NIMS: నిమ్స్ డైరెక్టర్‌కు గుండెపోటు.. ఆదరాబాదరాగా అపోలోకు.. నిమ్స్ పరువు పాయె..!

ABN , First Publish Date - 2022-09-07T23:02:08+05:30 IST

సర్కారీ దవాఖానాలపై సమాజంలో ఉండే అభిప్రాయం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’ అని ఓ సినీ కవి రాసినట్టుగా..

NIMS: నిమ్స్ డైరెక్టర్‌కు గుండెపోటు.. ఆదరాబాదరాగా అపోలోకు.. నిమ్స్ పరువు పాయె..!

సర్కారీ దవాఖానాలపై సమాజంలో ఉండే అభిప్రాయం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు’ అని ఓ సినీ కవి రాసినట్టుగా అప్పుడూ.. ఇప్పుడూ ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై ఒకే అభిప్రాయం ఉంది. అందుకు కారణం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందదని, డబ్బులు పోయినా ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం మెరుగ్గా ఉంటుందనే భావన ప్రజల్లో కలగడమే. ఇలా భావించే పేద, మధ్యతరగతి ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల సానుకూల దృక్పథం కలిగేలా చేసేందుకు ప్రయత్నించాల్సిన వైద్యులే ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరితే పరిస్థితి ఏంటి. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల, సిబ్బంది పట్ల మరింత అప నమ్మకం ఏర్పడే ప్రమాదం లేదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు మాత్రమే చేయించుకుని, నాలుగు ఫొటోలకు ఫోజులిచ్చి.. ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు పరుగులు తీయడం ఎంత వరకూ సమంజసం. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ప్రజల్లో అలాంటి చర్చకు మరోసారి అవకాశం ఇచ్చింది.



నిమ్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మక మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతిష్ట మసకబారేలా చేసింది. భాగ్యనగరంలోని నిమ్స్ ఆసుపత్రి (NIMS) గురించి తెలియని వారుండరు. ప్రభుత్వ ఆధ్వర్యంలో సేవలందించే ఈ దవాఖానాకు వందల సంఖ్యలో రోగులు అనారోగ్య సమస్యలతో చికిత్స నిమిత్తం వెళుతుంటారు. నిమ్స్‌ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. నిమ్స్‌లో ఏడాదికి 47వేల మంది ఇన్‌పేషంట్లకు చికిత్సలు అందిస్తున్నారు. గతంలో 25వేల మందికి చికిత్స అందిస్తుండగా, ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. అవుట్‌ పేషెంట్ల విభాగంలో ఏటా ఆరు లక్షల మందికి చికిత్సలు అందిస్తుండగా,  పెద్ద, చిన్న ఆపరేషన్లు 25 వేల వరకు నిర్వహిస్తున్నారు. ఏడాదికి  దాదాపు మూడు లక్షల మందికి వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అన్ని ఒకేచోట ల్యాబ్స్‌ ఉండడం వల్ల సత్వర పరీక్షలు, నివేదికలు త్వరగా అందిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు.



కానీ.. తాజాగా జరిగిన ఒకే ఒక్క పరిణామం నిమ్స్‌ ఆసుపత్రిపై ప్రజల్లో అపనమ్మకానికి, అందులో పనిచేసే ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. అసలేం జరిగిందంటే.. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్, సీనియర్ డాక్టర్ మనోహర్ అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన రెండు రోజుల క్రితం హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఈ పరిణామం నిమ్స్‌లో పనిచేసే ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహానికి, అసంతృప్తికి కారణమైంది. నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందుతుందని భావించే వారికి నిమ్స్ డైరెక్టర్ అపోలోలో చేరారనే విషయం తెలిస్తే తమను బయట ఎంత చిన్నచూపు చూస్తారనే ప్రశ్నను నిమ్స్ ఉద్యోగులు ప్రధానంగా లేవనెత్తారు. కేన్సర్‌ చికిత్సలకు కొత్త పరికరాలు, రోబోటిక్‌ సర్జరీలు ఇలా అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న నిమ్స్‌లో వైద్యం పొందేందుకు నిమ్స్ డైరెక్టరే ముందుకు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



గతేడాది హైదరాబాద్‌లోని నిమ్స్‌లో గుండె మార్పిడి జరిగింది. మలక్‌పేట యశోద ఆస్పత్రి నుంచి గుండె తరలించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా పంజాగుట్ట నిమ్స్‌కు గుండె తరలించి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరించి గుండె మార్పిడి చేసి నిమ్స్ వైద్యులు ఘనత వహించారు. అంతటి నిమ్స్‌లో వైద్యం చేయించుకోవడానికి నిమ్స్ డైరెక్టర్ మనోహర్, ఆయన కుటుంబం వెనకడుగు వేయడంపై నిమ్స్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. తమకు ఈ పరిణామం తలవొంపులు తెచ్చిపెట్టిందని తీవ్ర అసంతృప్తిలో నిమ్స్ ఉద్యోగులు ఉన్నారు. ఈ పరిణామం పట్ల నిమ్స్ డైరెక్టర్ డాక్టర్, మనోహర్.. ఆయన కుటుంబం నిమ్స్ ఉద్యోగులకు ఏం సమాధానం చెప్పనున్నారోననే చర్చ నిమ్స్ కాంపౌండ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సాంబశివారెడ్డి పేరం

Updated Date - 2022-09-07T23:02:08+05:30 IST