నిఫ్టీ టార్గెట్‌ 6000

ABN , First Publish Date - 2020-04-09T05:59:19+05:30 IST

భారత ఈక్విటీ మార్కెట్లో కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ప్రస్తుత అమ్మకాల ధోరణి ఇలాగే కొనసాగితే నిఫ్టీ 6000 పాయింట్ల వరకు దిగజారవచ్చని యూబీఎస్‌ అంచనా. గత రెండు నెలల్లో భారత ఈక్విటీ మార్కెట్‌ 25 శాతం...

నిఫ్టీ టార్గెట్‌ 6000

  • ఎగువ లక్ష్యం 10000-11500 : యూబీఎస్‌ అంచనా

న్యూఢిల్లీ : భారత ఈక్విటీ మార్కెట్లో కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ప్రస్తుత అమ్మకాల ధోరణి ఇలాగే కొనసాగితే నిఫ్టీ 6000 పాయింట్ల వరకు దిగజారవచ్చని యూబీఎస్‌ అంచనా. గత రెండు నెలల్లో భారత ఈక్విటీ మార్కెట్‌ 25 శాతం  పతనమైంది. ఇటీవల కాలంలో అమ్మకాలు జోరుగా సాగుతున్నప్పటికీ 2020-21 సంవత్సరంలో నిఫ్టీ 14 శాతం వృద్ధితో గరిష్ఠ లక్ష్యం 11500, కనిష్ఠ లక్ష్యం 10000 మధ్యన కదలాడవచ్చని ఆ సంస్థ విశ్లేషకుడు గౌతమ్‌ చోచారియా అన్నారు. ప్రస్తుత కల్లోలం జూన్‌ చివరి వరకు కొనసాగవచ్చునని,  అత్యంత క్లిష్ట సమయం మే నెలాఖరుతో ముగియవచ్చునని  కూడా ఆయన అంచనా వేశారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ ప్రభావం కార్పొరేట్‌ కంపెనీల ఆదాయాల వృద్ధిపై కూడా పడుతుందని, అది మరింత పొడిగించిన కొద్దీ రికవరీ మరింత జాప్యం అవుతుందని ఆయన తెలిపారు. ఆ రకంగా చూసినా కూడా గతంలో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల నాటి పరిస్థితినే పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది ఆదాయాల్లో వృద్ధి 2 శాతం ఉండవచ్చని అంచనా వేశారు. 


మార్కెట్‌కు మళ్లీ కరోనా భయం...

మంగళవారం రేసు గుర్రంలా పరిగెత్తిన స్టాక్‌ మార్కెట్‌ బుఽధవారం బ్రేక్‌ పడింది. కరోనా భయంతో మార్కెట్‌ మళ్లీ బేర్‌ మంది. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ 173.25 పాయింట్ల నష్టంతో 29,893.96 వద్ద, 43.45 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 8,748.75 వద్ద ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించబోతోందన్న వార్తలతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఒక  దశలో 31,227.97 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అదే సమయంలో కరోనా విజృంభణను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ మరింత పొడిగించే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. దాంతో సెన్సెక్స్‌ అక్కడి నుంచి దాదాపు 1,300 పాయింట్లకుపైగా నష్టపోయింది. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.


ఈ రంగాలపై దృష్టి పెట్టవచ్చు 

ప్రస్తుతం మార్కెట్‌లో ఏర్పడిన భారీ క్షీణత ప్రభావం వల్ల బాగా తగ్గిన వినియోగ వస్తువులు, ఆయిల్‌, గ్యాస్‌, బ్యాంకింగ్‌ వంటి రంగాల షేర్లు కొనుగోలు చేయవచ్చని చోచారియా సూచించారు. మెటల్స్‌, మైనింగ్‌ విభాగాలు, హాస్పిటాలిటీ, టూరిజం రంగాలకు చెందిన మిడ్‌క్యాప్‌ షేర్లకు దూరంగా ఉండడం మంచిదని ఆయన అన్నారు. 


జీవిత కాల కనిష్ఠ స్థాయిలో రూపాయి

స్టాక్‌ మార్కెట్‌ పతన ప్రభావం రూపాయిపైనా కనిపించింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 70 పైసలు తగ్గి రూ.76.34 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు, ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు, ప్రధాన కరెన్సీలతో డాలర్‌ మారకం రేటు పుంజుకోవడం, విజృంభిస్తున్న కరోనా వైరస్‌, ముడి చమురు దిగుమతి చెల్లింపుల కోసం, ఆయిల్‌ కంపెనీలు డాలర్లకు ఎగబడడం, బుదవారం ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయిని దెబ్బతీసింది. వచ్చే కొద్ది రోజుల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.76.54 కూడా పడిపోయే  ప్రమాదం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - 2020-04-09T05:59:19+05:30 IST