ఔట్‌డోర్ డైనింగ్‌‌కు న్యూయార్క్ ప్రజలు ఫిదా కావడంతో.. ఇకపై..

ABN , First Publish Date - 2020-09-27T05:53:48+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఏప్రిల్, మే నెలల్లో కరోనాకు కేంద్రంగా ఉండేది.

ఔట్‌డోర్ డైనింగ్‌‌కు న్యూయార్క్ ప్రజలు ఫిదా కావడంతో.. ఇకపై..

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఏప్రిల్, మే నెలల్లో కరోనాకు కేంద్రంగా ఉండేది. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందింది. ఆ సమయంలో రెస్టారెంట్ల వ్యాపారం దెబ్బతినకుండా ఉండేలా.. ప్రభుత్వం ఔట్‌డోర్ డైనింగ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల 90 వేల మంది ఉద్యోగాలను ప్రభుత్వం కాపాడగలిగింది. ఇక ఈ ఔట్‌డోర్ డైనింగ్‌‌కు న్యూయార్కర్లు ఫిదా అయిపోయారు. దీంతో తాత్కాలికంగా మొదలుపెట్టిన ఈ ఔట్‌డోర్ డైనింగ్ కార్యక్రమాన్ని శాశ్వతంగా నడుపుతామని న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డీ బ్లాసియో తాజాగా వెల్లడించారు. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక అనుమతులను కూడా జారీచేస్తామని ఆయన చెప్పారు.


ఔట్‌డోర్ డైనింగ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సమయంలో ప్రభుత్వం 85 వీధులను కార్-ఫ్రీ వీధుల కింద మార్చేసింది. అంటే ఈ వీధుల్లో ఒక్క కారు కూడా కనిపించదు. రోడ్డు మొత్తం ఔట్‌డోర్ డైనింగ్ రెస్టారెంట్లు మాత్రమే దర్శనమిస్తాయి. ఈ రకంగా న్యూయార్క్ నగరంలో అనేక రోడ్లు ఔట్‌డోర్ డైనింగ్ రెస్టారెంట్లుగా మారిపోయాయి. ఇక చలికాలంలో ఈ రోడ్లపై వెళ్లే ప్రజలు వెచ్చగా ఫీల్ అయ్యేందుకు.. ఎలక్టిక్ హీటర్లు, ప్రొపేన్, న్యేచురల్ గ్యాస్ యూనిట్లను ఉపయోగించుకునేందుకు రెస్టారెంట్లకు అనుమతులిస్తామని మేయర్ బిల్ చెప్పారు. కాగా.. సెప్టెంబర్ 30 నుంచి 25 శాతం ఆక్యుపెన్సీతో ఇండోర్ రెస్టారెంట్లకు అనుమతిస్తామని కొద్ది రోజుల క్రితమే మేయర్ బిల్ ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొద్ది రోజులకే ఔట్‌డోర్ డైనింగ్‌ను శాశ్వతంగా కొనసాగిస్తామని ఆయన చెప్పడం విశేషం.

Updated Date - 2020-09-27T05:53:48+05:30 IST