కేసీఆర్‌కు ఇక కునుకుండదు
ABN , First Publish Date - 2021-06-30T09:25:19+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడిగా తన పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించగానే.. రాష్ట్రంలోని విపక్ష నేతలకు ప్రగతి భవన్ తలుపులు తెరుచుకున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు.
- బందీ అయిన తెలంగాణను విడిపిస్తా
- నాకు పీసీసీ ఇవ్వగానే విపక్ష నేతలకు ప్రగతి భవన్ తలుపులు తెరుచుకున్నాయి
- మంత్రి కేటీఆర్‌ను మూసీలో నిలబెట్టాలి
- అప్పుడే పేద ప్రజల బాధలు తెలుస్తాయి
- ప్రగతిభవన్‌కు పన్ను చెల్లించడం లేదు
- బీజేపీ పగటి వేషగాళ్లు ఎటుపోయారు?
- బండి ఓ సైడు.. గుండు ఓ సైడు అయ్యారు
- టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడిగా తన పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించగానే.. రాష్ట్రంలోని విపక్ష నేతలకు ప్రగతి భవన్ తలుపులు తెరుచుకున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ దోపిడీ దొంగల పాలైందని, కేసీఆర్ చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పిస్తానని ప్రకటించారు. ఇకపై కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తానన్నారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయినందుకు సమ్మక్క సారలమ్మకు ముడుపులు చెల్లించిన పార్టీ ఎమ్మెల్యే సీతక్క.. మంగళవారం ఆయనను క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తన కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి పోలీస్స్టేషన్లో ఆరు నెలలకు ఓసారి ఎస్‌ఐ మారుతున్నాడని, ఎస్‌ఐ పోస్టుకు రూ.10 లక్షలు, సీఐ పోస్టుకు రూ.25 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు నెలనెలా మామూళ్లు ఇవ్వాల్సి వస్తోందన్నారు. ఈ విష సంస్కృతికి కేసీఆర్ పాలనే కారణమన్నారు.
పార్టీకి యువ ప్రతినిధి ఉండాలనే సీనియర్లను ఒప్పించి సోనియాగాంఽధీ తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని తెలిపారు. పేదల ప్రజల సమస్యలపై పోరాటానికి పీసీసీ పదవి తనకు ఒక అవకాశమన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కిందని, కానీ, ఇప్పుడు చేసిన పనులకు బిల్లులు రాక ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీల వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని తెలిపారు. ఎన్టీఆర్, వైఎ్‌సఆర్ హయాంలో సంక్షేమ పాలన సాగిందన్నారు.
కేటీఆర్.. మూసీలో నిలబడు..
మంత్రి కేటీఆర్‌ను మూసీలో నడుముల లోతు దింపి నాలుగు గంటలు నిలబెడితే మురికి కంపు, పేద ప్రజల ఇబ్బందులు, దోమలతో బాధలు తెలుస్తాయని రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ రోజు త్వరలో వస్తుందన్నారు. టీవీలలో వచ్చే ఫ్యాషన్ పరేడ్‌లా ఆయన పర్యటనలు ఉంటాయని, కేటీఆర్ వాక్.. ఫ్యాషన్ షోలో క్యాట్ వాక్ ఒకేలా ఉంటాయని ఎద్దేవా చేశారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన లింగోజిగూడ కార్పొరేటర్ దర్పెల్లి రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. విశ్వనగరమైన హైదరాబాద్‌ను కేటీఆర్, సోమే్‌షకుమార్, లోకే్‌షకుమార్, అర్వింద్‌కుమార్ చెత్తనగరంగా మార్చారన్నారు. కేటీఆర్ లాంటి అవగాహన లేని వ్యక్తి మంత్రిగా ఉండడం మన దురదృష్టమని విమర్శించారు. నాలాలో వ్యర్థాలు తీయకపోతే.. ఓ ఎమ్మెల్యే కాంట్రాక్టర్‌పై చెత్త వేసి నిరసన తెలిపారని, తాము కూడా కేటీఆర్‌కు అదే తరహాలో సన్మానం చేయాలనుకుంటున్నామని అన్నారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తామని.. ఎన్నికల అనంతరం ప్రజలు వరదల్లో కొట్టుకుపోయినా సంబంధం లేదన్నట్టు కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ప్రగతిభవన్‌ను వేలం వేయాలి...
పన్నుల రూపంలో జీహెచ్‌ఎంసీకి రావాల్సినవి ప్రభుత్వం చెల్లించడం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. బల్దియాకు అత్యంత ఎక్కువ మొత్తంలో పన్ను బకాయిదారుగా సర్కారు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ నివసిస్తున్న ప్రగతిభవన్‌కు కూడా పన్ను చెల్లించడం లేదని, బకాయిలు ప్రభుత్వం చెల్లించకుంటే ప్రగతిభవన్‌ను వేలం వేయాలని డిమాండ్ చేశారు. వరదలో కొట్టుకుపోయిన వారిని ఆదుకుంటామని భాగ్యలక్ష్మి దేశాలయంలో ఒట్టేసిన బీజేపీ పగటి వేషగాళ్లు ఎక్కడున్నారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వరదల్లో బండిపోతే బండి ఇస్తానన్న బండి ఓవైపు, గుండు ఓవైపు సైడ్ అయిపోయారని ఎద్దేవా చేశారు.
రేవంత్‌కు బొట్టు పెట్టి.. రక్ష కట్టిన సీతక్క
రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడంతో మేడారం సమ్మక్క, సారలమ్మలకు ముడుపులు చెల్లించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. వందలాది మంది కార్యకర్తలు, భారీ కారు ర్యాలీతో హైదరాబాద్‌కు వచ్చారు. రేవంత్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ దేవుళ్ల దగ్గర ప్రత్యేక పూజలు చేసి తెచ్చిన బొట్టును రేవంత్‌కు పెట్టారు. రక్షనూ కట్టారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, రామచంద్ర నాయక్, విజయ రమణారావు తదితరులూ రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీతక్క తల్లిని రేవంత్‌రెడ్డి పరామర్శించారు. రేవంత్‌రెడ్డికి అభినందనలు చెప్పడానికి వచ్చినవారితో ఆయన క్యాంపు కార్యాలయం మంగళవారం కూడా కిటకిటలాడింది. కాగా, అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో బుధవారం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు బుధ, గురు వారాల్లో సాయంత్రం 4 తర్వాతే రావాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ముందుగా నిర్దారించిన కార్యక్రమాల్లో తాను పాల్గొనాల్సి ఉందని తెలిపారు.
