రుతురాజ్ అలా చేయొచ్చా? వైరల్ అవుతున్న వీడియో

ABN , First Publish Date - 2022-06-21T01:32:40+05:30 IST

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగాల్సిన చివరి

రుతురాజ్ అలా చేయొచ్చా? వైరల్ అవుతున్న వీడియో

బెంగళూరు: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. వాన తగ్గుతుందేమో.. మ్యాచ్ జరుగుతుందేమోనని అభిమానులు చాలాసేపు వేచి చూశారు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 


డగౌట్‌లో కూర్చున్న స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సహచరుడితో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో గ్రౌండ్ సిబ్బంది ఒకరు గైక్వాడ్ వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకుంటానని కోరాడు. అయితే, గైక్వాడ్ అతడిని చేత్తో నెట్టేస్తూ దూరం జరుగు అన్నట్టు సైగ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఇప్పుడు నెటిజన్లు రెండుగా విడిపోయి వాదించుకుంటున్నారు. 


రుతురాజ్ ప్రవర్తన ఏమాత్రం బాగాలేదని, గ్రౌండ్ సిబ్బందితో ఇలాగేనా ప్రవర్తించేది? అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. గ్రౌండ్ సిబ్బందిని చూస్తే జాలేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి వాదనను మరో నెటిజన్ ఖండించాడు. రుతురాజ్ అలా ప్రవర్తించడంలో తప్పులేదన్నాడు. నిజానికి ప్లేయర్ల డగౌట్‌లోకి సెల్‌ఫోన్లకు అనుమతి ఉండదని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఒక బుకీ.. గ్రౌండ్స్‌మన్ వేషంలో వచ్చి పట్టుబడ్డాడని పేర్కొన్నాడు. మరో అభిమాని కూడా గైక్వాడ్‌నే సమర్థించాడు. అతడు ఇప్పటికే రెండుసార్లు కొవిడ్ బారినపడ్డాడని, కాబట్టి అలా ప్రవర్తించడంలో తప్పులేదని చెప్పుకొచ్చాడు. ఇంకో అభిమాని మాత్రం రుతురాజ్‌ తీవ్రంగా తప్పుబట్టాడు. గైక్వాడ్ తన ఆటిట్యూడ్‌ను చూపించుకున్నాడని విమర్శించాడు. రోహిత్ శర్మ మాత్రం ఇలా కాదని, అందరినీ సమానంగా చూస్తాడంటూ  గ్రౌండ్ సిబ్బందితో సెల్ఫీ తీసుకుంటున్న రోహిత్ ఫొటోను పోస్టు చేశాడు.



Updated Date - 2022-06-21T01:32:40+05:30 IST