నూజివీడు టు అమెరికా

ABN , First Publish Date - 2022-05-15T08:14:35+05:30 IST

గ్రామాల్లో తెలుగు మీడియంలో చదివి.. ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే

నూజివీడు టు అమెరికా

అంతర్జాతీయ పోటీలకు ట్రిపుల్‌ ఐటీ ప్రాజెక్టు

సాంకేతిక డిజైన్‌ కాంటెస్ట్‌ గ్రాండ్‌ ఫైనల్‌కు

23న అమెరికాలో ప్రదర్శన

వెళ్లేందుకు డబ్బుల్లేక విద్యార్థుల ఆందోళన

దాతల సాయం కోసం ఎదురుచూపులు


నూజివీడు, మే 14: గ్రామాల్లో తెలుగు మీడియంలో చదివి.. ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే అంతర్జాతీయ సాంకేతిక డిజైన్‌ కాంటెస్ట్‌ గ్రాండ్‌ ఫైనల్‌కు మన దేశం నుంచి రెండు టీమ్‌లు ఎంపిక కాగా.. వాటిలో ఒకటి నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల టీమ్‌. మరొకటి బెంగళూరు ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన టీమ్‌. ప్రపంచస్థాయి సాంకేతిక సంస్థలైన ఇన్‌టెల్‌ టెరాసిక్‌, మైక్రోసాఫ్ట్‌, ఆన్‌లాగ్‌ డివైజెస్‌, డీజీకే సంస్థలు 2021 నుంచి ఇన్నోవేట్‌ ఎఫ్‌పీజీఏ అంతర్జాతీయ సాంకేతిక డిజైన్‌ కాంటెస్ట్‌ నిర్వహిస్తున్నాయి. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. ఈ గ్రాండ్‌ ఫైనల్‌ పోటీ ఈ ఏడాది జూన్‌ 23న అమెరికాలోని కాలిఫోర్నియాలో జరగనుంది. అంతర్జాతీయ పోటీల్లో రీజియన్ల వారీగా 257 టీమ్‌లు పాల్గొన్నాయి. నాలుగు నెలలపాటు జరిగిన మొదటి దశ పోటీలు ముగిసే సరికి 145 టీమ్‌లు మిగిలాయి. మూడో దశ పోటీకి 34 టీములు మిగిలాయి.


ఈ 34 టీముల్లో ఆరు టీములు నూజివీడు ట్రిపుల్‌ ఐటీవి ఉన్నాయని నూజివీడు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఫైనల్‌ పోటీకి 11 టీములు ఎంపికకాగా, పసిఫిక్‌ రీజియన్‌ నుంచి మూడు టీములు ఎంపికయ్యాయి. వాటిలో రెండు ఇండియావి, మరొకటి శ్రీలంక టీమ్‌ ఉన్నాయి. ఫైనల్‌కు అర్హత సాధించిన నూజివీడు టీములో మూడో సంవత్సరం ఈసీ ఇంజినీరింగ్‌ విద్యార్థులు డి.జాహ్నవి, జ్యోత్స్న, ఎం.దుర్గారావు, డి.అశోక్‌కుమార్‌ ఉన్నారు. ఈ టీమ్‌కు ప్రొఫెసర్లు శ్యామ్‌, ఇర్ఫాన్‌ కోఆర్డినేటర్లుగా ఉన్నారు. 


సాంకేతిక వ్యవసాయమే నూజివీడు ప్రాజెక్టు

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు మల్టీ ఫంక్షనల్‌, మైక్రోప్రోసెస్‌ స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చరల్‌ బేసిక్‌ ఆబ్జెక్టివ్‌గా ఉంది. అగ్రికల్చరల్‌ సిస్టమ్‌, అగ్రికల్చరల్‌ ప్రాసె్‌సను ఎలక్ర్టానిక్స్‌తో అనుసంధానించడం ద్వారా రైతులకు వ్యవసాయంలో వివిధ దశల్లో ఉపయోగపడేలా ఈ ప్రాజెక్ట్‌ రూపొందించారు. ఈ ప్రాజెక్టులో క్రాప్‌ వాటర్‌ ప్రోగ్రాం, ఏ ఏ దశల్లో ఏవిధంగా పంటకు నీరందించాలి, పంటలపై రోగ నిర్ధారణ, ఎరువులు ఏ మోతాదులో ఏ దశలో ఎంత ఇవ్వాలి, భూమి సారం వంటి అంశాలను రైతులు తెలుసుకోవచ్చు.


ఆర్థిక సహకారం కోసం ఎదురుచూపులు

గ్రాండ్‌ ఫైనల్‌ పోటీకి నూజివీడు టీమ్‌ వెళ్లి రావడానికి సుమారుగా రూ.10 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో 50 శాతం వ్యయాన్ని పోటీలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థలు భరిస్తాయి. మిగిలిన మొత్తం విద్యార్థులు పెట్టుకోవాలి. ట్రిపుల్‌ ఐటీల్లో చదివే విద్యార్థులు పేద, మధ్యతరగతి వారే. ట్రిపుల్‌ ఐటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తుంది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు మాత్రం నిధులు సమకూర్చడం లేదు. దీంతో వీరు స్పాన్సర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఫైనల్‌ పోటీకి అర్హత సాధించిన తర్వాత తాము రూపొందించిన ప్రాజెక్ట్‌కు తుది మెరుగులు దిద్దుకోవల్సిన తరుణంలో.. ఈ విద్యార్థులు స్పాన్సర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

Updated Date - 2022-05-15T08:14:35+05:30 IST