యుగావతారుడి మౌనం

ABN , First Publish Date - 2022-07-08T08:49:31+05:30 IST

హెర్‌ బాబా ఆరాధకులకు జూలై పదవ తేదీ చాలా పవిత్రమైన రోజు. వారందరూ ఆ రోజున మౌనం పాటిస్తారు. ‘‘ఇది మెహెర్‌ బాబా తమకు ఇచ్చిన ఆదేశం’’ అని చెబుతారు.

యుగావతారుడి మౌనం

10న మెహెర్‌ బాబా మౌన వార్షికోత్సవం


హెర్‌ బాబా ఆరాధకులకు జూలై పదవ తేదీ చాలా పవిత్రమైన రోజు. వారందరూ ఆ రోజున మౌనం పాటిస్తారు. ‘‘ఇది మెహెర్‌ బాబా తమకు ఇచ్చిన ఆదేశం’’ అని చెబుతారు. 1925 జూలై 10న మెహెర్‌ బాబా మౌన దీక్ష ప్రారంభించారు. అప్పటికి ఆయన వయస్సు ముప్ఫై సంవత్సరాలు. ఆ రోజుల్లో ఆయన శ్రోతలను సమ్మోహపరిచేలా మాట్లాడేవారు. చక్కని గాత్రం ఆయన సొంతం. 1969 జనవరి 31న... తన భౌతిక శరీరం వదిలిపెట్టే వరకూ... అంటే సుమారు 44 సంవత్సరాలు పైబడి ఆయన మౌనం పాటించారు. మౌనంగానే ఆసేతు హిమాచలం సుమారు 72 వేల కిలో మీటర్లు ప్రయాణించారు. యూరప్‌, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాలలో 13 సార్లు పర్యటించారు.  ఈ పర్యటనలకు ఆయన చేపట్టిన కఠిన మౌనం ఎన్నడూ అవరోధం కాలేదు.  ఆధ్యాత్మిక పథంలో ఉన్నవారి కోసం ‘భగవద్వచనం’, ‘సర్వం - శూన్యం’ ... ఇలా అనేక ఆధ్యాత్మిక ప్రవచనాలను మౌనంగానే గ్రంథస్తం చేశారు. 


మౌనం ఎందుకు...

క్షణకాలం నోరు మూసుకొని కూర్చోవడమే చాలా కష్టం. అటువంటిది మెహెర్‌ బాబా ‘‘నాలుగు దశాబ్దాలకు పైగా మౌనంగా ఎలా ఉన్నారు? అసలు ఆయన మౌనం ఎందుకు చేపట్టారు?’’ అని మహాత్మా గాంధీ నుంచి ఎందరో  పెద్దలు, ముఖ్యంగా దేశ విదేశాలలో ఆయనను కలిసిన ఎందరో జర్నలిస్టులు పలు సందర్భాలలో మెహెర్‌ బాబాను ప్రశ్నించారు. ‘‘నేనెప్పుడూ మౌనంగా లేను. నా భక్తుల హృదయాలతో నేను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను’’ అని ఆయన సమాధానమిచ్చారు. ఒక విలేకరి ఇదే ప్రశ్న అడిగినప్పుడు ‘‘భగవంతుడు ఎందుకు మాట్లాడడని మీరెప్పుడైనా ప్రశ్నించారా?’’ అన్నారాయన. ‘‘నా మౌనంలోని మాటలు వినపడకపోతే,నా మాటల వల్ల లాభం ఏముంద’’న్నారు. మెహెర్‌ బాబాను తమ ఇలవేల్పుగా ఆరాధించేవారందరూ... బాబాను తలుచుకోగానే తమ సందేహాలన్నిటికీ సంతృప్తికరమైన జవాబు లభిస్తుందంటారు. 


ఆఖరి మౌఖిక ఆధ్యాత్మిక ప్రవచనం  

మెహెర్‌ బాబా 1925 జూలై తొమ్మిదిన తన సమీపంలో ఉన్న శిష్యులతో చివరిగా మాట్లాడుతూ ‘‘మనుషులు తమ మనస్సును సన్మార్గంలో ప్రయాణించేలా నియంత్రించాలి. ఏనాటికైనా ఈ మానవ దేహం అలసి, సొలసి, నశించిపోతుంది. కాబట్టి, ఈ దేహాన్ని సమాజంలో తోటివారికి సహాయపడేలా శాయశక్తులా కృషి చేయాలి’’ అని సూచించారు. ఆ తరువాత బాబా తన సందేశాలను మౌనంగానే ప్రవచించారు.


విశ్వ సందేశం 

1958 జూలై 10న...  32వ మౌన వార్షికోత్సవం సందర్భంగా మెహెర్‌బాబా విశ్వమానవాళికి ఒక సందేశం ప్రకటించారు. ఆ రోజున తన ఆరాధకులెవరూ మౌనం పాటించవద్దని ఆదేశించారు. ‘‘భగవంతుని సన్నిధికి చేరుకోవాలంటే ‘నేను’ అనే భావానికి దూరంగా ఉండాలి. ‘నేను, నాది, నాకు’ అనే మూడిటికి దూరమైన కొద్దీ భగవంతుడికి సన్నిహితులు అవుతారు’’ అని తన సందేశంలో పేర్కొన్నారు. ‘‘భగవన్మార్గంలో మీరేమీ త్యజించవలసిన పనిలేదు. ఆచరణలో ఇది చెప్పినంత సులువు కాదు. కానీ నేను సూచించే ప్రేమ సందేశాన్ని అనుసరించగలిగితే అంత కష్టం కూడా కాదు’’ అని స్పష్టం చేశారు. 


అదే లక్ష్యం కావాలి...

‘‘మానవుడి జీవిత లక్ష్యం భగవదైక్యం కావాలి. ఎన్నో సంవత్సరాలు దేవుని కోసం ఎదురు చూసిన కోట్లాది మందిలో... ఏ ఒక్కరో ఆధ్యాత్మిక పరిధిలోకి చేరగలుగుతారు. వారిలో... ఎవరైతే తన కోసం జీవించకుండా, భగవంతుని కోసం తనను సర్వార్పణ చేసుకుంటారో... అలాంటి ఒక్కరు భగవదైక్యం సాధిస్తారు. కాబట్టి భగవదైక్యం ఎంత కష్టమనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ తీరిక సమయంలో నా నామస్మరణను అలవాటు చేసుకోండి. మీ జీవిత లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది’’ అని మెహెర్‌ బాబా చెప్పారు. 


కాగితాలపై కష్టాలు 

ఒకసారి సమావేశం ముగిసే సమయంలో... మెహెర్‌ బాబాకు కొంతమంది భక్తులు తమ కష్టసుఖాలు చెప్పుకోవాలని ప్రయత్నించారు. మరికొంతమంది తమ  సమస్యలను కాగితం మీద రాసుకొచ్చారు. ఇది గమనించిన మెహెర్‌ బాబా ‘‘మీ బాధలను చెప్పుకోవడానికి నా దగ్గరకు రావలసిన పనిలేదు. నేను భగవతుణ్ణి. సర్వజ్ఞుణ్ణి. మీ గురించి నాకు అన్నీ తెలుసు. అలా తెలియని పక్షంలో మీరు నాకు కాగితాలపై రాసి ఇవ్వడం వల్ల లాభం ఏముంది?’’ అన్నారు. ‘‘నాతో చెప్పుకోవాల్సింది ఏమైనా వుంటే  మీ హృదయాంతరాళం నుంచి తెలియజేయండ’’న్నారు. తాను అద్భుతాలు, చమత్కారాలు చేయనని పలుసార్లు ఆయన చెప్పారు. అయితే కష్టాలలో ఉన్న వారిని మెహెర్‌ బాబా పలుమార్లు ఆదుకున్నారని, ఆయన పిలిస్తే పలికే దైవమని, అనుక్షణం తమకు అండగా ఉంటారనీ, ఆయన నామస్మరణ వల్ల అసాధ్యాలు సుసాధ్యమైన సందర్భాలు అనేకం ఉన్నాయనీ ఆయన ఆరాధకులు చెబుతారు. 


-మెహెర్‌ బాబా ప్రేమ సందేశం 

-ఎప్పుడూ సత్యం మాత్రమే మాట్లాడండి.  

- ఇతరులను పరోక్షంగా కూడా దూషించ వద్దు. 

-ఎవరినీ ద్వేషించవద్దు.

- ఎవరితోనూ శత్రుత్వం వద్దు.  

-ఎవరి మనస్సునూ నొప్పించేలా ప్రవర్తించవద్దు.

-తన ఆరాధకులు ఈ ప్రేమ సందేశానికి ప్రతీకలుగా ఉంటే ఈ విశ్వమంతా ప్రేమమయమౌతుందనీ, విశ్వంలో ద్వేషం, స్వార్ధం కనుమరుగైపోతాయని మెహెర్‌ బాబా ప్రకటించారు.


-డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌, 99595 53218

Updated Date - 2022-07-08T08:49:31+05:30 IST