సీతా చరితం

ABN , First Publish Date - 2020-06-13T09:59:41+05:30 IST

శ్రీరామాయణానికి ‘‘సీతాయాశ్చరితం మహత్‌’’.. అనగా, ‘గొప్పదైన సీతాచరితము’ అనే పేరు కూడా ఉంది. శ్రీ మహాలక్ష్మి అవతారమైన సీతమ్మతల్లి.. సహధర్మచారిణి అనే మాటకు నిజమైన అర్థంలా లోకానికి ఆదర్శమై నిలిచింది. కైకేయి కోరిన వరాలను బట్టి, దశరథ మహారాజు ఆజ్ఞను అనుసరించి.. రాముడు మాత్రమే వనవాసానికి

సీతా చరితం

శ్రీరామాయణానికి ‘‘సీతాయాశ్చరితం మహత్‌’’.. అనగా, ‘గొప్పదైన సీతాచరితము’ అనే పేరు  కూడా ఉంది. శ్రీ మహాలక్ష్మి అవతారమైన సీతమ్మతల్లి.. సహధర్మచారిణి అనే మాటకు నిజమైన అర్థంలా లోకానికి ఆదర్శమై నిలిచింది. కైకేయి కోరిన వరాలను బట్టి, దశరథ మహారాజు ఆజ్ఞను అనుసరించి.. రాముడు మాత్రమే వనవాసానికి వెళ్లాలి. కానీ సీతాదేవి పతి బాటలో నడిచింది. అలా అరణ్యానికి వెళ్లకపోతే సీతాపహరణం జరిగేది కాదు. లోకకంటకుడైన రావణుని వధించడమే ప్రధాన ప్రయోజనంగా కలిగిన శ్రీరామావతార లక్ష్యం నెరవేరేది కాదు. శ్రీరామాయణానికి ‘‘పౌలస్త్య వధమ్‌ (రావణ వధ)’’ అనే మరోపేరు కూడా ఏర్పడకపోయేది. సీతారాములు స్వభావంలో, వయసులో, నడవడికలో, రూపంలో, గుణగణాల్లో, వంశ మర్యాదను పరిరక్షించడంలో ఒకరికొకరు తగిన జోడు. సీతాపహరణం చేసిన రావణునితో మాట్లాడుతూ హనుమంతుడు ఆ విషయాన్నే ఇలా చెప్పాడు..

తుల్య శీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణామ్‌

రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణా

తప్పుచేసినవారిని క్షమించడంలో కూడా సీతారాముల బాట ఒక్కటే. అశోకవనంలో ఉన్న సీతాదేవి తనవద్దకు వచ్చిన రావణుని ఉద్దేశించి.. ‘‘నీవు చేసిన తప్పు తెలుసుకొని శ్రీరాముని శరణువేడితే, అతనితో మైత్రి ఏర్పరచుకుంటేప్రాణాలతో ఉండగలుగుతావు. అనవసరంగా మరణాన్ని కొని తెచ్చుకోకు’’ అని హితవు పలికింది. యుద్ధరంగంలో  శ్రీరాముడు కూడా రావణుని ధనస్సును విరగ్గొట్టి, కిరీటాన్ని పడగొట్టి ‘‘ఓ రావణా! ఈ రాత్రికి ఇంటికి వెళ్లి, విశ్రాంతిని పొంది, రేపటి యుద్ధానికి సిద్ధమై రా’’ అనడం ద్వారా, తన తప్పు తెలుసుకోవడానికి రావణుడికి ఒక అవకాశాన్నిచ్చాడు. తమకు అపకారం చేసిన శత్రువు కూడా సద్బుద్ధిని అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని ఆ దంపతులిద్దరూ ఆకాంక్షించారు. రాక్షస బాధలను తొలగించి తమను రక్షించాలని కోరిన మహర్షులకు, తన శరణుజొచ్చిన విభీషణునికి శ్రీరాముడు అభయప్రదానం చేస్తే.. లంకలో తనను మాటలతో, చేష్టలతో బాధించిన రాక్షస స్త్రీలకు.. వారు కోరకుండానే సీతాదేవి అభయమిచ్చి కాపాడింది. ‘‘సీతమ్మ కష్టాలను ప్రత్యక్షంగా చూసిన హనుమంతుడు తన శక్తిని ప్రదర్శించి, అమ్మా సీతమ్మ తల్లీ! నిన్ను నేను శ్రీరాముని దగ్గరకు తీసుకెళ్తాను’’ అని వేడుకొనగా.. ‘‘శ్రీరాముడు లేనప్పుడు రావణుడు నన్ను దొంగబుద్ధితో లంకలోకి చేర్చాడు. శ్రీరాముడే వచ్చి ఈ రావణుని వధించి, విజేతగా నిలిచి నన్ను అయోధ్యా నగరానికి తీసుకువెళ్లినప్పుడే నాకు, నా గౌరవానికి తగినట్లుండున’’ని పలికిన ధీర వనిత జానకి. సీతాదేవి తన శక్తిని రావణాసురుణ్ని చంపడానికో, తన క్రోధాగ్నిలో అతణ్ని భస్మం చేయడానికో, తనను తాను కాపాడుకోవడానికో వినియోగించలేదు. కానీ హనుమంతుని తోకకు రాక్షసులు నిప్పు పెట్టినప్పుడు మాత్రం, తన పాతివ్రత్య మహిమను ఉపయోగించి ఆ మంటలు చల్లారేలా చేసింది. అలా ప్రతి సందర్భంలోనూ సీతాదేవి గొప్పదనం ప్రతిఫలిస్తుంది కాబట్టే.. శ్రీరామాయణాన్ని ‘సీతాయాశ్చరితం మహత్‌’ అన్నాడు వాల్మీకి. ఆదర్శ దంపతులైన ఆ సీతారాముల చరితం సకల మానవాళికి అన్ని కాలాల్లోనూ ఆదర్శప్రాయమే.

- సముద్రాల శఠగోపాచార్యులు, 9059997267

Updated Date - 2020-06-13T09:59:41+05:30 IST