కొత్త బాదుడు

ABN , First Publish Date - 2022-06-29T05:55:20+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులను తెలంగాణ ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌) స్థిరచార్జీల (ఫిక్స్‌డ్‌) పేరుతో కూడా మరింత బాదుతోంది. ఈచార్జీల వల్ల ఒక్కో వినియోగదారుడికి నెలకు లోడ్‌ను బట్టి రూ.40నుంచి రూ.60 వరకు అదనపు భారం పడుతోంది.

కొత్త బాదుడు

ఫిక్స్‌డ్‌చార్జీలతో ఎన్‌పీడీసీఎల్‌ వడ్డన
నెలకు రూ.60 వరకు అదనపు వసూలు
ఉమ్మడి జిల్లాలో రూ.11కోట్ల భారం
విలవిలాడుతున్న విద్యుత్‌ వినియోగదారులు


హనుమకొండ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) :
విద్యుత్‌ వినియోగదారులను తెలంగాణ ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌) స్థిరచార్జీల (ఫిక్స్‌డ్‌) పేరుతో కూడా మరింత బాదుతోంది. ఈచార్జీల వల్ల ఒక్కో వినియోగదారుడికి నెలకు లోడ్‌ను బట్టి రూ.40నుంచి రూ.60 వరకు అదనపు భారం పడుతోంది. పెరిగిన విద్యుత్‌ రేట్లతో ఇప్పటికే కరెంట్‌ బిల్లులు తడిసిమోపడవుతున్నాయి. దీనికితోడు డెవల్‌పమెంట్‌ చార్జీల పేరుతో కూడా ఎన్‌పీడీసీఎల్‌ ఎడాపెడా పిండేస్తోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు స్థిరచార్జీల మోత మోగిస్తోంది. దీనితో గృహవిద్యుత్‌ వినియోగదారులు ప్రతీ నెల ఫిక్స్‌డ్‌ చార్జీల పేరుతో వాడుకున్న కరెంట్‌ చార్జీలకు అదనంగా మరింత చెల్లించాల్సి వస్తోంది. కరెంట్‌ బిల్లును చూస్తేనే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.

స్థిరచార్జి ఇలా..

స్థిరచార్జి 1కేవీఏకు రూ.20 చొప్పున ఎంత లోడ్‌ ఉంటే ఆ మేరకు ప్రతీనెలా చార్జిల రూపంలో చెల్లించాలి. మీటర్‌ లోడ్‌ 6కేవీఏ ఉంటే రూ.120 అప్పనంగా చెల్లించాల్సి వస్తోంది. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో మొత్తం 50,94,826 ఎల్‌టీ (గృహోపయోగ) కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 19.10 లక్షల కనెక్షన్లు ఉన్నాయి.వీటిలో అత్యధిక కనెక్షన్లు హనుమకొండ జిల్లాలో ఉన్నాయి. ఎన్‌పీడీసీఎల్‌ గత మే నెల బిల్లులో ఒక్కో వినియోగదారుడికి రూ.60వరకు ఫిక్స్‌డ్‌ చీర్జీలను వేసింది. ఈ లెక్కన ఈ ఒక్క నెలలోనే రూ.11.46కోట్ల అదనపు భారాన్ని మోపింది. విద్యుత్‌ సంస్థ అవకాశం దొరికిన ప్రతీచోట ఏదో ఒక రూపంలో వినియోగదారుడి నుంచి డబ్బులు వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయమై విద్యుత్‌శాఖ అధికారులను  సంప్రదించగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఈఆర్‌సీ) ఆదేశాల మేరకు స్థిరచార్జీలు బిల్లులో వేస్తున్నామని పేర్కొన్నారు. దీనికితోడు కరెంట్‌ చార్జీలు, కస్టమర్‌ చార్జీలు, ఎక్సయిజ్‌ డ్యూటీ, టారిఫ్‌ డిఫరెన్స్‌ ఇలా వినియోగదారుడి నడ్డివిరిచే ప్రయత్నం జరుగుతోంది.

పెరిగిన చార్జీలతో..

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచిన సమయంలో గృహవినియోగానికి 50పైసలు, వాణిజ్య వినియోగానికి రూ.1 పెంచిన విషయం తెలిసిందే.  పెంచినవి ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి విద్యుత్‌ బిల్లును చూడాలంటేనే వినియోగదారుడు హడలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లులు రూ.వేలల్లో రావడంతో వినియోగదారుడు అవాక్కవుతున్నాడు. ఎన్నడూలేనిది పెద్దమొత్తంలో బిల్లు రావడం ఒక వంతైతే దీనికి స్థిరచార్జీలు (ఫిక్స్‌డ్‌) తోడయ్యాయి. దీనికి ముందే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చార్జీలు (డెవల్‌పమెంట్‌) పేరిట బాదింది.  

అభివృద్ధి చార్జీలపేర..
కొత్తగా విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకునే సమయంలో ఇంట్లో వినియోగించే విద్యుత్‌ ఉపకరణాల సామర్ధ్యాన్ని లెక్కించి దానికి అనుగుణంగా వినియోగదారుడి నుంచి అభివృద్ధి చార్జీలు వసూలు చేస్తారు. దీన్నే విద్యుత్‌ సంస్థ పరిభాషలో సాంక్షన్డ్‌ లోడ్‌ అంటారు. ఒక బల్బు వాడితే దానిలోడ్‌ 5 నుంచి 100 వాట్స్‌, సీలింగ్‌ ఫ్యాన్‌ 50 నుంచి 150, టీవీ 150 నుంచి 250, సింగిల్‌ ఫేజ్‌ మోటారు పంపు 375, నుంచి 1500, మిక్సీ 150 నుంచి 250, వాటర్‌ హీటర్‌ 550 నుంచి 1500, కంప్యూటర్‌ 100 నుంచి 250, ఎయిర్‌ కండీషనర్‌ 1000 నుంచి 3000 వాట్స్‌గా లెక్కిస్తారు. దీనికి అనుగుణంగా సాంక్షన్డ్‌ లోడ్‌ మంజూరు చేస్తారు. వినియోగదారులు ఎక్కవ సంఖ్యలో విద్యుత్‌ గృహోపకరణాలు వాడితే వాటి సామర్ధ్యానికి అనుగుణంగా 1కేవీఏ నుంచి 2 కేవీఏ లోడ్‌ ఇస్తారు. దీని కోసం ఒక కేవీఏకి రూ.1200, సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.200, జీఎస్టీ 18 శాతం కింద రూ 216 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఎంతలోడ్‌ ఉంటే ఆ మేరకు వినియోగదారుడు విద్యుత్‌ సంస్థకు డబ్బులు డిపాజిట్‌ చేయాలి. సాంక్షన్డ్‌లోడ్‌ మించి విద్యుత్‌ గృహోపకరణాలు వాడుతున్నారంటూ వినియోగదారులపై అభివృద్ధి చార్జీలు (డెవల్‌పమెంట్‌) వసూలు చేశారు. ఇలా ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని 16 జిల్లాల్లో రూ 250 కోట్లు వసూలు చేశారు.

కొత్తమీటర్‌ తీసుకోవాలంటే..
నగరంలో గతంలో 2కేవీఏ సాంక్షన్డ్‌లోడ్‌తో మీటర్‌ జారీ చేసేవారు. దీనిని 3 కేవీఏకు పెంచారు. కొత్తగా మీటర్‌ తీసుకునే వినియోగదారుడు గతంలో రూ. 3310 చెల్లిస్తే వచ్చే మీటర్‌ ప్రస్తుతం లోడ్‌ పెంచడంతో రూ. 4930 చెల్లిస్తేకానీ రావాడం లేదు.

Updated Date - 2022-06-29T05:55:20+05:30 IST