‘ఆసరా’ అందేదెప్పుడో?

ABN , First Publish Date - 2021-06-11T10:25:47+05:30 IST

కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు ఇటీవల మంత్రివర్గ సమావేశం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆసరా దరఖాస్తుదారుల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో

‘ఆసరా’ అందేదెప్పుడో?

నాలుగు లక్షలకుపైగా దరఖాస్తుల పెండింగ్‌

అర్హతలున్నా  తప్పని ఎదురు చూపులు

రెండున్నరే ళ్లుగా కొత్తవి మంజూరు కాలేదు

57 ఏళ్లకే పింఛన్‌ హామీ ఇంకా నెరవేరలేదు

అన్నీ మంజూరైతే.. అరకోటి లబ్ధిదారులు

కొత్త రేషన్‌ కార్డులకు అనుమతితో ఆసరాపై ఆశలు?


హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్‌ కార్డుల మంజూరుకు ఇటీవల మంత్రివర్గ సమావేశం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆసరా దరఖాస్తుదారుల్లోనూ ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. దీంతో ఆసరా పథకం కింద దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద 38.50 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. ఇందులో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, గీత కార్మిక, చేనేత కార్మిక, ఒంటరి మహిళ, బీడీ కార్మిక, హెచ్‌ఐవీ బాధిత, పైలేరియా బాధితులు ఉన్నారు.


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఆసరా కింద వికలాంగులకు రూ.1500, ఇతరులకు రూ.1000 అందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి వికలాంగులకు రూ.3016, ఇతరులకు రూ.2016 అందిస్తున్నారు. అదే సందర్భంలో వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయసును 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కానీ, అది ఇప్పటిదాకా నెరవేరలేదు. గతంలో ఆసరా పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వెంటనే విచారణ జరిపి, ఆ మరుసటి నెలే పింఛన్‌ మంజూరు చేసే వారు. కానీ, 2018లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి ఇప్పటిదాకా ఒక్క కొత్త పింఛన్‌ కూడా మంజూరు చేయలేదు. అన్ని కేటగిరీల వారు దరఖాస్తు చేసుకుంటున్నా... పెండింగ్‌లోనే పెట్టారు. ఇటువంటి దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల వరకూ ఉంటాయని సమాచారం. అదేవిధంగా అర్హత వయసు తగ్గిస్తే అదనంగా 7 లక్షల మంది అర్హత పొందనున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం వృద్ధాప్య పింఛన్‌కు 65 ఏళ్లు, చేనేత, గీత, బీడీ కార్మికులకు 50ఏళ్లు, వితంతువులకు(18ఏళ్లు పైబడి భర్త చనిపోయి ఉంటే), ఒంటరి మహిళలకు 35 ఏళ్లుగా అర్హత వయసు ఉన్నది.


వికలాంగులు, పైలేరియా, ఎయిడ్స్‌ బాధితులకు ఎటువంటి అర్హత వయసు లేదు. ఈ అర్హతల ప్రకారం ఏటా ఆసరా పింఛన్‌కు అర్హత పొందే వారు సుమారు లక్షకు పైగానే ఉంటారు. రెండున్నరేళ్లుగా కొత్తవి మంజూరు చేయకపోవడంతో 4 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా వృద్ధాప్య పింఛన్‌ అర్హత వయసు తగ్గిస్తే అదనంగా 7 లక్షల మందికిపైగా అర్హత పొందుతారు. వీటన్నింటికీ ప్రభుత్వం ఆమోదం తెలిపితే... ఆసరా లబ్ధిదారులు అరకోటికి చేరువ అవుతారు. 

Updated Date - 2021-06-11T10:25:47+05:30 IST