నేటి పరిస్థితులకు నిలువుటద్దం నాయాతు!

ABN , First Publish Date - 2021-05-16T05:56:19+05:30 IST

ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని.. అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే- ఇది అసత్యమే అని అర్థమవుతుంది...

నేటి పరిస్థితులకు నిలువుటద్దం నాయాతు!

ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనని.. అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయని మన రాజ్యాంగం చెబుతుంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే- ఇది అసత్యమే అని అర్థమవుతుంది. కొందరు వ్యక్తుల అధికారం.. వారి చేతిలో ఉండే వ్యవస్థలు- ఒక వ్యక్తిని ఎంత్తైనా వేధించవచ్చని అనేక సంఘటనలు మనకు రుజువు చేస్తూ ఉంటాయి. అలాంటి కొన్ని సంఘటనలు తీసుకొని వాటి ద్వారా రూపొందించిన చిత్రం నాయాతు (మళయాళంలో వేట అని అర్థం). ఈ చిత్ర కథ- ఒక వ్యక్తికి వ్యవస్థకు జరిగే పోరాటం కాదు. రాజకీయనాయకులు తమకు అందుబాటులో ఉన్న వ్యవస్థలను తమకు లాభించే అంశాల కోసం ఎలా ఉపయోగించుకుంటారో చెప్పే వాస్తవ గాథ. దీనిని చూసిన తర్వాత మన చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటలన్నీ ఒకొక్కటిగా గుర్తుకురాక మానవు. ఒక విధంగా మన సమాజంలో పరిస్థితులకు ఈ చిత్రం అద్దం పడుతుంది. 


ఈ చిత్రం కేరళ ఎన్నికల నేపథ్యంలో ప్రారంభమవుతుంది. ఒక చిన్న పట్టణంలో పోలీసు శాఖలో పనిచేసే ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌కు ఒక కులానికి చెందిన వ్యక్తులకు మధ్య పోలీసు స్టేషన్‌లో ఒక చిన్న ఘర్షణ జరుగుతుంది. అది చిలికి చిలికి గాలివాన్నై రాజకీయ రంగు పులుముకుంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ ముగ్గురు ప్రయాణిస్తున్న జీపు- పోలీసు స్టేషన్‌లో గోడవ చేసిన ప్రధాన వ్యక్తి స్నేహితుడిని ఢీకొంటుంది. ఆ యాక్సిడెంట్‌లో అతను చనిపోతాడు. తాము కూడా పోలీసులే కాబట్టి.. తమ శాఖ వారు  సాయం చేస్తారనే ఉద్దేశంతో వీరు ముగ్గురు స్టేషన్‌కు వెళ్తారు. అప్పటికే వారిని బంధించి, హత్యకేసు పెట్టమని ఎస్పీని ముఖ్యమంత్రి ఆదేశిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి వారు ముగ్గురు పారిపోతారు. ఆ తర్వాత వారిని పట్టుకోవటానికి పోలీసులు ఎలాంటి వ్యూహాలు పన్నుతారు.. ఎన్నికల్లో గెలవటానికి రాజకీయనాయకులు తమకు దొరికిన ప్రతి చిన్న అంశాన్ని ఎలా వాడుకుంటారనేది ఈ చిత్ర కధాంశం.


సాధారణంగా మన తెలుగు చిత్రాల్లో కనిపించే హీరోయిజం.. విలనీ.. ఎత్తులు పైఎత్తులు దీనిలో మనకు కనిపించవు. పాత్రలు, పాత్రధారులు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారే తప్ప అసాధారణంగా వ్యవహరించరు. ఈ కేసు నుంచి తప్పించుకొనే పరిస్థితి లేదనే విషయం తెలిసి.. తన కూతురుకి ఎన్నటికి ఒక హంతకుడి కుమార్తెగా ముద్ర పడకూదనీ ఎస్సే ఆత్మహత్య చేసుకొనే విషయం.. ఆ తర్వాత ఇద్దరు కానిస్టేబుల్స్‌ను పోలీసు ఉన్నతాధికారులు బెదిరించే విషయం చాలా సహజంగానే మనకు కనిపిస్తాయి. అంత కన్నా ముఖ్యంగా- ఈ చిత్రం క్లైమాక్స్‌లో ఒకరు గెలవటం.. మరొకరు ఓడిపోవటం ఉండవు. చిత్రం చూసిన తర్వాత దానిలోని పాత్రలు.. వారి బలహీనతల పట్ల జాలి కలుగుతుందే తప్ప - వారి ప్రవర్తన అసాధారణంగా అనిపించదు. పైగా కేరళలో ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో విడుదలయిన ఈ చిత్రం, ముమ్ముటి నటించిన వన్‌ లను చూస్తే- ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. చివరగా- మన చుట్టూ ఉండే సమాజంలో హీరోలు, విలన్లు వేర్వేరుగా ఉండరు. పరిస్థితులు, అవకాశాల ఆధారంగా వీరిని సమాజమే తయారుచేసుకుంటుంది. ఈ విషయాన్ని మళయాళ సినిమాలు చక్కగా ఆవిష్కరిస్తాయి. సామాజిక సృహ ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమిది. 

  • నాయాతు
  • దర్శకుడు మార్టిన్‌ ప్రాకాత్‌
  • ఓటీటీ ప్లాట్‌ఫాం:  నెట్‌ఫ్లిక్స్‌



Updated Date - 2021-05-16T05:56:19+05:30 IST