బూడిద కాదు.. బంగారం..

ABN , First Publish Date - 2021-12-03T08:08:51+05:30 IST

అది వట్టి బూడిద.. కరెంటు ఉత్పత్తి కోసం బొగ్గును మండించగా మిగిలిపోయిన మసి. దానిని నిల్వ చేయడం కొంచెం కష్టమే. గట్టిగా గాలి వస్తే మొత్తం లేచి చుట్టుపక్కల ప్రాంతాలను

బూడిద కాదు.. బంగారం..

  • ఎన్టీపీసీ బూడిదకు ఊహించని డిమాండ్‌
  • ఒకప్పుడు ఉచితంగా ఇచ్చేసిన విద్యుత్తు సంస్థ
  • టెండర్లు పిలిస్తే టన్ను రూ.400 పలికిన ధర


గోదావరిఖని, డిసెంబరు 2: అది వట్టి బూడిద.. కరెంటు ఉత్పత్తి కోసం బొగ్గును మండించగా మిగిలిపోయిన మసి. దానిని నిల్వ చేయడం కొంచెం కష్టమే. గట్టిగా గాలి వస్తే మొత్తం లేచి చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేస్తుంది. దాంతో వచ్చేదేముంది అని భావించిన రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం అడిగిన వారికి కాదనకుండా ఉచితంగా ఇచ్చేస్తోంది. కొన్నేళ్లుగా ఇది సాగుతోంది. అయితే ఇప్పుడు ఆ బూడిద అనూహ్యంగా బంగారమైపోయింది. ఇంత కాలం బూడిదను అవసరమున్న వారికి ఉచితంగా ఇచ్చిన ఎన్టీపీసీ, ఇటీవల ఈ-వేలం నిర్వహించింది. టెండర్‌లో టన్ను బూడిద రూ.1కి కోట్‌ చేసింది. అయితే, ఎవరూ ఊహించని విధంగా టన్ను బూడిదను రూ.400 కొనేందుకు టెండర్లు వచ్చాయి. ఈ లెక్కన మొత్తం 40 లక్షల టన్నులకుగాను ఎన్టీపీసీకి రూ.160 కోట్లు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఇంతకాలం ఉచితంగా ఇచ్చే ఈ బూడిద ఇన్ని వందల కోట్లను కుమ్మరిస్తుందని ఎవరూ ఊహించలేదు. దీనిని సింగరేణిలో మూతపడిన గనులలో నింపడానికి వినియోగిస్తుంటారు. సింగరేణి, జాతీయ రహదారుల సంస్థకు ఎన్టీపీసీ దీనిని ఉచితంగా ఇస్తోంది. ఇదే బూడిదను ఉపయోగించి తేలికపాటి ఇటుకలు కూడా తయారు చేస్తారు. ఇలా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 600కు పైగా ఇటుక బట్టీలు ఉన్నాయి.


కేవలం బూడిద ఆధారంగా కరీంనగర్‌ జిల్లాలో ఎన్నో బట్టీలు ఏర్పాటయ్యాయి. ఎన్టీపీసీ 40 లక్షల టన్నుల బూడిదకు టెండర్‌ పిలవడంతో.. 26 లక్షల టన్నుల బూడిదను రూ.400 టన్ను చొప్పున ఇటుక బట్టీల యజమానులే దక్కించుకున్నారు. అయితే, టెండర్లు దక్కించుకున్నా వర్క్‌ ఆర్డర్‌ పొందకుండా జాప్యం చేస్తున్నారు. వర్క్‌ ఆర్డర్‌ పొందితే సంవత్సరానికి రూ.120కోట్లు ఎన్టీపీసీకి చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ఎగ్గొట్టేందుకు ఎన్టీపీసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి టెండర్లను రద్దు చేయించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. టెండర్‌ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రెండు నెలలుగా ఎన్టీపీసీ బూడిదను బయటకు పోనివ్వడం లేదు. దీంతో మంచి సీజన్‌లో ఉన్న ఇటుక బట్టీల యజమానులు సింగరేణి, జెన్‌కో విద్యుత్‌ ప్లాంట్లకు ఎగబడ్డారు. కరీంనగర్‌ ఇటుక బట్టీల యజమానులు ఖమ్మం, భూపాలపల్లి, జైపూర్‌ పవర్‌ ప్లాంట్ల చుట్టూ తిరుగుతున్నారు. దీనిని గుర్తించిన సింగరేణి జైపూర్‌ పవర్‌ స్టేషన్‌లోని కొందరు అధికారులు లారీకి కొంత మాట్లాడుకొని రోజూ వంద లారీల బూడిదను బట్టీలకు ఇస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ఈ టెండర్ల విషయంలో అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరముందని విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-12-03T08:08:51+05:30 IST