కొత్త రూటు.. విదేశాల్లోనే పెళ్లిళ్లు చేసుకోవడానికి మొగ్గు చూపడం వెనుక..

ABN , First Publish Date - 2021-12-19T00:17:56+05:30 IST

మహమ్మారి కరోనా కారణంగా గడిచిన ఏడాది దాదాపు ప్రపంచ దేశాలన్నీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

NRI ల కొత్త రూటు.. విదేశాల్లోనే పెళ్లిళ్లు చేసుకోవడానికి మొగ్గు చూపడం వెనుక..

ఎన్నారై డెస్క్: మహమ్మారి కరోనా కారణంగా గడిచిన ఏడాది దాదాపు ప్రపంచ దేశాలన్నీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఈ ఆంక్షలు అలాగే కొనసాగుతున్నాయి కూడా. ఇక ఈ ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసుల బాధలు వర్ణణాతీతం. స్వదేశంలో ఉపాధి కరువైయి.. విదేశాలకు వెళ్లిన ప్రవాసులు  కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆదాయం లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేక పడరాని పాట్లు పడ్డారు. ఆంక్షల కారణంగా ఇటు స్వదేశానికి రాలేక అటు అక్కడ ఉండలేక నరకయాతన అనుభవించారు. విదేశాల్లోనే చిక్కుకుని విలవిలలాడారు. అందులోనూ విదేశాల్లో అధికంగా ఉండే భారతీయుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో భారత ప్రభుత్వం చొరవ తీసుకుని వందే భారత్ మిషన్, ఎయిర్ బబుల్ ఒప్పందాల ద్వారా భారతీయ ప్రవాసులను స్వదేశానికి తరలించింది. 


ఇప్పుడు కోవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ మరోసారి ప్రపంచ దేశాలను భయం గుప్పిట్లోకి నెట్టేసింది. రోజురోజు కొత్త వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. దాంతో ప్రవాసుల్లో మళ్లీ ఆంక్షల విషయమై భయం మొదలైంది. గతేడాది మాదిరిగా మరోసారి ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తే ఏమిటనే ప్రశ్న వారి మదిని కలిచివేస్తోంది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైలు ఇప్పుడు స్వదేశానికి రావడానికి భయపడుతున్నారు. దీంతో చాలామంది స్వదేశంలో జరగాల్సిన తమ పెళ్లిని జీసీసీ దేశాల్లోనే కొంతమంది తెలిసిన వాళ్ల సమక్షంలో కానిచ్చేస్తున్నారు. ఇక స్వదేశంలోని బంధువులకు ఆన్‌లైన్ ద్వారా వీడియో లింకులను పంపిస్తూ తమ వివాహ వేడుకను చూడాల్సిందిగా కోరుతున్నారు. ఇలా ఇప్పటివరకు కువైత్, యూఏఈ, దుబాయ్‌లో పలు భారతీయ జంటలు పరిణయంతో ఒక్కటయ్యాయి. 


మహమ్మారి విజృంభణ ప్రారంభమైనప్పుడు గల్ఫ్‌లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలాగే మంగళూరుకు చెందిన లిస్సా(పేరు మార్చాం) కూడా ఇటీవలే యూఏఈలో కొంతమంది సన్నిహితుల మధ్య తన వివాహ తంతును ముగించారు. అసలుకైతే ఆమె తన సొంతూరు మంగళూరులో ఘనంగా పెళ్లి చేసుకోవాలని మొదట అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఇలా చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. లిస్సా మాదిరిగానే పలువురు యూఏఈలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మరికొందరు స్వదేశంలోనే కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల మధ్య పరిణయమాడాలని పోస్ట్‌పోన్ చేసుకున్నారు. 


ఇదే మాదిరి కువైత్‌లో కూడా ఓ భారతీయ జంట ఇటీవలే పెళ్లి చేసుకుంది. మొదట సెలవులు తీసుకుని మరీ స్వదేశానికి వెళ్లిందా జంట. పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా.. ఒక్కసారిగా కరోనా వల్ల పరిస్థితులు మారిపోయాయట. దాంతో చేసేదేమిలేక తిరిగి కువైత్ వచ్చేశారు. ఆ తర్వాత తోటి ఉద్యోగులు, చాలా తక్కువ మంది తెలిసిన వాళ్ల సమక్షంలో పెళ్లి తంతు ముగించారు. ఇదే కోవలో దుబాయ్‌లో ఉండే థామస్(పేరు మార్చడం జరిగింది) రెండు వారాల క్రితం పెళ్లి చేసుకున్నారు. తన వివాహమైతే మరీ అద్వానంగా జరిగిందని చెప్పుకొచ్చారాయన. ఆయన పెళ్లికి ఒక్కరంటే ఒక్క అతిథి లేకుండా దంపతులిద్దరే పెళ్లి తంతు ముంగించుకున్నారట. ఇలాగే పలువురు జంటలు జీవితంలో ఒక్కసారే జరిగే ఈ శుభకార్యాన్ని బంధుమిత్రులేవరు లేకుండా అది కూడా పరాయి దేశంలో జరుపుకున్నాయి. ఇలా ఎన్నారైలకు వివాహ బంధం కోసం కరోనా ఓ కొత్త రూటును పరిచయం చేసినట్లైంది.  

Updated Date - 2021-12-19T00:17:56+05:30 IST