రైతుబంధులోకి కొత్త లబ్ధిదారులు

ABN , First Publish Date - 2022-06-27T07:50:39+05:30 IST

రైతుబంధు పథకంలో కొత్త లబ్ధిదారుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది...

రైతుబంధులోకి కొత్త లబ్ధిదారులు

పథకంలో నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా 

కటాఫ్‌ తేదీ జూన్‌ 5.. వివరాలు ఏఈవోకి ఇస్తే నమోదు

ఆదివారమే లాగిన్‌ ఓపెన్‌..  సీసీఎల్‌ఏ డేటానే ప్రామాణికం

ఆ డేటాలో పేర్లు లేకపోతే పోర్టల్‌లో నమోదుకు నో చాన్స్‌.. 28 నుంచి రైతుబంధు నిధుల పంపిణీ


హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): రైతుబంధు పథకంలో కొత్త లబ్ధిదారుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు జూన్‌ 5ను కటాఫ్‌ తేదీగా ప్రకటించింది. అంటే ఈ నెల ఐదో తేదీ నాటికి రిజిస్ట్రేషన్‌ జరిగి, పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ అయిన భూములను రైతుబంధు పోర్టల్‌లో నమోదుచేసుకునే అవకాశాన్ని కల్పించారు. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారి)కి సమర్పించాల్సి ఉంటుంది. ఆదివారం ఉదయం నుంచి ఏఈవో లాగిన్‌ను ఓపెన్‌ చేశారు. సీసీఎల్‌ఏ నుంచి వచ్చిన డేటా ఆధారంగా వ్యవసాయశాఖ అధికారులు రైతుల వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. నిరుడు వానాకాలం సీజన్‌లో కూడా కొత్త లబ్ధిదారుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అప్పుడు జూన్‌ 10 వరకు కటాఫ్‌ తేదీ పెట్టారు. ఆ తర్వాత యాసంగి సీజన్‌లో రైతులకు అవకాశం ఇవ్వలేదు. తాజాగా కొత్త లబ్ధిదారుల నమోదుకు అవకాశం కల్పించారు. అంటే సుమారు ఏడాది తర్వాత రైతుబంధు పథకంలో కొత్త లబ్ధిదారులను చేర్చే అవకాశం దొరికింది. 2021 జూన్‌ పదో తేదీ నుంచి 2022 జూన్‌ ఐదో తేదీ వరకు జరిగిన రిజిస్ట్రేషన్లలో... వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డేటాను వ్యవసాయశాఖకు సీసీఎల్‌ఏ  తాజాగా అందజేసింది. ఆ డేటా ప్రకారమే ఏఈవోలు కొత్త ఎంట్రీలు చేస్తారు. సాంకేతిక కారణాల వల్ల సీసీఎల్‌ఏ డేటాలో ఒకవేళ పేర్లు లేకపోతే  ఆ రైతులను రైతుబంధు పోర్టల్‌లో నమోదుచేసే అవకాశం ఉండదు. సీసీఎల్‌ఏ వివరాలనే తుది డేటాగా పరిగణిస్తారు. 


ఇదిలాఉండగా ఈనెల 28 తేదీ నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. దానికి రెండు రోజులు ముందు మాత్రమే రైతుబంధు పోర్టల్‌ ఓపెన్‌ చేశారు. దీంతో రైతులు, ఏఈవోలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిధుల కొరతతో ఒకవేళ పంపిణీ ఆలస్యమైతే  ముందుగా సమయమిచ్చి, కటాఫ్‌ తేదీని ప్రకటించి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రారంభిస్తే సౌకర్యవంతంగా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివారంతో కలిపి రెండు రోజులు మాత్రమే కొత్త లబ్ధిదారుల నమోదుకు అవకాశం కల్పించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఒకవైపు రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతున్నా, మరోవైపు లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగు తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వ్యవసాయ కమిషనరేట్‌ వర్గాలు తెలిపాయి. పైగా ఒక్క రోజులో రైతుల ఖాతాల్లో డబ్బు జమచేసే పరిస్థితిలేదు. ఆరోహణ క్రమంలో(తక్కువ విస్తీర్ణం నుంచి ఎక్కువ విస్తీర్ణం వరకు) రోజుకో ఎకరం చొప్పున పెంచుతూ పది రోజులకు పైగా నగదు బదిలీచేసే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో ఏఈవోలు రైతుబంధు పోర్టల్‌లో కొత్త లబ్ధిదారులను కూడా నమోదుచేస్తారని చెబుతున్నారు. ఇదిలాఉండగా... గత యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది రైతులకు రూ. 7411.52 కోట్లు రైతుబంఽధు పథకం కింద నగదు బదిలీ చేశారు. భూ యాజమాన్య హక్కుల మార్పులు, చేర్పులతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. టైటిల్‌ క్లియరెన్స్‌ వచ్చిన భూమి విస్తీర్ణం పెరిగితే నిధులు కూడా పెరిగే అవకాశాలున్నాయి. 

Updated Date - 2022-06-27T07:50:39+05:30 IST