జొకో ‘క్యాలెండర్‌’ కల నెరవేరేనా?

ABN , First Publish Date - 2021-08-30T08:26:27+05:30 IST

అరుదైన క్యాలెండర్‌ ఇయర్‌ గ్రాండ్‌స్లామ్‌పై గురిపెట్టిన టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌..

జొకో ‘క్యాలెండర్‌’ కల నెరవేరేనా?

నేటి నుంచి యూఎస్‌ ఓపెన్‌


న్యూయార్క్‌: అరుదైన క్యాలెండర్‌ ఇయర్‌ గ్రాండ్‌స్లామ్‌పై గురిపెట్టిన టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. సోమవారం నుంచి జరిగే యూఎస్‌ ఓపెన్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. 1969లో రాడ్‌ లెవర్‌ తర్వాత పురుషుల సింగిల్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశం సెర్బియా యోధుడు జొకోకు ఒక్క గ్రాండ్‌స్లామ్‌ దూరంలో ఉంది. ఒక ఏడాదిలో జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌లను నెగ్గితే దాన్ని క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌గా పరిగణిస్తారు. ఫుల్‌ఫామ్‌లో ఉన్న జొకో.. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్‌, వింబుల్డన్‌ను ఇప్పటికే నెగ్గాడు. స్పెయిన్‌బుల్‌ రఫెల్‌ నడాల్‌, ఫెడరర్‌ లాంటి టాప్‌ ఆటగాళ్లు బరిలోకి లేకపోవడం నొవాక్‌కు కలసి వచ్చే అంశం. అయితే, మెద్వెదెవ్‌, స్టెఫనోస్‌ సిట్సిపాస్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ లాంటి యువ తరం నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. తొలి రౌండ్‌లో హోల్గర్‌ విటస్‌ నొడొస్కోవ్‌ (డెన్మార్క్‌)తో జొకో తలపడనున్నాడు. కాగా, మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్‌ గాయం కారణంగా తప్పుకొంది. దీంతో టాప్‌ సీడ్‌ ఆస్ట్రేలియా ప్లేయర్‌ ఆష్లే బార్టీ, డిఫెండింగ్‌ చాంప్‌ నవోమి ఒసాకలో ఒకరు విజేతలుగా నిలుస్తారని అంచనాలు వేస్తున్నారు. తొలి రౌండ్‌లో వెరా జ్వొనరెవా (రష్యా)తో బార్టీ, మారి బుజ్‌కొవా (చెక్‌)తో మూడో సీడ్‌ ఒసాక తలపడనున్నారు. 

Updated Date - 2021-08-30T08:26:27+05:30 IST