కొత్త కేతనం కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-02-14T10:56:28+05:30 IST

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ తనను తాను ఢిల్లీ నగర రాజ్య ప్రధాన రాజకీయ పార్టీగా సుప్రతిష్ఠితం చేసుకున్నది. వరుసగా మూడోసారి ఢిల్లీ అధికార పీఠాన్ని అధిష్ఠించనున్న ఆప్...

కొత్త కేతనం కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ తనను తాను ఢిల్లీ నగర రాజ్య ప్రధాన రాజకీయ పార్టీగా సుప్రతిష్ఠితం చేసుకున్నది. వరుసగా మూడోసారి ఢిల్లీ అధికార పీఠాన్ని అధిష్ఠించనున్న ఆప్, విశాల భారత రాజకీయాల రీతిరివాజులను నిజంగా మార్చివేయగలిగే శక్తిగా ప్రభవిస్తుందా? ప్రధాన స్రవంతి రాజకీయాలతో విసిగిపోయిన సామాన్యులకు కేజ్రీవాల్ కొత్త నిర్మాణాత్మక స్ఫూర్తి కాగలుగుతారా?

అవినీతి వ్యతిరేక మహోద్యమం నుంచి ప్రభవించిన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. గత దశాబ్ది (2010-19) భారత రాజకీయాలలో ఆయన ఆవిర్భావం ఒక ఆశాజనక పరిణామం. జాతీయ నాయకుడుగా నరేంద్రమోదీ అప్రతిహత ఎదుగుదల అదే కాలంలో సంభవించిన అతిపెద్ద బ్రాండ్ విప్లవం. ఇరువురివీ అద్వితీయ గాథలు. మధ్యతరగతి ప్రజలకు, ఆకాంక్షాయుత భారతదేశానికి అవి ఒక వినూత్న ఉత్తేజాన్ని కల్పించాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్న పొందిన కేజ్రీవాల్ అవినీతినిర్మూలనోద్యమ యోధుడుగా ప్రజాజీవితంలోకి వచ్చారు. దేశ రాజకీయ సంస్కృతిని సమూలంగా మార్చి వేస్తానన్న వాగ్దానంతో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.

రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ ప్రచారక్ అయిన నరేంద్ర మోదీ నెహ్రూవియన్ అధికార వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తానని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. భవిష్యత్తుపై ఆశకు, ఘనీభవించిన పరిస్థితులలో మార్పునకు ప్రతీకలుగా మోదీ, కేజ్రీవాల్ ఇరువురూ భాసిల్లారు. సమానత్వం వర్ధిల్లే సమాజ నిర్మాణ స్వప్నావిష్కరణతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, హిందూత్వ రాజకీయాల పతాకధారిగా బీజేపీ విలక్షణ నేత ప్రజల మనస్సుల్లో సుప్రతిష్ఠులయ్యారు. ప్రతి ఒక్కరికీ సంపూర్ణ సంక్షేమాన్ని సమకూర్చే సుపరిపాలన అందివ్వడానికి ఇరువురూ నిబద్ధులయ్యారు. సరే, మోదీ, కేజ్రీవాల్ లిరువురూ తీవ్ర వ్యక్తివాదులు. సొంత పార్టీలలో వారే, అవును, వారే అధిష్ఠాన వర్గం. తొలిమాట, తుది నిర్ణయమూ వారిదే సుమా! 

ఢిల్లీ విధానసభ ఎన్నికలలో ఆప్ మరోసారి ఘన విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ తిరుగులేని విధంగా అధికారాన్ని స్వాయత్తం చేసుకున్నారు. ప్రజలు, పరిశీలకులు అనివార్యంగా అడుగుతున్న ప్రశ్న: ఆప్ అధినేత భవిష్యత్తులో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోటీదారు అవుతారా? అవ్వచ్చు, కాకపోవచ్చు అనేదే సంక్షిప్త సమాధానం. విపుల జవాబు కావాలంటే మారుతున్న భారతీయ ఎన్నికల రాజకీయాల తీరుతెన్నులను సవివరంగా విశ్లేషించవలసి వున్నది. ఇటీవల జరిగిన ఢిల్లీ విధానసభ ఎన్నికల, గత ఏడాది లోక్‌సభ ఎన్నికల ఫలితాల మధ్య ఎంతో వ్యత్యాసమున్నది. ఎందుకని? రాష్ట్ర ఎన్నికలు, ‘జాతీయ’ ఎన్నికల మధ్య ఒక తీవ్ర తేడాను ఓటరు పాటించడం వల్లేనని చెప్పక తప్పదు. లోక్‌సభ ఎన్నికలలో ‘నాయకత్వం’ అంశం ప్రాధాన్యం సంతరించుకున్నది. ‘మోదీ వెర్సెస్ హూ?’ అన్న ప్రశ్నను లేవనెత్తడం ద్వారా ప్రతి పక్షం ప్రతిష్ఠ చావు దెబ్బ కొట్టడంలో నరేంద్ర మోదీ సఫలమయ్యారు. ప్రధానమంత్రి పదవికి మోదీని మించిన అర్హుడులేడనే భావాన్ని ప్రజల మనస్సుల్లో బలంగా నెలకొల్పడంలో బీజేపీ విజయవంతమయింది. సార్వత్రక ఎన్నికలకు భిన్నంగా విధానసభ ఎన్నికలు స్థానిక అంశాల ప్రాతిపదికన మాత్రమే జరిగాయి. 

లోక్‌సభ ఎన్నికలలో నరేంద్రమోదీని గట్టిగా సవాల్ చేయగల విశ్వసనీయ ప్రతిపక్ష నేత లేనట్లుగానే విధానసభ ఎన్నికలలో కేజ్రీవాల్‌కు సైతం అటువంటి అనుకూలత లభించింది. బీజేపీకి ఉన్నట్లుగా అపార ఆర్థిక వనరులు, సహాయక శ్రేణులు లేనప్పటికీ కేజ్రీవాల్ అనితరసాధ్యమైన ప్రచార వ్యూహాలతో ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నారు. వారి మనస్సుల్లో తన గురించి ‘సుపరిపాలకుడు’ అనే ముద్రను సుస్థిరంగా వేయగలిగారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకంతోను తనపేరు ముడివడివుండేలాగా చేశారు. లోక్‌సభ ఎన్నికలలో మోదీ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులయిన విధంగానే విధానసభ ఎన్నికలలో కేజ్రీవాల్ వ్యక్తిత్వం పట్ల ఓటర్లు ఆకర్షితులయ్యారు. సార్వత్రక ఎన్నికలలో మోదీకి మద్దతు ఇచ్చిన వారందరూ రాష్ట్ర స్థాయి ఎన్నికలలో ఎటువంటి సంకోచం లేకుండా కేజ్రీవాల్‌కు మద్దతునిచ్చారు. వారు తమ విధేయతను అతి చులాగ్గా మోదీ నుంచి కేజ్రీవాల్‌కు బదలాయించారు. బీజేపీ ప్రచారం జాతీయవాద భావోద్వేగాలను అమితంగా రెచ్చగొట్టినప్పుటికీ, స్థానిక సమస్యలు, స్థానిక పరిస్థితులను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ఓటు వేయడంతో ఆప్‌ గెలవగలిగింది.

ఈ విజయంతో ఢిల్లీ ‘ముఖం’గా అరవింద్ కేజ్రీవాల్ గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వాన్ని అసంఖ్యాకులు విశ్వసిస్తున్నారు. అయితే, ఈ ఆదరణ ఆయనకొక అవరోధమవనున్నది! తన బ్రాండ్ రాజకీయాలను దేశ రాజధానికి ఆవల విశాల భారతావని అంతటా విస్తరింపచేసేందుకు ఆ ఆదరణ మూలంగా ఆయనకు పరిమితులు ఏర్పడుతున్నాయి. ఢిల్లీ నగర రాజ్యంలో వున్నది కేవలం ఏడు లోక్‌సభ స్థానాలే కదా. ముంబై మహానగరంలో శివసేన దశాబ్దాలుగా స్థానికంగా అశేష ప్రజలకు అండగా ఉంటోంది. ఆ పార్టీ శాఖా ప్రముఖ్‌ల వ్యవస్థ ఒక ప్రాంతీయ అనుబంధాన్ని పటిష్ఠంగా అభివృద్ధి పరిచింది. తద్వారా అపరిమిత ఆదాయం గల బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బిఎంసి)లో శివసేన తనకొక తిరుగులేని ప్రాబల్యాన్ని సాధించుకోగలిగింది. మరి కేజ్రీవాల్ తన ‘విద్య-ఆరోగ్యం’ పాలనా ఎజెండాతో అవినీతి కళంకిత బిఎంసికొక ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించగలరా? ముంబై నగరంలో విలసిల్లుతున్న విశిష్ట మహారాష్ట్రియన్ విలువలు, ఆచారాలను తాదాత్మ్యంతో గౌరవించే స్థానిక సంస్థ నొకదాన్ని అభివృద్ధిపరచగలిగినప్పుడు మాత్రమే ఒక ప్రత్యామ్నాయ పాలనా ఎజెండాను నిర్దేశించగలగడం సాధ్యమవుతుంది. 

ముంబై విషయాన్ని అలా వుంచితే గోవా, పంజాబ్‌లలో ఆప్ పరిమితులు ఏమిటో 2017లోనే బహిర్గతమయ్యాయి. ఆ రెండు రాష్ట్రాలలో ఆప్‌ను విస్తరింపచేసేందుకు జరిగిన తీవ్ర ప్రయత్నాలు విఫలమయ్యాయి. పంజాబ్ ప్రజలు తొలుత ఆప్ అవినీతి వ్యతిరేక ఎజెండా పట్ల అమితంగా ఆకర్షితులయ్యారు. అయితే, పార్టీ వ్యవహారాలలో స్థానిక సిక్కు మతస్థులతో కూడిన నాయకత్వానికి సాధికారత కల్పించడంలో ఆప్ విఫలమయింది. దీని వల్ల పంజాబీలు అంతిమంగా ఆప్ పట్ల ఆసక్తిని కోల్పోయారు. గోవాలో గ్రామీణ సమాజ విలక్షణతలను అర్థం చేసుకోవడంలో ఆప్ విఫలమయింది. ఈ కారణంగానే ఆప్ అనేది ‘వెలుపలి వ్యక్తుల’ పార్టీగా గోవా ప్రజలు భావించారు. 

మరింత ముఖ్యమైన విషయమేమిటంటే.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ తనను తాను ఢిల్లీ నగర రాజ్య ప్రధాన రాజకీయ పార్టీగా సుప్రతిష్ఠితం చేసుకున్నది. మరి వరుసగా మూడోసారి ఢిల్లీ అధికార పీఠాన్ని అధిష్ఠించనున్న ఆప్, విశాల భారత రాజకీయాల రీతిరివాజులను నిజంగా మార్చివేయగలిగే శక్తిగా ప్రభవిస్తుందా? ప్రధాన స్రవంతి రాజకీయాలతో విసిగిపోయిన సామాన్యులకు కేజ్రీవాల్ కొత్త నిర్మాణాత్మక స్ఫూర్తి కాగలుగుతారా? ఈ ప్రశ్నలు వేయక తప్పడం లేదు. ఎందుకో తెలుసుకోవాలంటే ఆప్ శాసనసభ్యుల జాబితాను పరిశీలించండి. ఫిరాయింపుదారుల, ధనార్జనే లక్ష్యంగా గల ఆసాముల సంఖ్య తక్కువేమీ కాదని స్పష్టమవుతుంది. చెప్పవచ్చినదేమిటంటే అన్నా హజారే అవినీతి నిర్మూలనోద్యమ ఆదర్శాలు ఎన్నికల రాజకీయాల కఠోర వాస్తవాలతో రాజీపడ్డాయి.

కేజ్రీవాల్ 2015లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా హుందాగా వ్యవహరించడం నేర్చుకున్నారు. సమస్యల పరిష్కారంలో ఓర్పు చూపారు. సంఘర్షణాత్మక వైఖరిని విడనాడారు. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవడమనేది జరగలేదు. ఆగ్రహ మూర్తిగా గాక ప్రశాంత వైఖరితో ప్రజల బాధలను పట్టించుకున్నారు. 2014లో వారణాసిలో నరేంద్ర మోదీతో తలపడిన కేజ్రీవాల్‌కు, రెండో సారి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌కు మధ్య తేడా చాలా వున్నది. అనుభవాల నుంచి ఆయన చాలా నేర్చుకున్నారు. ఢిల్లీ విధానసభ ఎన్నికల ప్రచారంలో మోదీని విమర్శించడం కాదు గదా ప్రధానమంత్రి పేరును ఒక్కసారి కూడా కేజ్రీవాల్ ప్రస్తావించలేదు. నిజానికి 2017 నుంచే సామాజిక మాధ్యమాలలో మోదీ గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేయడాన్ని కేజ్రీవాల్ పూర్తిగా విరమించారు. ఇప్పుడు మనం ఒక కొత్త కేజ్రీవాల్‌ను చూస్తున్నాం. ఈ కొత్త కేజ్రీవాల్ శక్తిమంతమైన జాతీయవాదాన్ని ప్రతిపాదిస్తున్నారు(అధికరణ 370 రద్దు కేజ్రీవాల్ వైఖరే ఇందుకు తార్కాణం). సాంస్కృతిక హిందూధర్మం పట్ల ఎనలేని శ్రద్ధాసక్తులు చూపుతున్నారు (హనుమాన్ చాలిసాను వల్లె వేయడమే ఇందుకు నిదర్శనం). అలా అని ప్రజలలో చీలికలు సృష్టిస్తున్న బీజేపీ హిందూత్వ రాజకీయాలను ఆయన ఏమాత్రం సమర్థించడం లేదు. సామాన్య ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తూ మరింత సమ్మిళిత మితవాదిగా ప్రజల దృష్టిలో వుండడానికి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. 

గమనార్హమైన విషయమేమిటంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాపరంగా కుదేలై, నాయకత్వ సంక్షోభంలో మరింతగా కూరుకుపోతోన్న తరుణంలో కేజ్రీవాల్ తాజా విజయాన్ని సాధించారు. రాహుల్ గాంధీ తనను తాను దృఢమైన నాయకుడినని నిరూపించుకోవడంలో విఫలమవ్వడంతో ప్రతిపక్ష నాయకత్వ స్థానం ఖాళీగా వుందని చెప్పక తప్పదు. అయితే, ఆ నాయకత్వాన్ని తమ కంటే ‘జూనియర్’ అయిన కేజ్రీవాల్‌కు వదిలివేయడానికి అనుభవజ్ఞులైన సీనియర్ నేతలు శరద్ పవార్, మమతా బెనర్జీ అంగీకరిస్తారని భావించలేము. అయితే, మోదీకి వ్యతిరేకంగా విశ్వసనీయమైన ప్రతిపక్ష కూటమిని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనేవుంటాయి. మోదీ నేతృత్వంలోని బీజేపీకి తన నాయకత్వంలోని ఆప్ ఒక ‘సహజ’ ప్రత్యామ్నాయమనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళందుకు ఐదు సంవత్సరాల క్రితం కేజ్రీవాల్ ఆరాటపడ్డారు. ఈ సారి ఆ విషయంలో ఆయన సంయమనంతో ఆలోచించుకోవల్సిన అవసరమున్నది. ఎందుకంటే విశాల భారతదేశ అధికార పీఠంగా ఢిల్లీ ఆయనకు ఇంకా చాలా దూరంలో వున్నది. తాజా కలం: మోదీ, -కేజ్రీవాల్ మధ్య ఒక ఆసక్తికరమైన సంధానం వున్నది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే ఆ అనుసంధానం. కిషోర్ ఇప్పుడు కేజ్రీవాల్ శిబిరంలో వున్నారు. ఆప్ విజయంలో ఆయన నిర్వహించిన పాత్ర తక్కువదేమీ కాదు. మోదీని వ్యతిరేకిస్తున్న టీఎంసీ, డీఎంకే వంటి పలు పార్టీలు తమ ఎన్నికల వ్యూహాల కోసం ప్రశాంత్ కిషోర్‌పై ఆధారపడుతున్నాయి. ఇప్పుడు ఆ పార్టీలన్నిటినీ కలిపి ఒక విశాల జాతీయ సంకీర్ణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తారా?


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2020-02-14T10:56:28+05:30 IST