Abn logo
Sep 22 2020 @ 01:52AM

నిర్గుణ ఉపాసన

Kaakateeya

మహేంద్రగిరి పర్వత శ్రేణిలో వామదేవ మహర్షి ఆశ్రమ ప్రాంతమది. దానికి దగ్గరలో ఉన్న గ్రామం నుంచి గ్రామీణులు ఆ మహర్షి ఉపదేశాలను వినడం కోసం వస్తూండేవారు. వారిలో అనువర్తకుడు అనే యువకుడు.. వామదేవ మహర్షి ప్రజలకు ఇచ్చే సూచనలను, ఉపదేశాలను జాగ్రత్తగా విని గుర్తుంచుకునేవాడు. అలా అతడు అపారమైన శ్రుతపాండిత్యాన్ని సంపాదించాడు. ఈ క్రమంలో ఒకసారి.. వామదేవ మహర్షి కొంతమంది సాధకులకు నిర్గుణోపాసన గురించి బోధిస్తుండగా అనువర్తకుడు విన్నాడు. నామ, రూపాదికాలు లేని పరబ్రహ్మమును ఉపాసించడం చాలా గొప్ప విషయం అని.. దానికి అష్టాంగయోగం తొలి సోపానం అని వారికి మహర్షి చెప్పారు. దాంతో పాటు.. కుండలినీ ఉపాసన కూడా అవసరం అనీ, అమూర్త సాధనవల్ల బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుందని  బోధించారు.


అనువర్తకుడు అష్టాంగ యోగం గురించి, కుండలినీ యోగం గురించి గతంలో కొన్ని విశేషాలు విని ఉన్నాడు. ఇక వెంటనే ఇంట్లో కూడా చెప్పకుండా సమీపంలోని అడవికి వెళ్లి సాధన మొదలు పెట్టాడు. ఆరునెలల కాలం తిరిగేసరికి అనువర్తకునిలో ఉన్మాదం పెరిగింది. ఒక్కొక్కసారి తనను తాను గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు. ఒంటరితనంలో మానవాతీత శక్తులేవో తనను తరుముతున్న అనుభూతికి లోనవుతున్నాడు. ఇక భయాన్ని తట్టుకోలేక స్పృహ ఉన్న సమయంలో ఇంటికి చేరుకోగలిగాడు కానీ అతని పిచ్చి మాత్రం ముదురుతున్నది. అనువర్తకుని తల్లిదండ్రులు అతణ్ని వామదేవుని వద్దకు తీసుకెళ్లారు.


వామదేవ మహర్షి అతని శిరస్సు పై చేయి ఉంచి, జరిగింది తెలుసుకుని.. ‘నిర్గుణోపాసన సాధన  చేశావా?’ అని అనువర్తకుణ్ని అడిగారు. ఔనని తల ఊపాడతను. నీవు అష్టాంగాలలోని ధ్యాన, ఆసన, ప్రాణాయామాలను మాత్రమే సాధన చేశావు. ముందు అవసరమైన యమనియమములను వదిలివేశావు. ధారణాదులనూ నీవు అభ్యసించలేదు. అటు కుండలినీ యోగంలోనూ నీ అనుభవం నిన్ను నడిపించే స్థితిలో లేదు.


యమ, నియమములు అంటే.. కేవలం అర్థం తెలుసుకుని ప్రక్కవారికి చేసే నీతి బోధనలు మాత్రమే కాదు. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే యమములను, శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం అనే నియమములను కొన్ని సంవత్సరాల పాటు ఆచరించాలి. ఆపైన ఆసనములు.. అంటే ఒళ్లు హూనం అయ్యేలాగా తిప్పి తిప్పి విచిత్ర ఆకృతులలో ఒదిగిపోవటం కాదు. ఎక్కడ మనస్సు స్థిరమై కృత్య నిరపేక్ష సుఖాన్ని పొందుతుందో ఆ స్థితికి చేరడమే ఆసనమంటే. ఈ ప్రక్రియలో నీవు ఒకసారి ధ్యానంలో ఉండగా నీకు తెలియకుండానే మండూకస్థితికి చేరుకుని ధ్యానం లో కప్పలాగా ఎగురుతూ ఒక చెట్టుకు కొట్టుకుని తాత్కాలిక మతి భ్రమణానికి లోనయ్యావు. నీకు ధారణా అభ్యాసం లేకపోవడం వల్ల ఈ ప్రమాదం కలిగింది. నువ్వు కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉండు’’ అని చెప్పారు మహర్షి.అతనికి ఉన్మాద స్థితి తగ్గడానికి అవసరమైన చికిత్స చేసి, అనువర్తకుని కోరిక ప్రకారం.. అమూర్త అర్చనకు ముందుగా రెండు, మూడు సంవత్సరాల పాటు సగుణోపాసనలోని మెళకువలన్నీ నేర్పారు. ఆపైన నిర్గుణోపాసనకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. యోగాభ్యాసం, నిర్గుణోపాసన వంటివి గురు పర్యవేక్షణలో అభ్యసించవలసినవే కాని గ్రంథములను పఠిస్తే వచ్చేవి కాదని తెలుసుకున్న అనువర్తకుడు.. గురుశిక్షణలో మంచి యోగిగా ఎదిగాడు.      

- ఆచార్య రాణి సదాశివ మూర్తి


Advertisement
Advertisement
Advertisement