విద్యుత్‌ సవరణ బిల్లు వద్దు..

ABN , First Publish Date - 2022-08-09T05:27:24+05:30 IST

విద్యుత్‌ సవరణ బిల్లు వద్దు..

విద్యుత్‌ సవరణ బిల్లు వద్దు..
హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్‌పీడీసీఎల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులు

వెనక్కి తీసుకోకపోతే మెరుపు సమ్మె

విద్యుత్‌ ఉద్యోగ సంఘం నేతల స్పష్టీకరణ

ఎన్‌పీడీసీఎల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

హనుమకొండ రూరల్‌, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ హనుమకొండ  నక్కలగుట్టలోని ఎన్‌పీడీసీఎల్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన, ధర్నా చేపట్టారు. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని ఉద్యోగులందరూ తమ విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీఎ్‌సపీఈ జేఏసీ) నాయకులు బి.సామ్యానాయక్‌, ఎన్‌.సుబ్రమణ్యేశ్వర్‌రావు, టి.శేషగిరిరావు, ఇ.శ్రీధర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యుత్‌ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో మెరుపు సమ్మె చేసేందుకు వెనుకాడేది లేదన్నారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని వారు హెచ్చరించారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టంతో పేద, మధ్య తరగతి, బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్‌ ఉద్యోగులతో పాటు విద్యుత్‌ వినియోగదారులు, రైతులతో కలిసి రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. 

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు.   ధర్నాలో ఉద్యోగులు రాజేందర్‌, ఆనందం, గిరిధర్‌, శ్రీరాంనాయక్‌, హేమంత్‌కుమార్‌, ప్రభాకర్‌రెడ్డి, శశికుమార్‌, మహమూద్‌, రాంబాబు, ఇంద్రసేన, తిరుపతిరెడ్డి, మహేందర్‌రెడ్డి నవీన్‌, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన నిరసన ధర్నాకు కాంగ్రెస్‌ పార్టీ హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నారు.

ములుగు రోడ్డులో..

విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ బిల్లుకు నిరసనగా టీఎస్‌ పవర్‌ జాక్‌ ఆధ్వర్యంలో ములుగు రోడ్డులోని ట్రాన్స్‌కో విద్యుత్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎస్‌ పవర్‌ జాక్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, టీ జాక్‌ చైర్మన్‌ సంపత్‌రావు మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సరవరణ బిల్లుపై వెనక్కి తగ్గకపోతే మెరుపు సమ్మెకు వెనుకాడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రాజ్‌కుమార్‌, చంద్రప్రకాశ్‌, అశోక్‌, దేవేందర్‌రెడ్డి, దేవా, కుమారస్వామి, యాకూబ్‌, సందీప్‌, ప్రశాంత్‌, మోహన్‌, మహేశ్‌, శ్రీనివాసరావు, మాధవరెడ్డి, యుగంధర్‌, రఘోత్తంరెడ్డి, భరత్‌, అజయ్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-08-09T05:27:24+05:30 IST