రక్షణ ఏదీ?

ABN , First Publish Date - 2020-04-05T08:43:31+05:30 IST

ఎంత గొప్ప యోధుడైనా.. కత్తి, కవచం, డాలు లేకుండా యుద్ధరంగానికి వెళితే ప్రమాదమే! కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన యోధులు.. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పరిస్థితి ప్రస్తుతం...

రక్షణ ఏదీ?

  • వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల కొరత
  • రాష్ట్రంలో 6118 పీపీఈ సూట్లు
  • వారం రోజులకు కూడా సరిపోని దుస్థితి
  • రక్షణ దుస్తులు లేకపోవడంతోనే సమస్య
  • దేశవ్యాప్తంగా కావాల్సినవి 10 లక్షల సూట్లు
  • 80 వేల కిట్లు మాత్రమే అందుబాటులో
  • గాంధీలో యాప్రాన్‌లతోనే బాధితులకు
  • చికిత్స చేస్తున్న కొంతమంది నర్సులు!
  • ఇలాగైతే సేవలందించలేమని ఆందోళన
  • 5 లక్షల సూట్లను కొనుగోలు చేశామన్న సర్కారు
  • ఇండెంట్‌ మాత్రమే పెట్టినట్లు చెప్తున్న వైద్యులు
  • అందడానికి నెల రోజుల దాకా పట్టే అవకాశం
  • దేశవ్యాప్తంగా దాదాపుగా 100 మంది 
  • వైద్యులు, నర్సులు, పారామెడిక్స్‌కు వైరస్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఎంత గొప్ప యోధుడైనా.. కత్తి, కవచం, డాలు లేకుండా యుద్ధరంగానికి వెళితే ప్రమాదమే! కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన యోధులు.. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. వైరస్‌ నుంచి రక్షణ కల్పించే పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌ (పీపీఈ సూట్లు) లేకుండానే.. కొంత మంది నర్సులు కరోనా వార్డుల్లో సేవలందించడానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీనివల్ల దేశవ్యాప్తంగా 50 మందికి పైగా వైద్యులు, నర్సులు, పారామెడిక్స్‌ వైరస్‌ బారిన పడ్డారని ప్రభుత్వమే చెబుతోంది.


అనధికారిక లెక్కల ప్రకారమైతే 100 మందికి పైగానే ఇలా వైరస్‌ బారిన పడినట్టు సమాచారం. ఉదాహరణకు.. దేశంలోనే అతున్నత స్థాయి వైద్యానికి చిరునామాగా భావించే ఎయిమ్స్‌ (ఢిల్లీ) ఆస్పత్రిలో ఒక వైద్యుడికి ఇటీవలే కరోనా పాజిటివ్‌ వచ్చింది. ముంబైలో సైతం ముగ్గురు వైద్యులకు ఈ వైరస్‌ సోకగా.. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ వారికి సోకకుండా సంరక్షించే పీపీఈ కిట్లు లేకపోవడమే ఇందుకు కారణం. కొత్త వైర్‌సలు విజృంభించి మానవాళి మనుగడనే ప్రమాదంలో పడేసినప్పుడు.. వైరస్‌ సోకిన వారిని తాకి చికిత్స చేసే వైద్యులు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా ముఖానికి మాస్కు, ఒంటికి గౌను, చేతులకు గ్లవ్స్‌ ధరించాలి. వాటన్నింటినీ కలిపి ‘పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌ (పీపీఈ)’ అంటారు. కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యసిబ్బందికి అత్యవసరమైన ఈ పీపీఈ కిట్లు తగినన్ని అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో కరోనా బారిన పడినవారికి ప్రస్తుతం హైదరాబాద్‌లో గాంధీ, కింగ్‌కోఠీ, చెస్ట్‌ ఆస్పత్రుల్లో మాత్రమే చికిత్స చేస్తున్నారు. గాంధీలోనే 70 మంది దాకా బాధితులకు చికిత్స చేస్తున్నారు. వారికి చికిత్స అందించేందుకు షిప్టుల వారీగా వైద్యులు, సిబ్బందికి డ్యూటీలు వేశారు. కానీ, పీపీఈ కిట్లు లేకపోవడంతో వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 


ఏ మూలకూ చాలవు!

రాష్ట్రంలో ప్రస్తుతం 6118 పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కిట్లు పునర్వినియోగానికి పనికిరావు. వాటిని డిస్పోజ్‌ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. కరోనా వార్డు బయట మూడు రకాల టబ్బులు ఉంటాయి. వాటిలో ఒకదాంట్లో గౌన్లు, మరొక దాంట్లో గ్లవ్స్‌, మూడో దాంట్లో మాస్కులను వేయాల్సి ఉంటుంది. తర్వాత వాటిని డిస్పోజ్‌ చేస్తారు. ప్రస్తుతం గాంధీ, కింగ్‌కోఠీ, ఛాతీ ఆస్పత్రులు మూడింటిలో కలిపి 600 మంది దాకా వైద్యులు కరోనా బాధితులకు చికిత్సలందిస్తున్నారు. వారందరూ ఒక్కసారి వాడి డిస్పోజ్‌ చేస్తారనుకున్నా.. మనవద్ద ఉన్న పీపీఈ కిట్లు కేవలం 5-6 రోజుల వరకూ సరిపోతాయంతే! వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో 5-6 రోజుల తర్వాత పరిస్థితి ఏమిటనే భయాందోళనలు వైద్యవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.


ఈ నేపథ్యంలో.. ఒక్కసారి ఈ దుస్తులు వేస్తే డ్యూటీ అయిపోయేంతవరకూ వాటిని ఉంచుకోవాల్సిందేనని అధికారులు ఆదేశిస్తున్నట్టు కొందరు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో డాక్టర్‌ కనీసం 12 గంటల పాటు కరోనా వార్డుల్లో సేవలందిస్తున్నారు. అంతసేపూ వారు ఆ సూట్‌లో ఉండాల్సిందే. ఇక, ఆయా వార్డుల్లో చికిత్స అందించే నర్సుల్లో కొంతమందికి మాత్రమే పీపీఈ కిట్లు ఇస్తున్నట్లు  సమాచారం. మిగతావారికి.. ఎయిడ్స్‌ రోగులకు చికిత్స చేసే సమయంలో వాడే సాధారణ యాప్రాన్‌లనే ఇస్తున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక నర్సు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ మూడు ఆస్పత్రుల్లో కాకుండా మిగతా ఆస్పత్రులకు కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చేవారికి చికిత్స చేసే వైద్యులకు పీపీఈ కిట్లే అందుబాటులో లేవు.

విరాళాలివ్వండి ప్లీజ్‌!

గాంధీ ఆస్పత్రిలో వైద్యులకు పీపీఈలు లేవని, ఎన్నిసార్లు సర్కారుకు మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదని.. పీపీఈ కిట్ల కోసం దాతలు ముందుకు రావాలని కోరుతూ ‘గాంధియన్స్‌ ఫైట్‌ కొవిడ్‌19’ పేరుతో సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌ అవుతోంది. 


5 లక్షల కిట్లు కొన్నామంటున్నా..

ఐదు లక్షల పీపీఈ కిట్లు కొన్నామని ప్రభుత్వం శనివారం సాయంత్రం 7 గంటలకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. కానీ.. ఆ మేరకు ఇండెంట్‌ మాత్రమే పెట్టారని, కిట్లు ఇంకా అందలేదని విశ్వసనీయవర్గాల సమాచారం. దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రులన్నింటికీ పీపీఈలను సరఫరా చేసే నోడల్‌ సంస్థ.. హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌. ముడిపదార్థాల కొరత ఎక్కువగా ఉన్నందున పీపీఈ ఆర్డర్ల సరఫరా 25 నుంచి 30 రోజుల దాకా ఆలస్యమవుతుందని ప్రభుత్వ ఆస్పత్రులకు ఆ సంస్థ ఇటీవలే తెలిపింది. పీపీఈలకు కావాల్సిన ముడిపదార్థాలను దేశంలోని పలువురు చిన్న, మధ్యతరహా ఉత్పత్తిదారులు పెద్దఎత్తున కొనుగోలు చేసేశారని.. కానీ, వాటిని పీపీఈ కిట్లుగా మలిచే కేంద్రాలు మాత్రం కొన్నే ఉన్నాయని, అందుకే ఈ ఆలస్యం అని హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులకు 80 వేల పీపీఈ కిట్లు పంపినట్టు వివరించాయి. కానీ.. అవి ఏమూలకూ సరిపోవు. ఇప్పుడున్నపరిస్థితుల్లో దేశవ్యాప్తంగా 10 లక్షల పీపీఈ సూట్ల అవసరం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 11 సంస్థలకు పీపీఈ సూట్ల తయారీకి అనుమతిచ్చింది. అవి రావడానికి 4 నెలలు పడుతుందని అంచనా.


దగ్గరకెళ్తే తుమ్ములు.. దగ్గులు

కరోనా పాజిటివ్‌ రోగుల్లో కొందరు ముష్కరులు వైద్య సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌కు వారు సహకరించట్లేదని తెలుస్తోంది. ‘‘మా ఇబ్బందులను అర్థం చేసుకుని చాలామంది మాకు సహకరిస్తున్నారు. కొందరు మాత్రం.. ఉద్దేశపూర్వకంగా తుమ్మడం, దగ్గడం లాంటివి చేస్తున్నారు’’ అని ఒక నర్సు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరేమో.. వార్డుల్లో అటూఇటూ ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని.. తిరగొద్దని చెప్పబోతే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆమె వివరించారు.


Updated Date - 2020-04-05T08:43:31+05:30 IST