Please.. మనవారందరినీ తీసుకొచ్చేయండి.. ఆలస్యమైతే ఉక్రెయిన్‌లో ఘోరాలే..!

ABN , First Publish Date - 2022-03-02T12:10:58+05:30 IST

జాతి విభేదాలతో మాకు సంబంధం లేదు. స్టూడెంట్‌ వీసాతో మెడిసిన్‌ చదువుకునేందుకు..

Please.. మనవారందరినీ తీసుకొచ్చేయండి.. ఆలస్యమైతే ఉక్రెయిన్‌లో ఘోరాలే..!

  • ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన దార్ల బ్యూలా భానుమతి 


నెల్లూరు జిల్లా/కావలి : ఉక్రెయిన్‌లో ఉన్న మన వారినందరినీ త్వరగా భారత్‌కు తీసుకురావాలని, లేకుంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని ఆ దేశం నుంచి కావలికి వచ్చిన వైద్య విద్యార్థిని దార్ల బ్యూలా బానుమతి ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలోని జనతాపేటకు చెందిన దార్ల జాకబ్‌ జాషువా, ఎస్తేర్‌ రాణిల కుమార్తె బానుమతి  వైద్యవిద్య కోసం ఉక్రెయిన్‌ వెళ్లారు. యుద్ధం నేపథ్యంలో నానా అవస్థలు పడి మంగళవారం రాత్రి ఆమె కావలికి చేరుకున్నారు. తల్లిదండ్రుల వద్దకు చేరుకున్న ఆనందం కన్నా ఉక్రెయిన్‌లో ఉన్న మన వారు ఏమవుతారోననే ఆందోళన ఆమెలో కనిపించింది. ఆమె కన్నీటిపర్యంతో అక్కడ మనవారు పడుతున్న బాధలను ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. 


ఆమె మాటల్లోనే..

‘‘జాతి విభేదాలతో మాకు సంబంధం లేదు. స్టూడెంట్‌ వీసాతో మెడిసిన్‌ చదువుకునేందుకు అక్కడకు వెళ్లిన మాకు ఈ కష్ట్టాలు ఏమిటి?. తినేదానికి తిండి దొరక్క, నీరు దొరక్క పడ్డ అవస్థలు చెప్పలేను. అంతేకాదు.. మమ్మల్ని చాలా దుర్మార్గంగా హింసించారు. పెప్పర్‌ స్ర్పే కూడా కొట్టారు. నేను భారత్‌లో అడుగు పెట్టాక ఉక్రెయిన్‌లో బాంబుల దాడిలో మన దేశ విద్యార్థి ఒకరు చనిపోయినట్టు తెలిసింది. నాకు చాలా బాధేసింది. మన వారిని తీసుకురావడం ఆలస్యమైతే ఎంతో మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మన బార్డర్‌ వరకు  రవాణా సదుపాయం కల్పించాలని అక్కడున్న వారు వేడుకుంటున్నారు. గత నెల 27వ తేదీన మా గది నుంచి బార్డర్‌కు బయలుదేరాం. రవాణా సదుపాయం లేకపోవడంతో  సొంత ఖర్చులు పెట్టుకుని వాహనం ఏర్పాటు చేసుకున్నాం. రుమేనియా బార్డర్‌కు 10 కి.మీ దూరంలోనే మమ్మల్ని ఆపేశారు. అక్కడ నుంచి ఎన్నో అవస్థలు పడి నడుచుకుంటూ సరిహద్దు వరకు వెళ్లాం. తీరా అక్కడ భారతీయులకు అనుమతి లేదని తెలపడంతో 9 గంటలు అక్కడే ఉండిపోయాం. చివరకు అక్కడున్న వారంతా ఆందోళన చేయడంతో అనుమతించారు.  అక్కడ నుంచి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో స్వదేశానికి తిరిగి వచ్చేశాను. కానీ ఉక్రెయిన్‌ నుంచి సరిహద్దు వరకు రావాలంటే ఎంతో మంది  నరకయాతన పడుతున్నారు. వీలైనంత త్వరగా రవాణా సౌకర్యం కల్పించి, మనవారందరినీ స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నా’’ అని బానుమతి  వివరించారు.

Updated Date - 2022-03-02T12:10:58+05:30 IST