బిజీబిజీగా నెల్లూరు బీజేపీ నేతలు.. ఆయననే ఆదర్శంగా తీసుకున్నారా?

ABN , First Publish Date - 2020-09-20T16:54:38+05:30 IST

నెల్లూరులో కమలనాథులు కుస్తీ పడుతున్న ఓ విషయం హాట్‌టాపిక్‌గా మారుతోంది. నాయకులు ఎవరిని గమనించినా అదే పనిలో నిమగ్నవుతున్నారు. పార్టీ కార్యాలయాలకి వెళ్లినా, ఏ నలుగురు...

బిజీబిజీగా నెల్లూరు బీజేపీ నేతలు.. ఆయననే ఆదర్శంగా తీసుకున్నారా?

నెల్లూరు జిల్లాలో బీజేపీ నేతలు బిజీబిజీగా ఏం చేస్తున్నారు? నిత్యం రాజకీయాల్లో తలమునకలయ్యే వారు ఇప్పుడు ఏ పనిలో నిమగ్నమయ్యారు. మహాత్మాగాంధీ గురించి ఇప్పుడెందుకు చర్చించుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పలేకపోవడానికి వారిని వేధిస్తున్న సమస్య ఏమిటి?  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఏ విషయంలో నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నారు? కాషాయనాథుల పార్టీ వరుస కార్యక్రమాలపై ప్రజలు ఏమంటున్నారు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలేంటో.. ఈ కథనంలో చూద్దాం.


నెల్లూరులో కమలనాథులు కుస్తీ పడుతున్న ఓ విషయం హాట్‌టాపిక్‌గా మారుతోంది. నాయకులు ఎవరిని గమనించినా అదే పనిలో నిమగ్నవుతున్నారు. పార్టీ కార్యాలయాలకి వెళ్లినా, ఏ నలుగురు నేతలు కలిసినా ఒకటే చర్చ వినిపిస్తోంది. బీజేపీ నాయకులు హిందీ భాషపై పట్టుసాధించుకోవడానికి తెగ కష్టపడిపోతున్నారు. నీ హిందీ భాష ఎక్కడివరకు వచ్చిందని ఒకరంటే.. ఏముంది పరిచయ, ప్రాథమిక కోర్సులు అయిపోయాయని సమాధానమిస్తున్నారట. మాధ్యమిక క్లాసులకి వెళుతున్నట్లు మరొకరు అంటున్నారట. మరికొందరైతే హిందీ పాఠమంటే బోరుబోరు అంటూ ఒక పట్టాన అర్థం కావడం లేదని సనుగుతున్నారట.


హిందీ భాష రాకపోవడమే ప్రధాన కారణమని...

వాస్తవానికి నెల్లూరు కేంద్రంగా ఎంతోమంది రాజకీయ ఉద్దండులు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరువాసే. వెంకయ్యను జిల్లా నాయకులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో ఎదగలేకపోవడానికి హిందీ భాష రాకపోవడమే ప్రధాన కారణమని లీడర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా హిందీ భాషపై నైపుణ్యం సంపాదించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉబలాటపడుతున్నారు. వెంకయ్యనాయుడు బహుభాషా కోవిదుడు. తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ బాషల్లో ఆనర్గళంగా మాట్లాడగలరు. ఏ భాషలో మాట్లాడినా యాస ప్రాసతో ప్రసంగిస్తూ సభికులను ఆకట్టుకోవడంలో దిట్ట. కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని జిల్లా నేతలు ఆదర్శంగా తీసుకుని హిందీ భాషపై కుస్తీ పడుతున్నారు.


అప్పట్లో హేమాహేమీలు చెన్నైకి వచ్చి...

హిందీ భాష అంటే అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణభారతదేశ ప్రజలు హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు. 1918లో దక్షిణ భారత హిందీ మహాసభని ఏర్పాటు చేశారు. అప్పట్లో హేమాహేమీలు చెన్నైకి వచ్చి హిందీ పాఠాలు చెప్పేవారట. హిందీ నేర్చుకోవాలంటే  పరిచయ, ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష, ప్రవేశిక, విశారధ పూర్వార్ధ్, విశారధ ఉత్తరార్ధ్, ప్రవీణ్ పూర్వార్ధ్, ప్రవీణ్ ఉత్తరార్ధ్ కోర్సులుంటాయి. ఇప్పటికే పలువురు నెల్లూరు నేతలు ప్రాథమిక, మాధ్యమిక కోర్సు పూర్తిచేసి రాష్ట్ర భాష వరకు వెళ్లారట. మరోవైపు తమిళనాడులో హిందీ భాషకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హిందీ భాషను బలవంతంగా తమపై రుదొద్దని నినదిస్తున్నారు. కానీ తమిళనాడుకు సమీపంలో ఉండే నెల్లూరు జిల్లా బీజేపీ నేతలు మాత్రం హిందీపై మక్కువ పెంచుకుంటున్నారు. హిందీ చదవడం, రాయడం, మాట్లాడటం కోసం పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. పట్టు సాధించడం కోసం స్నేహితులు, బంధువుల సలహాలు కూడా తీసుకుంటున్నారట.


జాతీయస్థాయి పదవుల కోసం...

ఇక ఇటీవల ప్రకటించిన బీజేపీ రాష్ట్ర కమిటీలో చాలామంది ముఖ్య నేతలకు రాష్ట్ర పదవులే దక్కాయి. సన్నపరెడ్డి సురేశ్ రెడ్డి జాతీయ కమిటీ సభ్యుడి పదవిని ఆశిస్తున్నారు. బీజేవైఎం నేతలూ జాతీయస్థాయి పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ కమలనాథులు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీటీడీ ఆస్తులు, అంతర్వేది ఘటనలపై ఆందోళనలు చేస్తున్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలనీ, పెంచిన విద్యుత్తు ఛార్జీలు ఉపసంహరించుకోవాలనీ నిరసనలు తెలుపుతున్నారు. అయితే నాయకులు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా హిందీ భాష నేర్చుకోవడం మాత్రం మానడం లేదట. మొత్తంగా నెల్లూరు జిల్లా బీజేపీ నాయకులు హిందీపై ఏ మేరకు పట్టుసాధిస్తారో, జాతీయ స్థాయిలో ఎంతగా రాణిస్తారో చూడాలి.

Updated Date - 2020-09-20T16:54:38+05:30 IST