Advertisement
Advertisement
Abn logo
Advertisement

సరిహద్దు అడవులపై నెత్తుటి మరక

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టు నక్సల్స్‌ మృతి
వాజేడు మండలం నుంచి ఛత్తీ్‌సగఢ్‌లోకి ప్రవేశించే అడవుల్లో ఘటన
ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌, ఎల్‌ఎంజీ రైఫిల్స్‌ స్వాధీనం
కూంబింగ్‌ చేస్తుండగా చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌
పారిపోయిన నక్సల్స్‌.. పోలీసుల గాలింపులు
తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌


వాజేడు, అక్టోబరు 25: అగ్రనేతల మరణాలు, వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు, తీవ్రమైన పోలీసుల నిర్బంధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పోలీసు ఎదురుకాల్పుల్లో ముగ్గురు సెంట్రల్‌ రీజినల్‌ కంపెనీ సభ్యులు హతమయ్యారు. మెరుపు దాడుల సూత్రధారి, పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌ అయిన హిడ్మా కోసం జరుగుతున్న వేటతో గత 10 రోజులుగా తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం అడవుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌తో అడవి దద్దరిల్లింది. తుపాకుల మోతలు హోరెత్తగా పచ్చని వనం రక్తపు మరకలతో ఎరుపెక్కింది.

వాజేడు మండలం నుంచి ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోకి ప్రవేశించే ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా ఎల్మిడి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చిల్లంతోగు గుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఛత్తీ్‌సగఢ్‌ సౌత్‌ బస్తర్‌కు చెందిన సెంట్రల్‌ రీజినల్‌ కంపెనీ-2 సభ్యులు నరోటి దమాల్‌ అలియాస్‌ కమ్మా, పూనెం భద్రు, సంతోష్‌ అలియాస్‌ రామాల్‌ మృతి చెందిన వారిలో ఉన్నారు.  కమ్మా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గట్టు ఏరియా వాసి. భద్రు బీజాపూర్‌ జిల్లా పెద్దకోర్మ్‌ గ్రామానికి చెందిన వాడు. రామాల్‌ బాసగూడ ప్రాంతంలోని మల్లిపాడు వాసి.  

ఎస్‌ఎల్‌ఆర్‌ (ఎల్‌ఎంజీ), ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్‌తోపాటు మ్యాగజైన్‌లు, కార్డెక్స్‌ వైరు, ప్రెషర్‌కుక్కర్‌, హ్యాండ్‌ గ్రనేడ్‌, కత్తి, కెమెరా ఫ్లాష్‌, నాలుగు సోలార్‌ ప్లేట్లు, సో లార్‌ ఫోల్డేబుల్‌ షీట్‌, 12కిట్‌బ్యాగులు, రెండు వాటర్‌క్యాన్ల ను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌, ములుగు జిల్లా పోలీసులు, ఛత్తీ్‌సగఢ్‌ బలగాలు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్టు సమాచారం. కూంబింగ్‌ నిర్వహిస్తున్న క్రమంలో సుమారు 30 మంది సాయుధ మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలను బీజాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

జాయింట్‌ ఆపరేషన్‌
మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ యన వైద్యంకోసం ములుగు జిల్లాలోకి ప్రవేశించాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈక్రమంలో పోలీసులు ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చే శారు. ఇందులో భాగంగానే జిల్లా సరిహద్దు అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోం ది. ఈఘటనా సమయంలో 30 మందికిపైగా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. చెల్లాచెదురైన వారిలోని కొందరు తెలంగాణ అడవుల్లోకి వచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో జిల్లాలోని గోదావరి పరివాహ క మండలాలైన వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూ డెం, ఏటూరునాగారానికి వచ్చిపోయే దారులపై నిఘాపెంచారు. కాగా, ఎన్‌కౌంటర్‌ ఘటనలో మొదట  వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్‌ అ లియాస్‌ ఉంగల్‌ అలియాస్‌ రఘు మృతి చెందాడంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన లేడని తేలింది.

కూంబింగ్‌ ముమ్మరం : ఎస్పీ

ములుగు :
తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దులో సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పుల ఘటన తర్వాత ములుగు జిల్లా పరిధిలోని వెంకటాపురం(నూగూరు), వాజేడు, పేరూరు, ఏటూరునాగారం అటవీప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్లు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని ఎల్మిడి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయన్నారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ర్టాల గ్రేహౌండ్స్‌ బలగాలతోపాటు ములుగు జిల్లా పోలీసులు సంయుక్తంగా కూంబింగ్‌ చేస్తుండగా తారసపడ్డ మావోయిస్టులు కాల్పులు జరిపారని తెలిపారు. ఈ సందర్భంగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన తదుపరి దర్యాప్తును ఛత్తీ్‌సగఢ్‌ పోలీసులు జరుపుతారని తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి వచ్చి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు అండగా ఉండాలని సూచించారు. ఓఎస్డీ శోభన్‌కుమార్‌, ములుగు ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement