సర్కారీ ఆస్తులమ్మితే నజరానా!

ABN , First Publish Date - 2021-06-15T08:38:42+05:30 IST

ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మితే ప్రోత్సాహకాలు, బహుమతులు ఇస్తామని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

సర్కారీ ఆస్తులమ్మితే నజరానా!

  • రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం
  • ఇక్కడి బీజేపీ, కాంగ్రెస్‌ నేతలేమో
  • భూముల విక్రయాన్ని అడ్డుకుంటామంటారు
  • ఉమ్మడి రాష్ట్రంలో భూములు అమ్మలేదా?: హరీశ్‌
  • ‘సంగమేశ్వర లిఫ్ట్‌’ సర్వే పనులు ప్రారంభం


సంగారెడ్డి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మితే ప్రోత్సాహకాలు, బహుమతులు ఇస్తామని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసిందని   మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో సంగమేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సర్వే పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను విక్రయించడంలో ముం దున్న రాష్ట్రానికి 40% నిధులను విడతలవారీగా కేటాయిస్తామని కేంద్రం తన లేఖలో పేర్కొందన్నారు. ఇందుకోసం రూ.6 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కేం ద్రంలోని బీజేపీ సర్కారు తీరు ఇలా ఉండగా.. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు మాత్రం నిరర్థక ఆస్తులను, భూములను అమ్మితే ఊరుకోబోమని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అమ్మిన భూములను తాము అధికారంలోకి రాగానే వెనక్కి తీసుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2004-14 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ హయాంలో వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి 88,500 ఎకరాలు విక్రయించారని గుర్తు చేశారు. భూముల అమ్మకాలను ఆన్‌లైన్‌లో పారదర్శకంగా చేపడతామని, ఎవరైనా కొనుగోలు చేయవచ్చని ఆయన చెప్పారు.


హరీశ్‌ను కలిసిన జగ్గారెడ్డి

సంగమేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సర్వే పనుల ప్రారంభోత్సవంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. హరీశ్‌ కంటే ముందే ఆయన లింగంపల్లి చేరుకున్నారు. ఈ సం దర్భంగా మంత్రి హరీశ్‌.. ‘జగ్గారెడ్డి గారూ నమస్కారం.. మంచి పనికి హాజరవడం సంతోషంగా ఉంది’ అన్నారు. జగ్గారెడ్డి కూడా హరీశ్‌కు ప్రతినమస్కారం చేశారు. 

Updated Date - 2021-06-15T08:38:42+05:30 IST