ఆ స్పృహతో జీవించాలి...

ABN , First Publish Date - 2022-07-22T08:06:38+05:30 IST

ఒక మహర్షి దగ్గర ఉన్న శిష్యుడికి.... తను మహా జ్ఞానిననీ, ఎన్నడూ భ్రమలో పడననీ అహంకారం కలిగింది. అతను ఒక రోజు మహర్షి దగ్గరకు వెళ్ళి, ‘‘నేను చేయగలిగే సేవ ఏదైనా ఉంటే చెప్పండి’’ అని ప్రార్థించాడు.

ఆ స్పృహతో జీవించాలి...

ఒక మహర్షి దగ్గర ఉన్న శిష్యుడికి.... తను మహా జ్ఞానిననీ, ఎన్నడూ భ్రమలో పడననీ అహంకారం కలిగింది. అతను ఒక రోజు మహర్షి దగ్గరకు వెళ్ళి, ‘‘నేను చేయగలిగే సేవ ఏదైనా ఉంటే చెప్పండి’’ అని ప్రార్థించాడు. 


‘‘ప్రస్తుతం అయితే ఏమీ లేదు. కానీ మనం ఇద్దరం కూర్చొని, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం రా!’’ అని పిలిచాడు మహర్షి. 


వారి మధ్య సంభాషణ దాదాపు రెండు గంటలపాటు సాగింది. ఆ తర్వాత ‘‘నాకు చాలా దాహంగా ఉంది. వెళ్ళి నీళ్ళు తీసుకురా’’ అని శిష్యుడిని మహర్షి ఆదేశించాడు.


అలాగేనంటూ శిష్యుడు ఒక చెంబు తీసుకొని, దగ్గరలో ఉన్న నదికి వెళ్ళాడు. నదిలో నీరు ఎక్కడో లోతుగా ప్రవహిస్తోంది. వంగి నీటిలో చెంబు ముంచబోతూ, నదీ ప్రవాహంలో జారి పడిపోయాడు. నీటిలో కొట్టుకుపోతూ స్పృహ తప్పాడు.


కళ్ళు తెరిచి చూసేసరికి... ఒక అందమైన యువతి తనకు సపర్యలు చేస్తూ కనిపించింది. ఆమెపై అతనికి ప్రేమ కలిగింది. ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి సంతానం కలిగింది. వారి ఆలనా పాలన కోసం ఏదో పనిలో చేరాడు. అంతా చక్కగా సాగిపోతోంది. తాను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో... ఇవేవీ అతనికి గుర్తు లేవు. అలా చాలాకాలం గడిచింది.


ఒక రోజు అతను నదీతీరంలో విహరిస్తూ, ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో... నదీ ప్రవాహాన్ని గమనిస్తూ ఉండగా... అప్పుడు స్పృహ వచ్చింది. ‘అరే... నేను మహర్షి కోసం నీరు తేవడానికి వచ్చి చాలాకాలం గడిచిపోయిందే... భార్య, పిల్లలు... సంసారంలో పడిపోయానేమిటి?’ అనుకొని, పరుగుపరుగున మహర్షి దగ్గరకు వచ్చాడు.


మహర్షి అప్పటికీ అక్కడే కూర్చొని, అతడి కోసం ఎదురుచూస్తున్నాడు. 

‘‘గురువుగారూ! నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. మీరు నీరు తీసుకురమ్మని చెప్పి ఎంతో కాలం గడిచిపోయింది’’ అన్నాడు ప్రాధేయపూర్వకంగా. 


‘‘నిన్ను నీళ్ళు తీసుకురమ్మని పంపింది ఇప్పుడే కదా, ఎక్కడ ఆలస్యమైంది?’’ అన్నాడు మహర్షి. 

శిష్యుడికి జరిగిందేమితో అర్థం కాలేదు.


అప్పుడు మహర్షి ‘‘నువ్వు ఎప్పుడూ దారి తప్పననీ, భ్రమలకు లోనవననీ ఎంతో గర్వపడేవాడివి. కానీ దారి తప్పడానికి ఒక్క క్షణం చాలనే కనువిప్పు నీకు కలగాలనే ఆ మాయ అంతా జరిగింది’’ అని చెప్పాడు మహర్షి.


దుఃఖాలు, బాధల్లో తలమునకలవుతూ ఉన్నప్పుడు మాత్రమే... తాను దారి తప్పాననీ, ‘ఇక నా మనుగడ సాగేది ఎలా?’ అనీ వేదన పడతాడు. తన ఇష్టప్రకారం ఏదైనా జరగనప్పుడు మనిషి విలపిస్తాడు. ఆ స్థితిలో భగవంతుడికి మొర పెట్టుకుంటాడు. భగవంతుడంటే ఏదో మాంత్రికుడన్నట్టు ‘‘భగవంతుడా! నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు’’ అని ప్రార్థిస్తాడు గానీ, ‘‘ఓ భగవంతుడా! నేను దారి తప్పకుండా ఉండడం కోసం అవసరమైన సద్బుద్ధిని ప్రసాదించు’’ అని ఎన్నడూ కోరుకోడు. 

మనిషి మాయలో మైరచిపోయినప్పుడు... తను ముందుకు సాగాలంటే వెలుగు అవసరమనే విషయం కూడా మరచిపోతాడు. తను జన్మించిన ఈ ప్రపంచాన్ని ఏదో ఒక రోజు విడిచిపోవాల్సిందేననే ఆలోచన కూడా ఉండదు. అందుకే... ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోతానన్నట్టుగా, మరణం ఎన్నడూ తన దగ్గరకు రాదన్నట్టుగా జీవిస్తూ ఉంటాడు. కానీ ఇది వాస్తవం కాదు కదా! తను దారి తప్పాననే సంగతి కూడా మనిషికి గుర్తుండకపోతే అది చాలా ప్రమాదం. ఆ విషయాన్ని గ్రహిస్తే... తన గమ్యాన్ని చేరుకోడానికి కనీసం ప్రయత్నమైనా చేస్తాడు. అందులో సఫలీకృతుడు కాగలడు కూడా. కానీ దారితప్పినట్టు గుర్తించకపోతే... ఆ శిష్యునిలా... మిగిలిన విషయాల్లో మైమరచిపోయి, అందులోనే నిమగ్నమైపోతాడు. జీవితం వ్యర్థమవుతుంది. 


కాబట్టి చైతన్యవంతంగా... తాను పయనించే దారి పట్ల స్పృహతో జీవితాన్ని సాగించాలి. భగవంతుడి మీద సర్వదా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. 

Updated Date - 2022-07-22T08:06:38+05:30 IST