ఉప‘కుల’పతులు

ABN , First Publish Date - 2021-05-23T08:43:45+05:30 IST

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఉప‘కుల’పతులు వచ్చేశారు. దాదాపు రెండేళ్లుగా ఖాళీగా ఉన్న 10 యూనివర్సిటీల వీసీ పోస్టులను ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేసింది.

ఉప‘కుల’పతులు

  • పది వర్సిటీలకు కొత్త వైస్‌ చాన్స్‌లర్లు 
  • 22 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెర 
  • ఐఏఎస్‌ల ఇన్‌చార్జ్‌ పాలనకు మోక్షం
  • అభ్యర్థులు 273; దరఖాస్తులు 984
  • సామాజిక వర్గాలవారీగా నియామకం  
  • ఆర్జీయూకేటీ వీసీ నియామకం వాయిదా


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు ఉప‘కుల’పతులు వచ్చేశారు. దాదాపు రెండేళ్లుగా ఖాళీగా ఉన్న 10 యూనివర్సిటీల వీసీ పోస్టులను ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేసింది. సామాజికవర్గాల ప్రాధాన్యమే లక్ష్యంగా పేర్లను ఖరారు చేసింది. ఈ పేర్లను గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ గురువారం ఆమోదించారు. వీరి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం విడుదల చేసిన కొత్త వీసీల జాబితాలో వారి పేర్ల పక్కన విద్యార్హతలు, అనుభవం విషయాలను కాకుండా.. సామాజికవర్గాల వారీగా కులాలను ప్రకటించడం గమనార్హం. 


ఒక పోస్టుకు 109 దరఖాస్తులు.. 

దాదాపు రెండేళ్ల నుంచి వివిధ యూనివర్సిటీల్లో వైస్‌ చాన్స్‌లర్ల పోస్టులు ఖాళీగా ఉండగా.. గత ఏడాది దరఖాస్తులను ఆహ్వానించారు. రాష్ట్రంలోని 9 వర్సిటీలకు మొత్తం 273 మంది 984 దరఖాస్తులు సమర్పించారు. ఒక్కొక్కరు ఐదారు వర్సిటీలకు దరఖాస్తు చేయడంతో.. ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీకి అత్యధికంగా 142 దరఖాస్తులు వచ్చాయి. కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీకి 125, నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీకి 124, హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీకి 114, నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీకి 114. వరంగల్‌లోని కాకతీయ వర్సిటీకి 110, జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి(జేఎన్‌టీయూ)56, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి 23 దరఖాస్తులు వచ్చాయి. 9 వర్సిటీలకు 984 దరఖాస్తులు అందగా.. ఒక్కో పోస్టుకు సరాసరి 109 దరఖాస్తులు వచ్చాయి.  


ఐఏఎస్ల పాలనకు తెర.. 

ఉన్నత విద్యారంగంలో కీలకమైన వర్సిటీలకు సారథులైన వీసీల పోస్టులు జూలై 2019 నుంచి ఖాళీగా ఉన్నాయి. హైకోర్టు కోరినా, గవర్నర్‌ విజ్ఞప్తి చేసినా పెద్దగా పట్టించుకోని సర్కారు.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గత 22 నెలలుగా 10 వర్సిటీలకు ఇన్‌చార్జ్‌లుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించింది. త్వరలో భర్తీ చేస్తామంటూ సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ మూడుసార్లు చెప్పినా, భర్తీ ఆలస్యమైంది. ఎట్టకేలకు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత వీసీలుగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల పాలనకు తెరపడింది. కాగా, ట్రిపుల్‌ ఐటీగా పేరుగాంచిన బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ నాలెడ్జ్‌ (ఆర్జీయూకేటీ) వీసీ నియామకం మళ్లీ వాయిదా పడింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ప్రభుత్వం దీనిని పెద్దగా పట్టించుకోవట్లేదన్న విమర్శలున్నాయి. 2014 నుంచి ఈ వర్సిటీకి పాలకమండలినే నియమించలేదు. ప్రస్తుతం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రాహుల్‌ బొజ్జ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. 


ఫ్యాకల్టీ మెంబర్‌ నుంచి వీసీ స్థాయికి

మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా నియమితులైన చొల్లేటి గోపాల్‌రెడ్డి స్వగ్రామం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేట. హుజూరాబాద్‌లో పాఠశాల విద్యాభ్యాసం అనంతరం కరీంనగర్‌లో ఇంటర్‌ పూర్తిచేశారు. 1981లో కాకతీయ వర్సిటీలో బీఎస్సీ, 1983లో పీజీ(ఫిజిక్స్‌) పూర్తి చేశారు. పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత 1990 నుంచి ఓయూ ఫిజిక్స్‌ డిపార్టుమెంట్‌లో ఫ్యాకల్టీ మెంబర్‌గా పని చేశారు. ఓయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియమితులైన తర్వాత వివిధ హోదాల్లో పని చేసిన ఆయన 2016 నుంచి రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు. 


సొంత జిల్లా వాసికే వీసీగా అవకాశం

పాలమూరు వర్సిటీ వీసీగా నియమితులైన ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ ఉమ్మడి పాలమూరు జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన వారు. డిగ్రీ వరకు ఆయన మహబూబ్‌నగర్‌లో చదువుకున్నారు. ఓయూ నుంచి ఎంఏ(ఎకనామిక్స్‌), బీపీఈడీ, ఎంపీఈడీ చేశారు. తర్వాత ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌పై పీహెచ్‌డీ చేశారు. ఎయిడెడ్‌ కాలేజీలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ లెక్చరర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఓయూలో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం ఓయూ ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డీన్‌గా ఉన్నారు.


తెలంగాణ వీసీగా ‘యంగ్‌ సైంటిస్టు’

తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమితులైన రవీందర్‌ గుప్తా స్వగ్రామం యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం సంస్థాన్‌. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసమంతా నారాయణపురంలోనే జరిగింది. నల్లగొండ ఎన్‌జీ కాలేజీలో డిగ్రీ, ఓయూలో పీజీ పూర్తి చేశారు. 1989లో ఓయూ నుంచి డాక్టరేట్‌ పొందారు. 1994లో యూజీసీ కెరీర్‌ అవార్డు, 1996లో యంగ్‌సైంటిస్ట్‌ అవార్డును అందుకున్నారు. ఓయూలో సుదీర్ధకాలంగా భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన.. విద్యారంగంపై పరిశోధనల కోసం అమెరికా, జర్మన్‌, స్వీడన్‌లో పర్యటించారు.


పేద కుటుంబం నుంచి ఉన్నత శిఖరాలకు

శాతవాహన వర్సిటీ వీసీగా నియమితులైన ఎస్‌.మల్లేశం సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు. వేములవాడ మండలం హన్మాజీపేటలో నిరుపేద కుటుంబంలో పుట్టారు.  పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు. అనంతరం హైదరాబాద్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ పూర్తి చేసి.. ఆ తర్వాత పీహెచ్‌డీ పట్టా పొందారు. 2012 నుంచి 2014 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల ప్రధానాచార్యులుగా, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌గా, ఓయూలో ఫిలాసఫీ విభాగాధిపతిగా పలు కీలక పదవుల్లో పనిచేశారు. 


వరంగల్‌లో చదివి.. కేయూ వీసీగా ఎదిగి.. 

కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన తాటికొండ రమేశ్‌ స్వస్థలం వరంగల్‌లోని గోవిందరాజుల గుట్ట. రమేశ్‌ ప్రాఽథమిక విద్యాభ్యాసం వరంగల్‌లోనే సాగింది. హన్మకొండలో ఇంటర్‌, ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఓయూ సోషియాలజీ విభాగంలో ఎంఏ, ఆదిలాబాద్‌ జిల్లాలోని గోండుల జీవన విధానంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ అందుకున్నారు. 1992లో కేయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ప్రస్తుతం కేయూ అకాడమిక్‌ డీన్‌, సోషియాలజీ, ఎంఎ్‌సడబ్ల్యూ విభాగాధిపతిగా ఉన్నారు. 


ప్రొఫెసర్‌ స్థాయి నుంచి.. ఓయూ వీసీగా..

ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొఫెసర్‌ దండెబోయిన రవీందర్‌ జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో జన్మించారు. ఆయన ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ చదువుకున్నారు. ఓయూలో 1990 నుంచి పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఎంసీహెచ్‌ఆర్‌డీ సౌజన్యంతో లీడర్‌షిప్‌ ఇన్‌ అకాడమిక్‌ ప్రొగ్రామ్స్‌ (లీప్‌)లో శిక్షణ పొందిన రాష్ట్రంలోని కొద్ది మందిలో రవీందర్‌ ఒకరు. హెచ్‌సీయూ, ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని మోనాష్‌ వర్సిటీలో పరిశోధన, విద్యా పరిపాలనలో అనుభవం కలిగి ఉన్నారు. నాలుగేళ్లుగా ఓయూ పోస్టు గ్రాడ్యుయేట్‌ కళాశాలకు, ఆర్ట్స్‌ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. 


పలు వర్సిటీల్లో సేవలందించిన కిషన్‌రావు

తెలుగు యూనివర్సిటీ వీసీగా నియమితులైన ప్రొఫెసర్‌ టి.కిషన్‌రావు కరీంనగర్‌ జిల్లా వాస్తవ్యులు. ఆయన ఉస్మానియా వర్సిటీ తెలుగు ప్రొఫెసర్‌గా కొన్నేళ్లు పని చేశారు. వర్సిటీలోని అకాడమిక్‌ సెల్‌ డైరెక్టర్‌గా, స్టూడెంట్‌ వెల్ఫేర్‌ సెల్‌ డీన్‌గా బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ చేశారు. తెలుగు యూనివర్సిటీ సలహా మండలి సభ్యులుగా నిర్మాణాత్మక విభాగానికి సేవలందించారు. ఉస్మానియా వర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ టీ.నవనీత రావుకు కిషన్‌రావు సమీప బంధువు.


రెండోసారి అంబేడ్కర్‌ వర్సిటీ వీసీగా సీతారామారావు

డా.బి.ఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ సీతారామారావు రెండోసారి నియమితులయ్యారు. ఆయన 2016 జూలైలో ఇదే వర్సిటీ వీసీగా నియామకమై 2019 జూలైలో పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. 1979-80 వరకు స్టూడెండ్స్‌ యూనియన్‌ సలహాదారుగా, 1988-89లో వరంగల్‌ ఐఐపీఏ కార్యదర్శిగా, 1992-93వరకు కేయూ టీచర్స్‌ అసోసియేషన్‌ (ఏకేయూటీ)జనరల్‌ సెక్రటరీతో పాటు కాకతీయ వర్సిటీ హెడ్‌, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీ్‌సకు ఇన్‌చార్జ్‌, ఎఫ్‌ఎ్‌సఎస్‌ డీన్‌గా 2012-14 వరకు పనిచేశారు.


అప్పుడు ఎంజీయూ వీసీ.. ఇప్పుడు జేఎన్‌టీయూ

నల్లొండ జిల్లాకు చెందిన కట్ట నరసింహారెడ్డి జేఎన్‌టీయూ వీసీగా నియామకమయ్యారు. సుమారు రెండేళ్లు ఖాళీగా ఉన్న వైస్‌ ఛాన్స్‌లర్‌ పోస్టును ప్రభుత్వం ఎట్టకేలకు భర్తీ చేసింది. కట్ట నరసింహా రెడ్డిగతంలో మహాత్మగాంధీ విశ్వవిద్యాలయానికి వైస్‌ ఛాన్స్‌లర్‌గా పనిచేశారు.  ఓయూ ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన పదవీ విరమణ పొందారు. నరసింహారెడ్డి అనేక  రచనలు చేశారు. 


రెండోసారి వీసీగా కవిత దర్యాని

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ తాజా మాజీ వీసీగా ఉన్న కవితా దర్యాని రావుకు రెండోసారి అవకాశం కల్పించారు. 35 ఏళ్ల బోధన అనుభవం, రెండేళ్లు సంబంధిత ప్రాజెక్టు రంగంలో ఆమె పని చేశారు. మురికివాడల్లో తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం, ప్రపంచీకరణ ప్రభావంపై పరిశోధనలు చేశారు. తక్కువ ఖర్చుతో ఇళ్లను ఏవిధంగా నిర్మించుకోవచ్చని ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించారు. ఐఐఐడీ హైదరాబాద్‌ ఛైర్మన్‌గా 2006-08 వ్యవహరించారు. 2012లో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అందుకున్నారు. కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ పబ్లికేషన్స్‌ కమిటీ కన్వీనర్‌గా కవిత పని చేశారు. 


కొత్త ఉప‘కుల’పతులు వీరే.. 

  • ఉస్మానియా వర్సిటీ, (హైదరాబాద్‌) డి.రవీందర్‌ యాదవ్‌ (బీసీ) 
  • కాకతీయ వర్సిటీ (వరంగల్‌) టి.రమేష్‌ (బీసీ)
  • తెలంగాణ వర్సిటీ, (నిజామాబాద్‌) డి.రవీందర్‌ (ఓసీ-వైశ్య)  
  • అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ (హైదరాబాద్‌) సీతారామారావు (ఓసీ-బ్రాహ్మణ)
  • పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ (హైదరాబాద్‌) టి.కిషన్‌ రావు (ఓసీ-వెలమ)
  • పాలమూరు వర్సిటీ (మహబూబ్‌నగర్‌) లక్ష్మీకాంత్‌ రాథోడ్‌(ఎస్టీ) 
  • మహాత్మాగాంధీ వర్సిటీ, (నల్లగొండ) సీహెచ్‌ గోపాల్‌ రెడ్డి(ఓసీ)
  • జేఎన్‌టీయూ (హైదరాబాద్‌) కట్టా నర్సింహా రెడ్డి (ఓసీ)
  • శాతవాహన వర్సిటీ (కరీంనగర్‌) మల్లేశం (ఎస్సీ-మాల) 
  • జేఎన్‌ఏఎఫ్‌ఏయూ (హైదరాబాద్‌) కవిత దర్యాని (ఓసీ-సింధి) 


ఏడుగురు వీసీలు ఓయూ ప్రొఫెసర్లే.. 

వివిధ యూనివర్సిటీలకు నియమితులైన వీసీల్లో ఓయూకు చెందిన ఏడుగురు ప్రొఫెసర్లు ఉండటం ఆ వర్సిటీ కీర్తిని మరోసారి చాటింది. వివిధ యూనివర్సిటీలకు వీసీలుగా నియమితులైన ప్రొఫెసర్లు డి.రవీందర్‌యాదవ్‌, గోపాల్‌రెడ్డి, రవీందర్‌గుప్తా, లక్ష్మికాంత్‌ రాథోడ్‌,  కిషన్‌రావు, కట్టా నర్సింహారెడ్డి, మల్లేశం ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ హోదాల్లో పనిచేశారు.

Updated Date - 2021-05-23T08:43:45+05:30 IST