Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 26 Jan 2022 02:33:33 IST

జనం చెవిలో ‘జిల్లా’ పూలు

twitter-iconwatsapp-iconfb-icon
జనం చెవిలో జిల్లా పూలు

  • ఉద్యోగుల ఉద్యమ వేళ సర్కారు కొత్త ఎత్తు
  • 26 జిల్లాలకు ఆన్‌లైన్‌లో ‘కేబినెట్‌ ఆమోదం’
  • ఉదయాన్నే కలెక్టర్లతో సీఎస్‌ సమీక్ష
  • ఆ వెంటనే మంత్రులకు కేబినెట్‌ నోట్‌
  • తక్షణం ఆమోదించిన రాష్ట్ర మంత్రులు.. 
  • నేడో రేపో ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ
  • దేశవ్యాప్తంగా కొత్త జిల్లాలపై నిషేధం.. 
  • జనం దృష్టి మళ్లించేందుకే మళ్లీ ఈ వ్యూహం
  • జన గణన పూర్తయ్యేదాకా ఏర్పాటు కుదరదు..
  •  అయినా.. ఎప్పటికప్పుడు ‘కొత్త’ ఎత్తులు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘జన గణన పూర్తయ్యేదాకా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం కుదరదు!’... ఇది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తించే నిషేధం! అయినా సరే... జగన్‌ సర్కారు ఎప్పటికప్పుడు జనం చెవిలో ‘కొత్త జిల్లాల’ పూలు పెడుతూనే ఉంది. తాజాగా... రాష్ట్రమంతా ఉద్యోగుల ఆందోళనలతో వేడెక్కిన సమయంలో మరోమారు కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చింది. ఈసారి ‘26 జిల్లాల’కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. కొత్త జిల్లాలపై కదలిక వచ్చిందని, రేపో మాపో నోటిఫికేషన్‌ వస్తుందని సోమవారం సాయంత్రం అనుకూల మీడియాలో  రాష్ట్ర ప్రభుత్వం లీకులు ఇచ్చింది. మంగళవారం ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ రంగంలోకి దిగారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల విభజనపై రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల అధ్యయనం ఎంత వరకు వచ్చిందని ఆయన ఆరా తీశారు. ఆ వెంటనే... కేబినెట్‌ నోట్‌ తయారు చేసి మంత్రులందరికీ ఆన్‌లైన్‌లో పంపించారు. 


దీనిని మంత్రులు చకచకా ఆమోదించేశారు. దీని ప్రకారం...1974 ఏపీ జిల్లాల ఏర్పాటు చట్టంలోని సెక్షన్‌ 3(5) ప్రకారం భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)  నేడో రేపో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒక నెల లేదా రెండు నెలలు గడువు ఇచ్చి ప్రజల అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్‌ ఇచ్చి గెజిట్‌లో ప్రకటిస్తారు. అప్పటి నుంచి కొత్త జిల్లాలు అమలులోకి  వచ్చినట్లు అవుతుంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఒక్కో జిల్లాగా ఏర్పడతాయి. విస్తీర్ణంలో పెద్దదైన అరకును మాత్రం అరకు-1, అరకు-2(వీటిలో ఒకటి గిరిజన జిల్లా)గా ప్రకటిస్తారు. వెరసి.. రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాలు 26 అవుతాయన్న మాట! 

మళ్లీ మరోసారి... 

రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుని, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రతిసారీ... కొత్త జిల్లాల అంశం తెరపైకి తేవడం గమనార్హం. ఇటీవల వరదల సమయంలో సీఎం జగన్‌ సరిగా స్పందించలేదనే ఆరోపణలు వచ్చా యి. ఆ తర్వాత కొద్దిరోజులకే అమరావతిలో ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్తజిల్లాల అంశాన్ని స్వయంగా సీఎం ప్రస్తావించారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. ఆ తర్వాత దీని గురించి చడీచప్పుడు లేదు. మళ్లీ రెండు నెలల తర్వాత ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. పీఆర్‌సీ జీఓల రద్దుకోరుతూ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలు ఉద్యమపథంలోకి వెళ్లాయి. అంతటా వీరి ఆందోళనల గురించే చర్చ సాగుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో ఉక్కపోత ఎదుర్కొంటోంది. సరిగ్గా ఇదే సమయంలో కొత్త జిల్లాల  ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకురావడం గమనార్హం.

ఇది సాధ్యమేనా?

దేశవ్యాప్తంగా జనాభా గణనకు కేంద్రం 2020 జనవరిలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనాభా లెక్కల ప్రక్రియ ముగిసేవరకు గ్రామాలు, పట్టణాల భౌగోళిక సరిహద్దులు మార్చకూడదంటూ ఫ్రీజింగ్‌(నిషేధ) ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కూడా మోమో జారీ చేసింది. దీంతోనే జిల్లాల ఏర్పాటు ప్రక్రి య అధికారికంగా నిలిచిపోయింది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల సమయంలో నూ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై హడావుడి చేసినప్పుడు.. నాటి ఎన్నికల అధికారి రమేశ్‌ కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సెన్సస్‌ డైరెక్టర్‌ ఇచ్చిన ఫ్రీజింగ్‌ ఉత్తర్వులు ఉండగా, ఎన్నికల సమయంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేయడానికి వీల్లేదని అప్పటి సీఎ్‌సకు లేఖరాశారు. దీంతో ఆ ప్రక్రియను ఆపేశారు. ఫ్రీజింగ్‌ ఉత్తర్వులను ఇప్పటికీ కేంద్రం వెనక్కి తీసుకోలేదు. కరోనా కారణంగా జన గణన పూర్తిస్థాయిలో జరగడం లేదు. కొన్ని పరిమితులతోనే నిర్వహిస్తున్నారు.

ముందస్తు కసరత్తుకే వీలు

ఇప్పుడు అధికారికంగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టడానికి వీల్లేదని రెవెన్యూ వర్గాలే చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన కసరత్తును అనధికారికంగా చేపట్టవచ్చు. అందుకు సంబంధించిన అధ్యయనం చేయవచ్చు. అధికారికమైన ఉత్తర్వులు జారీ చేయడానికి మాత్రం వీల్లేదు. కొత్తా జిల్లాలపై ముందస్తు కసరత్తు ప్రక్రియ మన రాష్ట్రంలో ఎప్పుడో మొదలైంది. దీనికి అవసరమైన అధ్యయనం, కసరత్తును రెవెన్యూశాఖ పూర్తిచేసింది. విభజన సందర్భంగా వచ్చే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కేంద్రం ఫ్రీజింగ్‌ ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నాక, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చట్టప్రకారం నోటిఫికేషన్‌ ఇస్తారని అధికారులు భావించారు. ఇప్పుడు అనూహ్యంగా మరోసారి తెరపైకి రావడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. కేంద్రం ఇచ్చిన ఫ్రీజింగ్‌ ఉత్తర్వులు అమల్లో ఉండగా నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారు? సాంకేతికంగా ఇది సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఉద్యోగులే లక్ష్యం...

‘‘జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు నోటిఫికేషన్‌ సహజంగానే ఉద్యోగులపై బాగా ప్రభావం చూపుతుంది. ఏ ఉద్యోగి ఏ జిల్లాలో ఉండాలి? వారి స్థానికత ఏమిటి? అనే అంశంపై చర్చలు జరుగుతాయి. ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం నుంచి వారి దృష్టి మళ్లుతుంది’’ అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. ఇక... కొత్త జిల్లాల ఏర్పాటు అంశం సామాన్య ప్రజలందరికీ ఆసక్తికరమైన అంశం.


గ్రామ స్థాయి నుంచే సందడి కనిపిస్తుంది. గ్రామం, మండలం వారీగా సమీకరణాలు తెరమీదకొస్తాయి. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ రాగానే... ప్రజలంతా దీనిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికన జరిగే జిల్లాల విభజన తమపై పడే ప్రభావంపై చర్చలు మొదలవుతాయి. ప్రజా సంఘాలు, పార్టీలు అభ్యంతరాలు, సూచనలు సమర్పించడంపై దృష్టి సారిస్తాయి. ‘‘ఏ మండలం ఏ డివిజన్‌లో ఉండాలి? ఏ డివిజన్‌ ఏ జిల్లా పరిధిలో ఉండాలన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతాయి. వెరసి... ఉద్యోగుల పోరాటం తెరమీద నుంచి క్రమక్రమంగా తొలగిపోతుంది’’ అని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఆంధ్రప్రదేశ్ Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.