న్యూయార్క్‌లో కరోనా పాజిటివ్ రేటు ఒక్క శాతమే: గవర్నర్

ABN , First Publish Date - 2020-07-27T07:20:00+05:30 IST

అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం కరోనాను సమర్థవంతంగా అదుపుచేయగలిగింది.

న్యూయార్క్‌లో కరోనా పాజిటివ్ రేటు ఒక్క శాతమే: గవర్నర్

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం కరోనాను సమర్థవంతంగా అదుపుచేయగలిగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో కరోనాకు కేంద్రంగా ఉన్న న్యూయార్క్‌లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రోజురోజుకూ అమెరికాలోని అనేక రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారుతోంటే.. న్యూయార్క్ మాత్రం కరోనాను మరింత అదుపుచేస్తూ ముందుకు వెళ్తోంది. ఇక న్యూయార్క్‌లో కొత్తగా 536 కేసులు నమోదైనట్టు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆదివారం వెల్లడించారు. తాము 53,568 కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. 536 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని ఆయన చెప్పారు. అంటే..కేవలం ఒక్కశాతమే పాజిటివ్ రేటు నమోదయిందని ఆయన అన్నారు. మార్చి 18 నుంచి ఇప్పటివరకు న్యూయార్క్‌లో ఇంత తక్కువగా కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి అని ఆండ్రూ క్యూమో తెలిపారు. 


కరోనా విషయంలో న్యూయార్క్ సాధించిన ఫలితం అద్భుతమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని.. గడిచిన రోజుతో పోల్చుకుంటే తాజాగా నమోదయ్యే కేసుల సంఖ్యలో తగ్గుదల కనపడుతోందన్నారు. ఇక న్యూయార్క్‌లో గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మరణించినట్టు ఆండ్రూ క్యూమో చెప్పారు. న్యూయార్క్‌లో గడిచిన కొద్ది కాలం నుంచి కరోనా పరీక్షల్లో పాజిటివ్ రేటు ఒక శాతానికి అటుఇటుగానే ఉంటోంది. కాగా.. న్యూయార్క్‌లో మొత్తం కేసుల సంఖ్య 439,726గా ఉంటే.. మరణాల సంఖ్య 32,688గా ఉంది. అమెరికా వ్యాప్తంగా చూస్తే.. ఇప్పటివరకు  41,74,437 కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి మొత్తంగా 1,46,391 మంది మరణించారు.

Updated Date - 2020-07-27T07:20:00+05:30 IST