ఇలా అయితే జన్మ వృథా!

ABN , First Publish Date - 2020-10-09T07:40:22+05:30 IST

మానవ జన్మ ఎత్తిన తరువాత ఏకాగ్రత అలవాటు కాకపోతే ఆ జన్మ అంతా వృథా. గురువులు, ఉపాధ్యాయులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఆ ఏకాగ్రత లేకపోతే జన్మ మొత్తం వృథా అయినట్టే! ‘విజ్ఞులైన వారి కోసం ఈ మాట చెబుతున్నా! విద్యార్థుల కోసం కాదు’ అని అంటున్నాడు భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి...

ఇలా అయితే జన్మ వృథా!

మానవ జన్మ ఎత్తిన తరువాత ఏకాగ్రత అలవాటు కాకపోతే ఆ జన్మ అంతా వృథా. గురువులు, ఉపాధ్యాయులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఆ ఏకాగ్రత లేకపోతే జన్మ మొత్తం వృథా అయినట్టే! ‘విజ్ఞులైన వారి కోసం ఈ మాట చెబుతున్నా! విద్యార్థుల కోసం కాదు’ అని అంటున్నాడు భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి. కొందరు జీవితాన్ని ఏ రకంగా వ్యర్థం చేసుకుంటారో ఈ పద్యం ద్వారా వివరించాడు కవి. 


చెలువౌ రత్నఘటంబునం దతడు సుశ్రీఖండఖండంబులం/ దిలపిణ్యాకము వండె నారుగల కర్థిన్‌ సప్తపర్ణావృతుల్‌ / నిలిపెన్‌ జిల్లెడు దూదికై పుడమి దున్నెన్‌ బైడినాగేళ్ళ ని / మ్ముల గర్మక్షితి బుట్టి యెవ్వడు దవంబుల్‌ సేయడప్రాజ్ఞతన్‌!

మానవజన్మ ఎత్తడమే దుర్లభం. అందునా భారతీయుడివై పుట్టడం మరింత దుర్లభం. ఎందుకంటే మనదొక్కటే కర్మభూమి. మానవజన్మ సార్థకత తెలుసుకోవాలంటే భారతీయుడై పుట్టాలి. మానవ జన్మ ఎత్తి, యోగ మార్గంలో ప్రయాణం చేయలేకపోతే, కేవలం సంపాదనలు, సినిమాలు అని తిరుగుతూ ఉంటే ఏమై పోతుందో తెలుసా? 

ఈ పద్యం అర్థం చూద్దాం. దేవతలు ఒక భక్తుడికి మెచ్చి రత్నాలు పొదిగిన బంగారు పాత్రను బహుమతిగా ఇచ్చారు. పొయ్యిలో మంట కోసం మంచి గంధం చెక్కలు ఇచ్చారు. ఆ భక్తుడు ఏం వండాడో తెలుసా? ‘‘తిలపిణ్యాకము’’.. తెలగపిండి వండాడట. అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ది బురదలోకి లాగింది అంటారు కదా! అది ఇక్కడ సరిపోతుంది. పంట చేనులో పశువులు పడి మేయకుండా ఉండడం కోసం కంచె వేస్తారు. మరి ఇక్కడ మళ్లీ ఏం చేశాడో తెలుసా? జావ కాచుకునే ఆళ్ల విత్తనాలు నాటి, రక్షణ కోసం ఏడు ఆకుల అరటి చెట్లు కంచెగా నాటించాడట. ఆళ్ల గింజలు కాపాడటానికి అరటి మొక్కలు నాటడమేంటి? ఇదో అజ్ఞానం. ‘పోనీ ఈసారైనా బాగుపడతాడు’ అని దేవతలు ఎకరం భూమి, దున్నుకోవడానికి బంగారు నాగళ్ళు ఇచ్చారట. మరి దున్ని ఏం పండించాడట? జిల్లేడు చెట్లు పండిచాడట! సాధనాలు అన్నీ ఉన్నా, గొప్ప గొప్ప ఇళ్లల్లో జన్మించినా జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు కొంతమంది. ఈ  మూర్ఖుల మాదిరిగానే చాలామంది తమ పనులు సక్రమంగా పూర్తి చేయడం లేదు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదు. జన్మ వృథా చేసుకోవడం కాకుంటే ఇది మరేమిటి?


- గరికిపాటి నరసింహారావు


Updated Date - 2020-10-09T07:40:22+05:30 IST