గోల్డెన్‌ పంచ్‌

ABN , First Publish Date - 2022-05-20T10:07:19+05:30 IST

ప్రతిష్ఠాత్మక మహిళల వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ విజేతగా నిలిచింది.

గోల్డెన్‌ పంచ్‌

చరిత్ర సృష్టించిన తెలుగు బాక్సర్‌  నిఖత్‌ జరీన్‌ 

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

ఫైనల్లో థాయ్‌ బాక్సర్‌పై ఏకపక్ష విజయం

స్ట్రాంజా మెమోరియల్‌తో పాటు వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో స్వర్ణాలు సాధించిన ఏకైక భారత బాక్సర్‌గా నిఖత్‌ జరీన్‌. 


నిఖత్‌ జరీన్‌ సాధించింది. ఏదో ఒక పతకం కాదు.. స్వర్ణమే అంతిమ లక్ష్యంగా మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌పలో బరిలోకి దిగింది. టోర్నీ ఆరంభమైంది మొదలు ప్రత్యర్థులపై దూకుడే తారక మంత్రంగా విరుచుకుపడింది. తద్వారా తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది. దేశమంతా అత్యంత ఆసక్తిగా గమనించిన ఫైనల్లో ప్రత్యర్థిని చిత్తు చేస్తూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. విజయగర్వంతో రింగ్‌లో సింహనాదం చేసిననిఖత్‌ జరీన్‌.. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు బాక్సర్‌ కావడం మరో విశేషం.


ఇస్తాంబుల్‌: ప్రతిష్ఠాత్మక మహిళల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ విజేతగా నిలిచింది. గురువారం 52కేజీ ఫ్లయ్‌వెయిట్‌ విభాగంలో జరిగిన ఫైనల్లో తను 5-0 తేడాతో జిట్‌పాంగ్‌ జుటామస్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తుగా ఓడించి స్వర్ణం అందుకుంది. మూడు రౌండ్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల నిఖత్‌ ప్రత్యర్థిపై ఆరంభం నుంచే పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది. దీంతో 30-27, 29-28, 29-28, 30-27, 29-28 స్కోరింగ్‌తో జడ్జీలు ఏకగ్రీవంగా విజేతను ప్రకటించారు. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా టోర్నీలో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన ఐదో భారత బాక్సర్‌గా నిఖత్‌ నిలిచింది.  గతంలో మేరీ కోమ్‌, సరితాదేవి, ఆర్‌ఎల్‌ జెన్నీ, కేసీ లేఖ ఈ ఫీట్‌ సాధించారు. అయితే చివరిసారిగా 2018లో మేరీకోమ్‌ (48కేజీ) భారత్‌కు వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప సాధించగా.. నాలుగేళ్ల తర్వాత తెలంగాణ బాక్సర్‌ దేశానికి స్వర్ణం అందించడం విశేషం. విశేషమేమిటంటే.. గతంలో జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలోనూ ఈ నిజామాబాద్‌ అమ్మాయి విజేతగా నిలువగలిగింది. మరోవైపు ఈ టోర్నీలో భారత్‌ నుంచి మొత్తం 12 మంది బాక్సర్లు బరిలోకి దిగగా.. నిఖత్‌ పసిడి సహా మనీషా మౌన్‌ 57కేజీ విభాగంలో, పర్వీన్‌ హుడా 63కేజీ విభాగంలో కాంస్యాలు సాధించారు. ఓవరల్‌గా మహిళల వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో భారత్‌కు 39 పతకాలు రాగా ఇందులో 10 స్వర్ణాలు, 8 రజతాలు, 21 కాంస్యాలున్నాయి. 


ఏకపక్షంగా...:

 ప్రత్యర్థి జుటామ్‌సపై నిఖత్‌ 2019 థాయ్‌లాండ్‌ ఓపెన్‌లోనూ గెలిచింది. కానీ ఆ విజయాన్నే నమ్ముకోకుండా ఈసారి కూడా చక్కటి వ్యూహంతో నిఖత్‌ బరిలోకి దిగింది. సహజంగా తను బ్యాక్‌ ఫుట్‌ బాక్సర్‌ అయినప్పటికీ ఈ టోర్నీ కోసం కోచ్‌ భాస్కర్‌ భట్‌ ఆమె శైలిని పూర్తిగా మార్చేశాడు. దీంతో బరిలోకి దిగింది మొదలు నిఖత్‌ ఎటాకింగ్‌ పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడింది. సెమీస్‌ మాదిరే తుది పోరులోనూ జుటామ్‌సకు తను పదునైన పంచ్‌ల రుచి చూపింది. రింగ్‌లో తెలివిగా కదులుతూ తొలి రౌండ్‌ను నిఖత్‌ సులువుగానే ముగించింది. కానీ రెండో రౌండ్‌లో థాయ్‌ బాక్సర్‌ పోటీలోకొచ్చింది. జరీన్‌ పంచ్‌లను కాస్త దూరం నుంచే ఎదుర్కొంటూ 3-2తో పైచేయి సాధించింది. కానీ ఫైనల్‌ రౌండ్‌లో నిఖత్‌ బలమైన పంచ్‌లతో ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగింది. థాయ్‌ బాక్సర్‌ పంచ్‌లకు చిక్కకుండా వీలుచిక్కినప్పుడల్లా పవర్‌ఫుల్‌ పంచ్‌లకు తోడు జాబ్స్‌, హుక్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో జడ్జీల నుంచి ఏకగ్రీవ విజయాన్ని అందుకుంది. అంతే.. విజేతగా తన పేరును ప్రకటించగానే నిఖత్‌ ఉద్వేగం పట్టలేక గాల్లోకి ఎగురుతూ కన్నీటి పర్యంతమైంది. 


నిఖత్‌ కెరీర్‌ ఇలా..

2011   జూనియర్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

2014   యూత్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో రజతం

2014  నేషన్స్‌ కప్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ టోర్నీలో స్వర్ణం

2015  సీనియర్‌ మహిళల జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

2019  థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో రజతం

2019  ఆసియా అమెచ్యూర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం

2019, 2022  స్ట్రాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో స్వర్ణాలు

2022  మహిళల వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం


ఎల్బీ స్టేడియంలో సంబరాలు..

ఎల్బీ స్టేడియంలోని శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి కార్యాలయంలో నిఖత్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను బిగ్‌స్ర్కీన్‌పై ప్రత్యక్షప్రసారం చేశారు. నిఖత్‌ తండ్రి జమీల్‌తో పాటు బాక్సింగ్‌ కోచ్‌లు, పలువురు క్రీడాకారులు అక్కడికి చేరుకుని ఫైనల్‌ బౌట్‌ను వీక్షించారు. నిఖత్‌ గెలవగానే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. 


లక్ష్యం సాధించింది

మాకు నలుగురూ కూతుళ్లే అయినా.. అబ్బాయిలకు తగ్గట్టుగానే వారిని పెంచాం. ఒకప్పుడు నిఖత్‌కు బాక్సింగ్‌ అవసరమా అని అన్నవాళ్లే ఇవాళ మా వద్దకు వచ్చి మీ అమ్మాయిని చూస్తే గర్వంగా ఉంది అని అంటున్నారు. ఇది మాకు చాలా ఆనందాన్నిస్తోంది. ప్రపంచ చాంపియన్‌ కావాలన్న తన కలను నిఖత్‌ నెరవేర్చుకుంది. ఇక.. వచ్చే ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తుందన్న విశ్వాసముంది.

- నిఖత్‌ తల్లిదండ్రులు పర్వీన్‌ సుల్తానా, జమీల్‌ అహ్మద్‌


అమ్మతో పంచుకున్నా...

నా బౌట్‌ జరుగుతున్నంత సేపూ అమ్మ నమాజ్‌ చేస్తూనే ఉందంట. ఫైనల్లో గెలిచిన వెంటనే ముందు  ఆమెకు ఫోన్‌ చేసి నా సంతోషాన్ని పంచుకున్నా. కచ్చితంగా పతకం గెలవాలన్న లక్ష్యంతోనే బౌట్‌లో పోటీపడ్డా. అనుకున్నది సాధించా. ఇక.. పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడంపై దృష్టి సారిస్తా.

- నిఖత్‌ జరీన్‌  


Updated Date - 2022-05-20T10:07:19+05:30 IST