Abn logo
Aug 8 2020 @ 23:43PM

రెండు పడవల ప్రయాణం బాగుంది!

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కృష్ణానగర్‌ కష్టాల గురించి చెబుతుంటాడు. సిద్ధూ జొన్నలగడ్డ మాత్రం ఆ కష్టాలు, అనుభవాలను ‘ఆన్‌ ఫీల్డ్‌ కోర్స్‌’ అని చెబుతున్నారు. బీటెక్‌ పూర్తి చేసి యాదృచ్ఛికంగా సినిమాల్లోకి వచ్చిన అతడు తన ప్యాషన్‌ ఏంటో తెలుసుకుని హీరోగా, రైటర్‌గా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. పదకొండేళ్ల జర్నీలో ఏం నేర్చుకున్నాడో ‘నవ్య’తో చెప్పుకొచ్చాడు...


నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే. నాన్న బీఎస్‌ఎన్‌ఎల్‌, అమ్మ ఆల్‌ ఇండియా రేడియోలో ఉద్యోగులు. ఇద్దరూ రిటైర్‌  అయ్యారు. నేను బీటెక్‌ పూర్తి చేసి అమెరికా వెళ్లాలనుకున్నా. మధ్య తరగతి కుటుంబం కావడంతో బ్యాంక్‌లో లోన్‌ తీసుకోవడం, వాటిని తీర్చడం... ఇవన్నీ నన్ను కట్టిపడేస్తాయని ఆగిపోయా. పైగా లోన్‌ భారం కుటుంబ సభ్యులపై పెట్టడం ఇష్టంలేక చదువైనా, జాబ్‌ అయినా ఇక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఎటువంటి సినిమా నేపథ్యంలేని కుటుంబం మాది. నాకే సినిమాల్లోకి రావాలనిపించింది. అది ఎలా జరిగిందో కూడా నాకు తెలీదు. స్కూల్లో ఉండగా, బీటెక్‌ చేస్తున్నప్పుడు కూడా ఈ ఆలోచన లేదు. సడన్‌గా సినిమాల్లోకి రావాలనే  ఆలోచన వచ్చింది. అప్పట్లో మేం సికింద్రాబాద్‌లో ఉండేవాళ్లం. అటు నుంచి ఫిల్మ్‌నగర్‌ వచ్చి వాళ్లనీ, వీళ్లనీ  పట్టుకుని సినిమా ఆఫీసులకు వెళ్లి  ఫొటోలు ఇచ్చేవాడిని. ఆడిషన్స్‌కు కూడా  వెళ్లి అవకాశాలు అందుకున్నా. తెరపై నేను  కనిపించిన తొలి సినిమా ‘జోష్‌’. ఆ తర్వాత ‘ఆరెంజ్‌’, భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాల్లో నటించా. కొన్నాళ్ల తర్వాత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ‘ఎల్‌బీడబ్ల్యూ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యా. ఆ తర్వాత కూడా  కొన్ని చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు చేశా. ‘గుంటూరు టాకీస్‌’, ఇటీవల విడుదలైన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ చిత్రాలు హీరోగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

మనమే క్రియేట్‌ చేసుకోవాలి...

ప్రస్తుతం మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నా.  నేను సినిమాల్లోకి వెళ్తానంటే కుటుంబ సభ్యులు ఎవరూ అడ్డు చెప్పలేదు. ఈ ఇండస్ట్రీ గురించి వారికి ఏ అవగాహనా లేకపోయినా నాకు స్వేచ్ఛనిచ్చి, నచ్చింది చేసుకోమని సపోర్ట్‌ చేశారు. యాక్టింగ్‌, కథలు రాయడం ఇలాంటివేమీ నాకు తెలీదు. సినిమాల్లోకి వచ్చాకే నాకు ఏదంటే ఇష్టమో, నా ప్యాషన్‌ ఏంటో నాకు తెలిసింది. కథలు రాయగలననీ, యాక్ట్‌ చేయగలననీ అర్థమైంది. ఎలాంటి ప్లాన్‌ లేకుండా ర్యాన్‌డమ్‌గా వచ్చాను. అందుకే నేనే ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ, ఎదురుదెబ్బలు తింటూ ఓ దార్లోకి వచ్చా. ‘ఎవరికో నేను దొరకడం... నాకు ఎవరో దొరకడం కాకుండా నాకు నేను దొరికాను’ అని ఫీలవుతుంటా. ఎందుకంటే నాకు ఇక్కడ తెలిసినవాళ్లు, గైడ్‌ చేసేవాళ్లు, గాడ్‌ ఫాదర్లు ఎవరూలేరు. ‘ఇలా చేస్తే పనులు అవుతాయి’ అని కొందరు చెప్పిన మాటలు విని, అవన్నీ చేసి, చివరికి ‘మనం ఏదో చేస్తే కాదు అవకాశాలు ఎవరూ ఇవ్వరు. మనమే క్రియేట్‌ చేసుకోవాలి’ అని గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది.


ఆన్‌ ఫీల్డ్‌ కోర్స్‌ అనుకుంటా...

ప్రయత్నం చేసిన ప్రతిసారీ ఇది వర్కవుట్‌ అవుతుందా, అనుకున్నట్లు చేయగలమా అన్న అనుమానాలు వెంటాడుతుండేవి. ఇక్కడ టాలెంట్‌ ఒకటే సరిపోదు.. దానికి తగ్గట్టు అన్నీ సమపాళ్లలో కుదరాలి.. టైమ్‌ కూడా కలిసి రావాలి. మనం వెళ్లిన ప్రాంతం ఎలాంటిది.. అసలు సినిమా అంటే ఏంటి.. అవగాహన చేసుకొంటూ  మనకు మనమే నేర్చేసుకోవాలి. నా 11 ఏళ్ల జర్నీ గురించి ఎవరెవరో ఏదో అంటుంటారు కానీ. నేను మాత్రం ఆన్‌ ఫీల్డ్‌ కోర్స్‌ అనుకుంటా.

కథలు రాయడం ఛాలెంజింగ్‌గా ఉంది...

నాలో రైటర్‌  కూడా ఉన్నాడని సినిమాల్లోకి వచ్చాకే తెలిసింది. ‘గుంటూరు టాకీస్‌’ సినిమా చేస్తున్నప్పుడు ప్రవీణ్‌తో కలిసి ఏదన్నా కొత్తగా చేయాలని ప్రయత్నించినప్పుడు నాలో రైటర్‌ బయటికొచ్చాడు. ఇటీవల హిట్‌ అయిన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’కు రచనా సహకారం చేశా. ఈ చిత్రం ఓటీటీలో విడుదలైనా చక్కని విజయం సాధించింది. ప్రస్తుతం సితారా ఎంటర్‌టైన్‌మెంట్‌లో రెండు సినిమాలకు కథ రాస్తున్నా. అందులో ఒకటి ‘నరుడి బ్రతుకు నటన’. అలాగే మధురశ్రీధర్‌ రెడ్డి బ్యానర్‌లో విమల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి రచనా సహకారం చేస్తున్నా. ‘మా వింత గాథ వినుమా’ నేను రాసిన కథే! హీరోగా నటిస్తూ, కథలు రాయడం ఛాలెంజింగ్‌గా ఉంది. ప్రస్తుతానికైతే రెండు పడవల ప్రయాణం బాగానే ఉంది. ఎంజాయ్‌ చేస్తూ పని చేస్తున్నా.


దేనికీ బాధ పడాల్సిన పనిలేదు..

నా పదకొండేళ్ల జర్నీలో దేనికీ బాధ పడకూడదని, మన హ్యాపీనెస్‌ని తీసుకెళ్లి ఎక్కడో పెట్టకూడదని నేర్చుకున్నా. నా ఆనందం ఎక్కడో లేదు.. నా దగ్గరే ఉందని తెలుసుకున్నా. కష్టపడాలి.. ఫలితం పొందాలి...


ఇవే నా పారామీటర్స్‌..

నేను ఏ కథ రాసినా నా జీవితంలోని చిన్నచిన్న అనుభవాలు ఆ  కథలో కనిిపించాలనుకుంటా. రియల్‌ ఫీల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ ఆ కథలో చూసుకుంటా. నాకు అన్ని జానర్‌ సినిమాలూ ఇష్టమే. రాసే ప్రతి కథ రొటీన్‌గా కాకుండా కొత్తగా  ఉండాలి. ఓ కథ రాయాలంటే నాకు ఉండే పారామీటర్స్‌ ఇవే!


క్రియేటివిటీలో తేడా ఉండదు..

ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. థియేటర్‌లో విడుదలైన సినిమాకు స్పందన ఒకలా ఉంటుంది. ఓటీటీలో విడుదలైతే మరోలా ఉంటుంది. కానీ కథ, క్రియేటివ్‌ వర్క్‌ విషయంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. థియేటర్‌లో సినిమా విడుదలైతే రెవెన్యూ బావుంటుంది. నిర్మాతలకు లాభం వస్తుంది. నిర్మాత బాగుంటేనే కదా సినిమాలు వచ్చేవి. ప్రతిభతో ఎదిగి మన చుట్టూ ఉన్నవాళ్లంతా నాకు స్ఫూర్తి.


బంధుప్రీతి అర్థం తెలీదు.. 

బంధుప్రీతి అన్నదానికి నాకు సరైన అర్థం తెలీదు. మనకు తెలిసిన వాళ్లకు అవకాశం కల్పించడం నెపొటిజం అయితే అది తప్పుకాదని నా అభిప్రాయం. వేరే వాళ్ల అవకాశాలు తొక్కేస్తేనే తప్పు. నా విషయమే తీసుకుంటే ... నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. కొంత టైమ్‌ పట్టినా నేను ఎదిగాను. ఇంకా ఎదగాలి.. అంటే కష్టపడాలి. ఎవరో వచ్చి మనల్ని శిఖరం మీద కూర్చోపెట్టరు కదా? ఎవరో  ఎవర్నో  తొక్కేసే టైమ్‌ కాదిది. ప్రతిభ, కష్టపడే తత్వం ఉంటే జీవితం సాఫీగా సాగుతుంది.


-ఆలపాటి మధు 

Advertisement
Advertisement
Advertisement