Abn logo
Oct 16 2020 @ 17:01PM

నిజామాబాద్‌ జిల్లాలో కమలం ఓటమికి కారణం ఇదేనా?

Kaakateeya

అంతవరకు బలంగా ఉన్న రాజకీయ పక్షం ఒక్కసారిగా డీలా పడింది. ఆ పార్టీ నాయకుల్లో ఉన్న కమిట్‌మెంట్ కనుమరుగైంది. ప్రత్యర్థుల వలలో చిక్కకుండా తమ ఐకమత్యాన్ని చాటుకుంటామన్న ఆ పార్టీ నేతలు చెల్లాచెదురయ్యారు. మొత్తానికి ఓ బలమైన శక్తిగా ఉన్న ఆ పార్టీ ఒక్కసారిగా బలహీన పడింది. నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఇచ్చిన ఝలక్ ఇది. ఇంతకీ, ఇందూరు గడ్డపై బీజేపీ ఉన్నట్లుండి డౌన్ ఫాల్ కావడానికి కారణాలేమిటో.. ఈ కథనంలో చూద్దాం.

నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బలమైనశక్తిగా ఉంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు బ్రహ్మరథం పట్టారు. టీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై ఆయన విజయం సాధించారు. ఆ వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ నేతలు తమ శక్తిని చాటుకున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతర రాజకీయ పక్షాలకంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 60 డివిజన్లలో 28 డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఈ దరిదాపుల్లో కూడా లేవు. కానీ, ఈ పక్షాలన్నీ ఒక్కటై మున్సిపల్ మేయర్ పీఠాన్ని హస్తగతం చేసుకున్నాయి. బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషించక తప్పలేదు. దీంతోపాటు రెండు జడ్పీటీసీ స్థానాలు, పలు ఎంపీటీసీ సభ్యులను బీజేపీ సాధించింది. అలాగే కామారెడ్డి జిల్లాలోనూ ఈ పార్టీ నేతలు ఉనికి చాటుకున్నారు. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 84 మంది స్థానిక సంస్థల్లో తమ ప్రాతినిధ్యం ప్రదర్శించారు. ఇదంతా ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందు పరిస్థితి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత బీజేపీలో కుదుపు వచ్చింది. ఆ పార్టీ బలహీనపడటం నెమ్మదిగా మొదలైంది. 

నిజానికి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ మొదలైన వెంటనే బీజేపీ ప్రతినిధులు పక్కచూపులు చూడటం మొదలెట్టారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు.. తమ బలాన్ని, బలగాన్ని మరింత పెంచుకునేందుకు కమలనాథులపై కన్నేశారు. వ్యక్తిగత సంప్రదింపులు, చర్చల ద్వారా ఒక్కో ప్రతినిధికి గాలం వేశారు. ఈ ఆకర్ష్ పథకానికి బీజేపీ ప్రతినిధులు ఆకర్షితులయ్యారు. ఒక్కొక్కరుగా బీజేపీకి గుడ్ బై చెప్పి గులాబీ గూట్లో చేరిపోయారు. రాత్రికి రాత్రి నిర్ణయాలు జరిగిపోయి..  తెల్లారేసరికి గులాబీ కండువాలు కప్పుకున్న ప్రతినిధులు చాలామంది ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని కార్పొరేటర్లతోపాటు జిల్లావ్యాప్తంగా సుమారు 30 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు బీజేపీని వీడి.. టీఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పోతన్ కర్ లక్ష్మీనారాయణకు 56 ఓట్లు మాత్రమే వచ్చాయి. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఈ ఫలితాల తర్వాత బీజేపీ బలహీనపడిందనే చర్చ జరుగుతోంది.

వాస్తవానికి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీకి గెలిచే అవకాశం లేదు. అయినా ప్రత్యర్థికి గట్టిపోటీ ఇవ్వాల్సి ఉందనీ.. అంతకుమించి తమ ఐక్యతను, పార్టీ కమిట్‌మెంట్‌ను చాటుకోవాల్సి ఉందనీ బీజేపీ ముఖ్య నేతలు భావించారట. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై రాష్ట్ర స్థాయి నేతలు దృష్టి పెట్టారు. ఇక్కడ బీజేపీ ఎంపీ అర్వింద్ కీలకంగా పనిచేయడం, టీఆర్ఎస్ నుంచి కవిత బరిలో ఉండటంతో అందరూ ఆసక్తి చూపించారు. ఫలితం ఏకపక్షమేనని తెలిసినా, బీజేపీ నేతలు ఏ మేరకు పోటీ ఇవ్వగలుగుతారనే విషయమై ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నిశితంగా పరిశీలించారు. అయితే బీజేపీ తమ బలాన్ని, ఐక్యతను చాటుకోలేదు. పైగా ఊహించని విధంగా పార్టీ ఫిరాయింపులు జరగడం, పార్టీని వీడిపోతున్న వారిని జిల్లా నేతలు కాపాడుకోలేకపోవడం కాషాయ దళంలో కలకలం రేపుతోంది.

మొదట్లో నిజామాబాద్ నగరానికి చెందిన నలుగురు కార్పొరేటర్లు బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. అప్పుడే స్పందించి ఉంటే, మిగతా వలసలను అడ్డుకునే వారమని రాష్ట్ర నేతలు భావిస్తున్నారట. అయితే, అప్పుడు ఎంపీ అర్వింద్ ఫిరాయింపులను అడ్డుకోక పోగా, వారు పోవడం వల్ల పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన అంతర్గత సమావేశాల్లో కూడా సరైన దిశానిర్దేశం చేయలేదట. దీనికితోడు పార్టీ జిల్లాధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ప్రధాన అనుచరులు కూడా టీఆర్ఎస్‌లో చేరడం లుకలుకలకు దారితీసింది. స్వయానా పార్టీ అధ్యక్షుడి వెంట తిరిగే వారే పక్క పార్టీలోకి వెళ్తుంటే నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారనే చర్చ మొదలైంది. ఒక్కొక్కరుగా పదుల సంఖ్యలో వలస వెళ్తుంటే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేయలేదనే విమర్శలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి.

మొత్తంమీద, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకుల మధ్య పెరిగిన విభేదాలు, పట్టింపు లేని ధోరణి వల్ల పార్టీ బలహీన పడిందని రాష్ట్రస్థాయి నేతలు గుర్తించారట. మేమే బలవంతులమని భుజాలు చరుస్తున్న బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నేర్పిన పాఠం.. ఓ గుణపాఠమేనని స్వపక్షీయులే చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికైనా జాగ్రత్త వహించకపోతే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి బీజేపీ రాష్ట్ర హైకమాండ్ ఇందూరు పరిణామాలపై ఏ రీతిలో స్పందిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement