అలా చేస్తే మనకు విలువేముంటుంది!

ABN , First Publish Date - 2021-11-01T05:30:00+05:30 IST

‘‘అసలు అనుకోలేదు... నటి అవుతానని. ఈ పరిశ్రమకు వస్తానని. నేనప్పుడు బెంగళూరులో పీయూసీ చదువుతున్నా. ....

అలా చేస్తే మనకు విలువేముంటుంది!

తనూజా పుట్టస్వామి... ఈ పేరు చెబితే రూపం కళ్ల ముందు కదలకపోవచ్చు. కానీ... ‘ముద్దమందారం’లో ‘పార్వతి’ అనగానే ఠక్కున గుర్తుకు వస్తుంది ఎవరికైనా.  ఐదేళ్లకు పైగా ఆ పాత్రలో లీనమై తెలుగువారిని విశేషంగా అలరించిన నటి ఆమె.ప్రస్తుతం ‘రాధికగా’ మరో విభిన్న పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన తనూజతో ‘నవ్య’ ముచ్చట్లు... 


‘‘అసలు అనుకోలేదు... నటి అవుతానని. ఈ పరిశ్రమకు వస్తానని. నేనప్పుడు బెంగళూరులో పీయూసీ చదువుతున్నా. ఆటలు, పాటలు... కొత్తగా కాలేజీలో అడుగుపెట్టాం కదా... ఒకటే ఉత్సాహం. అక్కడ నన్ను చూసినవారొకరు యాంకరింగ్‌ చేస్తావా అని అడిగారు. సరేనన్నాను. అలా ఏడెనిమిది నెలలు యాంకరింగ్‌లో గడిచిపోయాయి. నా అదృష్టమో ఏమోగానీ ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చింది... కన్నడ హర్రర్‌ సినిమా ‘6-5=2’లో హీరోయిన్‌గా! మా అమ్మా నాన్న వద్దంటే వద్దన్నారు. నేనూ వినలేదు. వెళ్లాల్సిందేనని పట్టు పట్టి చివరకు పంతం నెగ్గించుకున్నా. 2013లో ఆ చిత్రం విడుదలైంది. బాగా ఆడింది. దాన్ని ‘చిత్రం కాదు నిజం’ పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్‌ చేశారు. 


వరుస ఆఫర్లు... 

తొలి చిత్రం విజయవంతమవ్వడంతో నాకు మంచి పేరు, వరుస ఆఫర్లూ వచ్చాయి. వెంటనే మరో సినిమా ‘కాగె మోటె’కి సైన్‌ చేశాను. అందులో నటిస్తుండగానే ‘అన్నపూర్ణ ప్రొడక్షన్స్‌’ నుంచి పిలుపు... ‘ముద్దమందారం’ సీరియల్‌ కోసం! అప్పుడు పీయూసీ అయిపోయి ‘డిప్లమో ఇన్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌’ చదువుతున్నా. నిజానికి సీరియల్‌ చేయాలన్న ఆలోచన నాకు లేనేలేదు. చేతిలో సినిమాలున్నాయి. వాటిని వదిలేసి వెళ్లడమెందుకనిపించింది. అయితే ‘అన్నపూర్ణ పెద్ద ప్రొడక్షన్‌. అవకాశం వదులుకోవద్దు’ అని అప్పట్లో ఆ సంస్థకు క్రియేటివ్‌ హెడ్‌గా ఉన్న ప్రభు గారు చెప్పారు. దీంతో కాదనలేకపోయాను. వాళ్లే బెంగళూరుకు వచ్చి ఆడిషన్స్‌ తీసుకొని ఓకే చేశారు. 


మరిచిపోలేని అనుభూతి... 

2014లో ప్రారంభమైన ‘ముద్దమందారం’ సీరియల్‌ సుదీర్ఘంగా ఐదేళ్లపాటు నడిచింది. అందులో నేను పోషించిన ‘పార్వతి’ పాత్రకు విశేష ఆదరణ లభించింది. ఇప్పటికీ నా పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకువచ్చేది పార్వతే. ఒకటా రెండా... పదహారు వందల ఎపిసోడ్స్‌ చేశాను. ఒకే ప్రాజెక్ట్‌లో అన్నేళ్లు పనిచేయడం అదే మొదటిసారి. మొదట్లో సీరియల్‌ చేస్తానంటే అమ్మా నాన్న వద్దన్నారు. ఎలాగో వాళ్లకు నచ్చజెప్పి హైదరాబాద్‌ వచ్చాను. సీరియల్‌ విజయవంతమైంది. ఇప్పుడు మా వాళ్లు ఫుల్‌ హ్యాపీ.


కొవిడ్‌తో బ్రేక్‌... 

తెలుగులో తొలి ప్రాజెక్ట్‌ అవ్వగానే తమిళ్‌లో ‘శివ మనసులో శక్తి’ సీరియల్‌ మొదలైంది. ఏడాదికి పైగా మంచి ఆదరణతో నడిచింది. అయితే ఈలోగా కరోనా వ్యాప్తి మొదలైంది. అన్నీ బంద్‌ అయిపోవడంతో నేనూ ఇంట్లో నుంచి కదల్లేదు. ఏడాది గడిచిపోయింది. అదే పరిస్థితి. ఇక ఈ పరిశ్రమను వదిలేద్దామనుకున్నా. ఆ విషయం తెలిసి సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, శ్రేయోభిలాషులు ‘మీరు రావాలి. నటించాలి’ అంటూ పెద్దఎత్తున కామెంట్స్‌ పెట్టారు. అవి నాకు ప్రేరణ కలిగించాయి. మరో ప్రాజెక్ట్‌ చేద్దామని నిర్ణయించుకున్నా. 


‘అగ్నిపరీక్ష’తో మొదలు... 

అదే సమయంలో ‘జీ తెలుగు’ వారి ‘అగ్నిపరీక్ష’ సీరియల్‌లో ఆఫర్‌ వచ్చింది. కథ నచ్చడంతో రెండేళ్ల విరామం తరువాత మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నా. కరోనా తరువాత ఇదే నా తొలి ప్రాజెక్ట్‌. సెప్టెంబర్‌లో ప్రారంభమైంది ఈ సీరియల్‌. అందులో నాది మెడిసిన్‌ చదివే ‘రాధిక’ పాత్ర. ఆమెది హుందాగల వ్యక్తిత్వం. అమ్మా నాన్నలంటే ప్రేమ, గౌరవం. విభిన్నమైన కథ ఇది. 


డేట్స్‌ కుదరక... 

ఇప్పుడు సినిమాల్లో చేయమని కూడా అడుగుతున్నారు. కానీ డేట్స్‌ కుదరడంలేదు. ఉంటే ఖాళీగా ఉంటాం... లేదంటే అన్నీ ఒకేసారి వస్తాయి. ఒకరిద్దరు సలహాలిచ్చారు... ‘సినిమా అవకాశాలు వస్తుంటే ఇంకా సీరియల్స్‌ పట్టుకుని ఎందుకు కూర్చొంటారు’ అని! ‘చేస్తున్న ప్రాజెక్ట్‌ను మధ్యలో వదిలేసి వెళ్లడం సరైంది కాద’ని వాళ్లకు చెప్పాను. అయినా నన్ను నమ్మి డబ్బులు పెట్టినవాళ్లు అన్యాయమైపోతారు కదా! అలా చేస్తే మనకు విలువేముంటుంది! ఒకళ్లను మోసం చేసి మనం ఎలా ఎదుగుతాం! పరిశ్రమలోకి అడుగుపెట్టింది మొదలు ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతోంది. అడగకపోయినా అవకాశాలు వస్తున్నాయి. కారణం... నేను నిజాయితీగా పనిచేయడమే!  


అమ్మ నేర్చుకొంటుంది... 

షూటింగ్‌ లేనప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోను. వంట బాగా చేస్తాను. చికెన్‌, మటన్‌, ఫిష్‌... నాన్‌వెజ్‌ వంటకమేదైనా బాగా వండుతాను. నేను చేస్తే ఇంట్లోవాళ్లందరూ చాలా ఇష్టంగా తింటారు. మా అమ్మయితే ‘ఆ రెసిపీ ఎలా’ అని అడిగి తెలుసుకొంటారు. ఇప్పుడు కూడా కిచెన్‌లో అమ్మకి నేర్పిస్తున్నా. అప్పుడప్పుడూ డ్రాయింగ్‌ వేస్తాను. పుస్తకాలు చదువుతాను. బ్యాడ్మింటన్‌ ఆడతాను. చిన్నప్పుడు అమ్మ నేర్పించింది. అక్క, చెల్లి, నేను కలిశామంటే ఇక ఇంట్లో సందడే సందడి. 


వాళ్లే నా బలం... 

మా చెల్లికి కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ తనకు ఈ పరిశ్రమలోకి రావడం ఇష్టంలేదు. అప్పుడప్పుడు అక్క, చెల్లి నన్ను అడుగుతుంటారు... ‘గంటలకు గంటలు సెట్స్‌లో ఉంటావు. నీకు అంత ఓర్పు ఎక్కడిద’ని! ఇష్టపడి చేస్తే ఏ పనీ కష్టం అనిపించదు కదా! అయితే ఇంట్లోవాళ్లు నా సీరియల్స్‌, సినిమాలు మాత్రం వదలకుండా చూస్తుంటారు. మేకప్‌ తదితర సూచనలు ఇస్తుంటారు. నా కుటుంబం, నాపై నాకు నమ్మకం... ఇవే నా బలం.’’ 


 హనుమా 



ఇంకా ఫిక్స్‌ కాలేదు...

ఆడపిల్ల అనగానే చాలామంది అడుగుతుంటారు... ‘భర్తగా ఎలాంటివాడు కావాలనుకొంటున్నావు’ అని! ముందు అక్క పెళ్లి కావాలి. ఆ తరువాత నా గురించి ఆలోచిస్తాను. స్నేహితులు అంటుంటారు... బాయ్‌ఫ్రెండ్‌ అంటే అలా ఉండాలి... ఇలా ఉండాలి అని! ‘అలా ఎందుకు ఉండాలి’ అని వాళ్లని అడుగుతుంటాను. ఎందుకంటే నేనెప్పుడూ అనుకోలేదు... ఇలాంటివాడే కావాలని. నాకు నా టార్చర్‌ని భరించే వాడైతే చాలు.  


Updated Date - 2021-11-01T05:30:00+05:30 IST