Niti Aayog: సీఎం కేసీఆర్‌‌‌కు అన్ని తెలుసు.. సంచలన విషయాలు వెల్లడించిన నీతి ఆయోగ్

ABN , First Publish Date - 2022-08-07T02:11:22+05:30 IST

నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. నీతిఆయోగ్‌ (Niti Aayogh)లో నీతి అలా ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. శనివారం 4 గంటలకు..

Niti Aayog: సీఎం కేసీఆర్‌‌‌కు అన్ని తెలుసు.. సంచలన విషయాలు వెల్లడించిన నీతి ఆయోగ్

న్యూఢిల్లీ/హైదరాబాద్: నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. నీతిఆయోగ్‌ (Niti Aayogh)లో నీతి అలా ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. శనివారం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన ఆయన నీతి ఆయోగ్‌ నిరర్ధక సంస్థగా మారిందని దుయ్యబట్టారు. మేథోమథనాన్ని ఆపేసి.. భజన బృందంగా మారిందని తప్పుబట్టారు. 8 ఏళ్లలో నీతి ఆయోగ్‌ సాధించిందేమీ లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 


అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) చేసిన వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ (Niti Ayogh) స్పందించింది. న్యూఢిల్లీ నుంచి పీఐబీ (PIB) ద్వారా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనకూడదని కేసీఆర్ నిర్ణయించడం దురదృష్టకరమని... నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్  అనేది దేశంలోని అత్యున్నత రాజకీయ నాయకత్వం ఉండే వేదికని తెలిపింది. రాష్ట్ర స్థాయిల్లో అభివృద్ధి, సమస్యలు చర్చించి, జాతీయ నిర్ణయాలు తీసుకునే వేదిక అని స్పష్టం చేసింది. 


బలమైన దేశం, బలమైన రాష్ట్రాలను తయారు చేయాలనే ఉద్దేశ్యంతోనే నీతి ఆయోగ్ ఒక సంస్థగా ఏర్పాటు చేయబడిందని నీతి ఆయోగ్ తెలిపింది. రాష్ట్రాలతో సన్నిహితంగా పని చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని.. గత ఏడాదిలోనే నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 30కి పైగా సమావేశాలు నిర్వహించారని వెల్లడించింది. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో రాష్ట్రాలకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కరించామని.. కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సహకారానికి మార్గం సుగమం చేశామని స్పష్టం చేసింది. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సమస్యలపై చర్చించేందుకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గతేడాది జనవరి 21న హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిందని పేర్కొంది. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ... ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అన్ని సమస్యలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోందని నీతి ఆయోగ్ తెలిపింది.


‘‘ఆదివారం జరిగే పాలక మండలి సమావేశానికి సన్నాహకంగా... తెలంగాణతో సహా కేంద్ర, రాష్ట్రాల మధ్య వివరణాత్మక సంప్రదింపులు జరిగాయి. జూన్ నెలలో ధర్మశాలలో ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శితో సహా... అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరైయ్యారు. ఎజెండా తయారీలో రాష్ట్రాలు సహకరించడం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోపణ సరికాదు. నీటి రంగానికి సంబంధించి... 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ కింద  కేంద్రం రూ.3,982 కోట్లను కేటాయించింది. దానిలో తెలంగాణ కేవలం రూ. 200 కోట్లు మాత్రమే వినియోగించింది. 2014--2022 మధ్య కాలంలో తెలంగాణకు PMKSY-AIBP-CADWM కింద రూ.1,195 కోట్లు విడుదలయ్యాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌లు, కార్యక్రమాలతో సహా ఆర్థిక విషయాల్లో రాష్ట్రాలకు కేంద్రం  మద్దతుగా నిలుస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రాలకు నిధులు కేటాయింపు గణనీయంగా పెరిగింది. 14వ ఆర్థిక సంఘం నిధులు 32% నుంచి 42%కి పెంచింది. కేంద్ర పథకాల కింద కేటాయించిన నిధుల వినియోగానికి తగినంత సౌలభ్యం కూడా కల్పించింది.’’ అని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. 

Updated Date - 2022-08-07T02:11:22+05:30 IST