హిందూ మతంపై అమెరికాలో చర్చ.. భగ్గుమంటున్న ఎన్నారై సంఘాలు..

ABN , First Publish Date - 2021-08-29T06:44:31+05:30 IST

ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అమెరికాలో.. అత్యంత పురాతన మతమైన హిందూత్వంపై చర్చకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 10 నుంచి 13వ తేదీ వరకూ ఈ సమావేశం జరగనుంది. ఈ విషయం తెలియడంతో అమెరికాలోని హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ సమావేశాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

హిందూ మతంపై అమెరికాలో చర్చ.. భగ్గుమంటున్న ఎన్నారై సంఘాలు..

ఎన్నారై డెస్క్: ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్యం అమెరికాలో.. అత్యంత పురాతన మతమైన హిందూత్వంపై చర్చకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 10 నుంచి 13వ తేదీ వరకూ ఈ సమావేశం జరగనుంది. ఈ విషయం తెలియడంతో అమెరికాలోని హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ సమావేశాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఈ చర్చకు స్పాన్సర్స్‌గా ఉన్న అమెరికన్ యూనివర్సిటీలను సంప్రదించి, తమ స్పాన్సర్‌షిప్‌ను వెనక్కు తీసుకోవాలని కోరుతున్నాయి. ఇంత రచ్చ జరగడానికి ఆ చర్చలో ఏముందా? అనే అనుమానం కలుగుతుందా? ఇది నిజంగానే పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఈ చర్చా కార్యక్రమం పేరే ‘డిస్‌మ్యాంట్లింగ్ గ్లోబల్ హిందూత్వ’. అంటే అంతర్జాతీయ హిందూత్వను ఎలా కూల్చివేయాలి? అని అర్థం. ఇంకేముందు ఈ చర్చా కార్యక్రమం జరగకూడదంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందుత్వాన్ని భయంకరమైన రాక్షసిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, ఇలా ఒక మతాన్ని కించపరచడం సరికాదని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి.


అయితే హిందూత్వ అనేది ఒక రాజకీయ ఐడియాలజీ అని, దీనికి మతంతో సంబంధం లేదని, ప్రస్తుతం ఇది భారత్‌ను నాశనం చేస్తోందని ఈ కాన్ఫరెన్స్ నిర్వాహకులు వాదిస్తున్నారు. ఈ సమావేశంలో పలువురు అకాడమీ నిపుణులు, జర్నలిస్టులు, పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ వంటి వారంతా పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కులం, లింగం, సెక్సువాలిటీ, రాజకీయ ఆర్థిక వ్యవస్థ, సైన్స్, ప్రచారం వంటి పలు అంశాలపై చర్చ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశానికి 40 యూనివర్సిటీలకు చెందిన 60 విభాగాలు సహ స్పాన్సర్లుగా ఉన్నాయి. ‘‘ఈ వేదికపై మాట్లాడటానికి పలువురు నిపుణులను ఆహ్వానించాం. ఈ నిపుణుల నుంచి మేం కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాం. అలాగే వారితో కలిసి అసలు హిందూత్వ అంటే ఏంటి? అదేం చేస్తుంది? అని ఆలోచిస్తాం’’ అని నిర్వాహకులు అంటున్నారు.


ఇదే సమయంలో హిందూ సంఘాలు సదరు యూనివర్సిటీలను సంప్రదించాయి. తమ స్పాన్సర్‌షిప్‌ను వెనక్కు తీసుకోవాలని ఈ వర్సిటీలను హిందూ సంఘాలు కోరుతున్నాయి. దీనిపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ కర్ల మాట్లాడుతూ.. భావస్వేచ్ఛతో జీవిసతూ సొంత అసెంబ్లీ నిర్వహించుకుంటున్న వేలాది మంది ప్రజలను ఫాసిస్టులు(నియంతృత్వ వాదులు)గా, సుప్రీమాసిస్టులు(ఆధిపత్యవాదులు)గా చిత్రించే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా ఉన్న వర్సిటీలు తమ ఫ్యాకల్టీ ఎంత నిర్లక్ష్యంగా, తప్పుగా ఈ నిర్ణయం తీసుకున్నారో ఈ వర్సిటీలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఇలా చేయడం అమెరికాలోని మైనార్టీలైన ఈ జాతికి ప్రమాదంలోకి నెట్టడమే అని అభిప్రాయపడ్డారు. ఈ కాన్ఫరెన్స్ వివిధ కోణాల నుంచి జరిగే చర్చా కార్యక్రమం కాదని చెప్పిన సమీర్.. హిందువులను, హిందూయిజాన్ని రాక్షసులుగా చూపించి, తమతో ఏకీభవించని వారిని నియంతృత్వవాదులు, ఆధిపత్యవాదులుగా చిత్రీకరించే వేదిక అని మండిపడ్డారు.

Updated Date - 2021-08-29T06:44:31+05:30 IST