‘కేసినో’కు తగ్గేదేలే!

ABN , First Publish Date - 2022-01-18T08:39:43+05:30 IST

‘గోవాలోని కేసినోలకు ఏమాత్రం తగ్గొద్దు! శ్రీలంక కేసినోలను మైమరిపించాలి! నొప్పి తెలియకుండా

‘కేసినో’కు తగ్గేదేలే!

  • గుడివాడ గ్యాంగ్‌ ‘ఘనమైన’ ఏర్పాట్లు.. మంత్రి కొడాలి కన్వెన్షన్‌ హాలే వేదిక
  • అచ్చం గోవా, శ్రీలంక కేసినోలను దించేశారు.. ప్రతి టేబుల్‌పై ప్రొఫెషనల్‌ కేసినో డీలర్స్‌
  • సుశిక్షితులైన అమ్మాయిలతోనడిచిన ఆట.. కేసినో తరహా కాయిన్లతోనే జూద క్రీడ
  • అధికార వైసీపీ రంగులతో అలంకరణ.. ‘పాత ఖాతాదారుల’కు ముందే ఆహ్వానాలు
  • సోమవారం తెల్లవారుజాము దాకా ఆటలు.. ఎంట్రీ ఫీజు ద్వారానే రూ.2 కోట్లు వసూలు
  • మొత్తంగా రూ.200 కోట్లు ఆదాయం!?.. హడావుడి తగ్గాక మళ్లీ ఆటకు సన్నద్ధం?


(విజయవాడ  - ఆంధ్రజ్యోతి)

‘గోవాలోని కేసినోలకు ఏమాత్రం తగ్గొద్దు! శ్రీలంక కేసినోలను మైమరిపించాలి! నొప్పి తెలియకుండా డబ్బులు లాగేయాలి!’... అని అనుకున్నారు! అనుకున్నది అనుకున్నట్లుగా చేసేశారు. గోవా కేసినోలను అచ్చు గుద్దినట్లు గుడివాడలో దించేశారు. అక్కడి కేసినోలలో ఉన్నట్లుగానే కాయిన్లు! ఎంట్రీ చార్జీ రూ.10 వేలు! అన్‌లిమిటెడ్‌గా మందు, విందు! అదనంగా... అమ్మాయిలతో హుషారెత్తించే నృత్యాలు! కేసినోలలో టేబుళ్ల వద్ద గేమ్‌ నడిపించింది అమ్మాయిలే. 


ఈశాన్య రాష్ట్రాలు, నేపాల్‌కు చెందిన సుశిక్షితులు ప్రొఫెషనల్‌గా ఆట ఆడిస్తారు. వీరినే ‘కేసినో డీలర్స్‌’ అంటారు. ‘గుడివాడ గ్యాంగ్‌’ ఈ విషయంలోనూ వెనక్కి తగ్గలేదు. సిసలైన కేసినోలలో పనిచేసే అమ్మాయిలనే ఇక్కడికీ రప్పించారు. గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో రొటీన్‌గా మగాళ్లు నిర్వహించే గుండాట టేబుళ్లు కనిపించగా... గుడివాడ గ్యాంగ్‌ ‘జూదశాల’ మాత్రం హైఫై ప్రొఫెషనల్‌ కేసినో డీలర్‌ అమ్మాయిలతో కళకళలాడాయి.



అధికార ముద్ర..: గుడివాడలో సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి అనుచరులు కొందరు ఒక గ్రూపుగా ఏర్పడి ఈ కేసినో ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే... ఈ జూదక్రీడకు కర్త, కర్మ ఆ మంత్రేనని చెప్పుకొంటున్నారు. మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్‌ హాలులోనే ఈ కేసినోను నిర్వహించారు. శుక్రవారం భోగి రోజున మొదలైన కేసినో సోమవారం తెల్లవారుజాము దాకా సాగింది. స్వాగత తోరణం నుంచి లోపలి అలంకారం వరకు అంతటా ‘అధికార ముద్ర’ కనిపించింది. వైసీపీ పతాకంలోని వర్ణాలైన ఆకుపచ్చ, నీలం, తెలుపు వస్త్రాలతో కేసినోను అలంకరించారు. కిందంతా మెత్తటి ఎర్ర తివాచీ పరిచారు. వివిధ రకాల క్రీడల కోసం వేర్వేరు టేబుళ్లు ఏర్పాటు చేశారు. గుండాట, అందర్‌ బాహర్‌తోపాటు... కేసినోలలో కనిపించే ‘రౌలెట్‌’ గేమ్‌ కూడా పెట్టారు. దాదాపు అన్ని టేబుళ్ల వద్ద ప్రొఫెసనల్‌ కేసినో డీలర్లు (అమ్మాయిలు) ఆట నడిపించారు.


గోవాలో టాప్‌ కేసినోలో ఎంట్రీ ఫీజు రూ.6వేలు మించదు. గుడివాడ కేసినోలో మాత్రం రూ.10వేలుగా నిర్ణయించారు. డబ్బులు కట్టిన వారినే లోపలికి అనుమతించారు. గతంలో గుడివాడ నియోజకవర్గంలో పేకాట శిబిరాలకు హాజరైన ‘జూద ప్రియుల’కు ముందుగానే కేసినోకు సంబంధించిన సమాచారం పంపించారు. ‘మరేం ఫర్వాలేదు. మూడు రోజులు ఏమాత్రం భయం లేకుండా ఆడుకోవచ్చు. రండి... తరలి రండి’ అని పిలుపునిచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాత, కొత్త ‘ఖాతాదారులు’ గుడివాడలో వాలిపోయారు.



కోట్లు పోగేశారు... 

రూ.10వేల చొప్పున ప్రవేశ రుసుము నిర్ణయించినప్పటికీ... అచ్చం కేసినోలను దించేయడం, పోలీసుల భయం లేకుండా ఆడే అవకాశం ఉండటంతో జూదరులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కేవలం ‘ఎంట్రీ ఫీజు’ రూపంలోనే నిర్వాహకులకు 3 రోజుల్లో సుమారు రూ.2 కోట్లు వరకు వచ్చిందని సమాచారం. ఇక... సోమవారం తెల్లవారుజాము వరకు రాత్రింబవళ్లు నిర్విరామంగా ఆటలు సాగాయి. ఇందులో దాదాపు రూ.200 కోట్లు కుమ్మేసినట్లు తెలుస్తోంది. 




మూసివేత తాత్కాలికమే!

‘గుడివాడ కేసినో’పై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. దీంతో సోమవారం తెల్లవారుజామున కేసినో క్రీడకు తెరపడింది. అయితే ఇది తాత్కాలికమేనని, హడావుడి సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఆట మొదలవుతుందని నిర్వాహకులు చెబుతున్నట్లు తెలిసింది. కే-కన్వెన్షన్‌లో భారీ ఎత్తున జూదక్రీడ సాగుతున్నప్పటికీ స్థానిక పోలీసులు కన్నెత్తి చూడలేదు. స్వయంగా మంత్రికి సంబంధించిన కన్వెన్షన్‌ హాలు కావడంతో అటువైపు అడుగు వేసేందుకే సాహసించలేదు. ఇక... నిర్వాహకులు కన్వెన్షన్‌ హాలు లోపల, బయట కాపలాగా ఉండేందుకు, ఎవరైనా వివాదం చేస్తే బయటకు తోసేయడానికి ప్రత్యేకంగా హైదరాబాద్‌ నుంచి బౌన్సర్లను గుడివాడకు రప్పించారు. లోపల కొందరు యథాలాపంగా వీడియోలు తీయగా.. వారి ఫోన్లను లాక్కున్నారు. 


Updated Date - 2022-01-18T08:39:43+05:30 IST