క్వారీల్లో నిర్లక్ష్యపు కోరలు

ABN , First Publish Date - 2021-05-11T09:16:13+05:30 IST

గనుల తవ్వకాల వల్ల రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లు వస్తున్నాయి. ఇక క్వారీలు నిర్వాహకుల పాలిట కాసులగనులే. అయితే..

క్వారీల్లో నిర్లక్ష్యపు కోరలు

ఛిద్రమవుతున్న కూలీల బతుకులు

వైసీపీ నేతల చేతుల్లోనే ఎక్కువ క్వారీలు

తనిఖీచేసే ధైర్యం చేయని అధికారులు

శాపంగా శాఖల మధ్య సమన్వయ లోపం

‘మామిళ్లపల్లి’ ఘోరానికి కారణాలివే


(కడప-ఆంధ్రజ్యోతి)

గనుల తవ్వకాల వల్ల రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లు వస్తున్నాయి. ఇక క్వారీలు నిర్వాహకుల పాలిట కాసులగనులే. అయితే.. మైనింగ్‌ తవ్వకాల్లో నిబంధనలు పాటిస్తున్నారా? క్వారీ గోతుల్లో కూలీలు ఎందుకు సమాధి అవుతున్నారు? మనకంటే ఎన్నో రెట్లు అధికంగా మైనింగ్‌ చేస్తున్న రాష్ట్రాల్లో జరగని ప్రమాదాలు ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి? ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా కడప జిల్లా మామిళ్లపల్లి ముగ్గురాళ్లు (బైరటీస్‌) మైనింగ్‌లో జరిగిన ఘోరంతో తలెత్తుతున్న ప్రశ్నలివి. పది మంది కూలీలను బలిగొన్న ఈ ఘటన క్వారీలలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు సంధిస్తోంది. మామిళ్లపల్లి క్వారీలో అయితే.. పర్యావరణం, భద్రతా ప్రమాణాలు, లీజు ఒప్పందంలోని అంశాలు వేటినీ యాజమాన్యం పాటించలేదని ఇప్పుడు అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. అధికార పార్టీ నేత క్వారీ కావడమే కారణమో కాదో గానీ ఇన్నాళ్లూ ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడలేదు. ప్రస్తుతం ముప్పాతిక శాతం గనులు వైసీపీ నేతల గుప్పిట్లోనే ఉన్నాయి. దీనివల్లే  నిఘా యంత్రాంగం స్పందించడం లేదని, సమీక్షలు, పర్యవేక్షణ లోపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీని ఫలితమే గనుల్లో  కూ లీల బతుకుకు భద్రత లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం అవుతోంది. గనుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి సరాసరి రూ.3వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఆ శాఖ అధికారులే అంటున్నారు. ఇంత ఆదాయం తెచ్చిపెడుతున్న గని కార్మికులు, కూలీల భద్రతకు కనీస భరోసా లేకపోవడం ఏమిటని సర్కారును కార్మికులు నిలదీస్తున్నారు. 


పోయిన ప్రాణాలకు పూచీ ఎవరిది?

మైనింగ్‌ కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఎన్‌వోసీ ఇచ్చేది రె వెన్యూ శాఖ. అక్కడ క్వారీని లీజుకు ఇవ్వడానికి అనుమతించేదీ, నిబంధనల మేరకే తవ్వకాలు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షించేదీ గనుల శాఖ.  క్వారీల్లో కాలుష్యం ఏ స్థాయిలో ఉంది....మైనింగ్‌ వల్ల గ్రామాల్లో ఏ మైనా ఇబ్బందులు ఉన్నాయా.. పర్యావరణ అనుమతులు ఉన్నాయా, లేదా....అని చూసేది పర్యావరణ శాఖ. క్వారీల్లో జరిపే పేలుళ్లకు సంబంధించి ఉపయోగించే జిలెటిన్‌ స్టిక్స్‌ రవాణా, నిల్వకు సంబంధించిన అనుమతులను లీజుదారు చెన్నైకి చెందిన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ నుంచి తెచ్చుకోవాలి. ఇన్నిన్ని శాఖలు, విభాగాలు పనిచేస్తున్నా, మామిళ్లపల్లి వంటి దుర్ఘటనలను నివారించలేకపోవడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ శాఖల మధ్య సమన్వయ లోపమే క్వారీల్లో సమర్థ నిర్వహణ కొరవడటానికీ,  కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


క్వారీ నిర్వాహకుడి అరెస్టు.. ఐదుగురిపై కేసు..

మామిళ్లపల్లి ఘటనపై విచారించేందుకు కడప జిల్లా జేసీ (రెవెన్యూ) గౌతమి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ వ్యవహారంలో ఐదుగురుపై కేసు నమోదు చేశామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. వీరిలో ఇప్పటివరకు మైనింగ్‌ నిర్వాహకుడు నాగేశ్వరరెడ్డి, రఘునాథ్‌రెడ్డిలను అరెస్టు చేసినట్లు వివరించారు. మరో నిందితుడు లక్ష్మిరెడ్డి ఈ ప్రమాదంలోనే మృతి చెందారని తెలిపారు. 


పేలిన ప్రాణాలెన్నో..

2018 ఆగస్టు 3: కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ సమీప క్వారీలో భద్రత లేకుండా నిల్వ చేసిన జిలెటిన్‌ స్టిక్స్‌, మందుగుండు పేలి పది మంది జార్ఖండ్‌, ఒడిసా కూలీలు చనిపోయారు. 

2017:  గుంటూరు జిల్లా ఫిరంగిపురం క్వారీలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కూలీలు మరణించారు. 

2009 నవంబరు: గుంటూరు జిల్లా దాచేపల్లిలో జిలిటెన్‌ స్టిక్స్‌ నిల్వల్లో అజాగ్రత్త వల్ల జరిగిన పేలుళ్లలో 12 మంది మృత్యువాత పడ్డారు. 32 మంది గాయపడ్డారు. 

Updated Date - 2021-05-11T09:16:13+05:30 IST