మనస్సుకు, ప్రాణాలకు మూలం.. ఆత్మ శక్తి

ABN , First Publish Date - 2020-03-31T08:47:51+05:30 IST

ప్రపంచం నుంచి జ్ఞానాన్ని గ్రహించే మనస్సు, కర్మలు చేయడానికి కర్మేంద్రియాలకు ఆధారమైన ప్రాణం.. ఈ రెండూ జీవశక్తి అనే ఒకే వృక్షానికి రెండు కొమ్మల్లాంటివని దీని అర్థం. రమణ మహర్షి రచించిన 30 శ్లోకాల ‘ఉపదేశ సారం’లోని 12వ శ్లోకమిది.

మనస్సుకు, ప్రాణాలకు మూలం.. ఆత్మ శక్తి

చిత్త వాయవః చిత్ర్కియాయుతా

శాఖయోర్‌ ద్వయీ శక్తి మూలకా


ప్రపంచం నుంచి జ్ఞానాన్ని గ్రహించే మనస్సు, కర్మలు చేయడానికి కర్మేంద్రియాలకు ఆధారమైన ప్రాణం.. ఈ రెండూ జీవశక్తి అనే ఒకే వృక్షానికి రెండు కొమ్మల్లాంటివని దీని అర్థం. రమణ మహర్షి రచించిన 30 శ్లోకాల ‘ఉపదేశ సారం’లోని 12వ శ్లోకమిది. మనస్సుకు, శ్వాసకు మధ్య గల సంబంధాన్ని రమణులు ఈ శ్లోకం ద్వారా వివరించారు. ప్రాణాయామం లేదా ప్రాణేక్షణ వల్ల మనస్సు ఎలా నిగ్రహించబడుతుందో తెలిపారు. జీవునిలో జీవశక్తి (చైతన్యం) ఒక మహా వృక్షంలా ఉంది. ఆ శక్తికి రెండు కొమ్మలు. ఒకటి.. జ్ఞానేంద్రియాలతో కూడిన మనస్సు (జ్ఞాన శక్తి), రెండోది కర్మేంద్రియాలకు ఆధారంగా ఉన్న ప్రాణం (క్రియా శక్తి). మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంలోని శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలనే ఐదు విషయాలను తెలుసుకుంటుంది. కనుక అది జ్ఞాన శక్తి. ఆ తెలుసుకున్న విషయాల ఆధారంగా కర్మేంద్రియాలు కర్మలు చేస్తాయి. వాటికి ఆదారం ప్రాణవాయువే. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే 5 పేర్లతో ప్రాణం పనిచేస్తుంది.


ఇది క్రియాశక్తి. జ్ఞానాన్ని పొందాలంటే మనస్సు ఉండాలి. కర్మలు చేయాలంటే కర్మేంద్రియాలుండాలి. ఆ కర్మేంద్రియాలకు ఆధారంగా ప్రాణం ఉండాలి. ఆ మనస్సు, ఈ ప్రాణం రెండూ చెట్టుకొమ్మలైతే వాటికాధారమైన చెట్టే జీవశక్తి-ఆత్మ చైతన్యం. అంటే ఆత్మ చైతన్యం వల్ల జ్ఞానేంద్రియాలు ప్రపంచ విషయాలను గ్రహిస్తాయి. వాటిని మనస్సుకు అందజేస్తాయి. వాటిని ఆత్మచైతన్యం వల్లనే మనసు గ్రహిస్తుంది. అలాగే ఆత్మచైతన్యం వల్లనే మనలో ప్రాణవాయువులు సంచరిస్తున్నాయి. ఈ ప్రాణవాయువుల కారణంగానే అన్ని కర్మేంద్రియాలూ పనిచేయగలుగుతున్నాయి. అందుకే జ్ఞానాన్ని గ్రహించే మనస్సుకు, కర్మలు చేసే కర్మేంద్రియాలకు ఆధారమైన ప్రాణాలకూ.. ఒక్క శక్తే ఆధారం. మూలం. అదే చైతన్యశక్తి, ఆత్మశక్తి. కనుక అందులో ఒకదాన్ని నిగ్రహిస్తే మరొకటి నిగ్రహింపబడుతుంది.


ఒక కొమ్మను లాగితే రెండో కొమ్మ కదులుతుంది. అలాగే.. ఒకే చైతన్యశక్తి మనస్సులోను, ప్రాణాల్లోను ఉండడం చేత మనస్సును నిరోధిస్తే ప్రాణం నిరోధించబడుతుంది. ప్రాణవాయువును నిరోధిస్తే మనస్సు నిరోధించబడుతుంది. మరి రెండింటిలో దేన్ని నిరోధించడం కష్టం? అంటే.. ‘వాయోరివ సుదుష్కరం’ అని గీతలో చెప్పినట్లు మనస్సును నిలబెట్టడం చాలా కష్టం (సుదుష్కరం). అందుకే ప్రాణాయామం ద్వారా మనస్సును నిరోధించాలని చెప్పారు. మనస్సుకు, ప్రాణవాయువుకు (శ్వాసకు) ఉన్న పరస్పర సంబంధం మనకు అనుభవంలో ఉన్నదే. మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస క్రియ నెమ్మదిగా, నిశ్శబ్దంగా జరుగుతుంది. అదే ఆవేశం వచ్చినప్పుడు శ్వాసవేగం పెరుగుతుంది. ఇది చాలు శ్వాసకు, మనస్సుకు గల సంబంధం తెలుసుకోవడానికి అందుకే.. శ్వాసను వీక్షించడం వల్ల మనస్సు పూర్తిగా కాకున్నా కొంతవరకూ నిగ్రహింపబడుతుంది. మనస్సును నిరోధించడానికి, హృదయస్థానంలో దానికి స్వస్థత కలిగించడానికి భగవాన్‌ రమణులు మనకు ‘ప్రాణ వీక్షణం’ అనే ప్రక్రియను మనకు అందించారు. ఇందులో కేవలం శ్వాసను గమనించడం మాత్రమే చేయాలి. దాంతో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అది చేసినంతసేపూ మనసు నిగ్రహించబడుతుంది.


- దేవిశెట్టి చలపతిరావు, care@srichalapathirao.com

Updated Date - 2020-03-31T08:47:51+05:30 IST