Abn logo
Feb 24 2020 @ 04:11AM

వ్యాకుల చిత్తానికి ఆధ్యాత్మికతేశరణ్యం!

ధనం, పదవి, భోగం, ఐశ్వర్యం అన్నీ పొందాక మనిషి ఏం చేయాలి? అన్న ప్రశ్నకు వాటిని కాపలాకాస్తూ జీవించడమే అన్న సమాధానం వస్తుంది. భిన్నమైన జీవనవిధానంలో కోరికలూ అనేకం. అవి నిరంతరం సంఘర్షిస్తూనే ఉంటాయి. వాటికి ఎక్కడా శాంతి లేదు. హద్దు అసలే లేదు. దీని వల్ల సంఘర్షణ మొదలవుతుంది. సాధనసమయంలో ఏకాంతంగా, మౌనంగా ఉండాలని మన పెద్దలు, శాస్త్రాలు చెప్పడంలోని అంతరార్థం ఇదే. ఎప్పుడైతే అంతర్ముఖులం అవుతామో సరస్సు అడుగు భాగంలో మెరిసే ఆల్చిప్పల్లా మన అంతరంగం అంతా మనకు కనిపిస్తుంది. మాలిన్యాలూ కన్పిస్తాయి. ఆ మాలిన్యాలే సంఘర్షణలు. వాటి నివారణకు భాగవత తత్వాన్ని అనుసరించాలి.


‘‘దారిద్య్రదుఃఖజ్వరదాహితానాం

మాయాపిశాచీపరిమర్దితానామ్‌

సంసారసింధౌ పరిపాతితానాం

క్షేమాయ వై భాగవతం ప్రగర్జతి’’


దారిద్య్రం, దుఃఖం, జ్వరం, మాయ, సంసారం - ఇలా అన్నింటినీ సులభంగా కడతేర్చే ఉపాయం భాగవతం అంటుంది శాస్త్రం. ఇక్కడ భాగవతం అంటే భగవత్తత్వం. భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, ముక్తిని కలిగించేదని అర్థం. జగన్మంగళమైన భగవత్తత్వం తెలుసుకోవడమే యోగం. జగత్తంతా వ్యాపించిన పరమాత్మ.. ఉపాధితో కూడిన జీవుడిలోనూ ఉన్నాడు. సెల్‌ఫోన్‌తరంగాలు అంతటా వ్యాపించి ఉన్నాయి. వాటిని పట్టుకోవాలంటే ఏదైనా సెల్‌, అందులో సిమ్‌కార్డ్‌, ఆ ఫోన్‌లో నిక్షిప్తమై ఉన్న చార్జింగ్‌ అవసరం. అలాగే జీవుడి ఉనికిగా ఉన్న దేహం, శ్వాస, ఆత్మ ఈ మూడూ ఆ పరమాత్మతో అనుసంధానమైతేనే ‘యోగం’ జరుగుతుంది. కాబట్టి మొదట అంతటా వ్యాపించిన పరమాత్మను ఎలా పట్టుకోవాలో తెలిపే బ్రహ్మవిద్యను గుర్తెరగాలి. సర్వభూతాంతర్యామి అయిన పరమపురుషుని నిత్యత్వాన్ని ప్రాజ్ఞులైనవాళ్లు తలచుకొని మనస్సులో ఎల్లప్పుడూ ధ్యానిస్తూనే ఉంటారు. ఆ సంప్రజ్ఞత మనలో ఉంటే చేసే ఏ కర్మ అయినా అది భగవద్దత్తమే. పూజలో, జపంలో, తపస్సులో, యజ్ఞంలో, పఠనంలో, శ్రవణంలో, యోగంలో అన్నింటిలో ఆ పరాతత్వ దర్శనం జరిగి తీరుతుంది. దానితో అనుసంధానం లేని ఎంత గొప్ప అనుష్ఠానమైనా వృధాప్రయాసే. ఎప్పుడైతే విరాట్పురుషుని విస్మృతి లేకుండా భజిస్తామో ‘వ్యాకులచిత్తం’ వ్యాసచిత్తంగా మారుతుంది.


మనస్సులోని సంఘర్షణలు మాయమైపోయేందుకు ఆధ్యాత్మిక దర్శనం జరగాలి. అదే బ్రహ్మవిద్య. ‘అహం బ్రహ్మాస్మి’ అని ధైర్యంగా ప్రకటించాయి ఉపనిషత్తులు. అది ఎవరూ మెరుగులు దిద్దలేని వేదాంత నినాదం. అవతలివైపు ఇంకేమీ లేదని చెప్పే మహత్తర సందేశం. అలాంటపుడు క్షుద్రమైనవేవీ మనసును తాకలేవు. ఎలాంటి ద్వంద్వ రూప భావాలను, లౌకిక విషయాలను కలిగించని మహోన్నతస్థితి... మనలోని రహస్యమైన అస్తిత్వాన్ని గొప్పగా విస్తరించుకునే దివ్యశక్తి... ఆధ్యాత్మికత. అది లభ్యమైన తక్షణం అన్నీ మటుమాయం.


- డా. పి. భాస్కరయోగి [email protected]