Abn logo
Sep 28 2020 @ 00:06AM

కరోనాతో రోజుకో పాఠం!

Kaakateeya

కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి ఆమె దిశానిర్దేశం చేస్తున్నారు. రోగుల్లోనూ, వారి కుటుంబ సభ్యుల్లోనూ ధైర్యాన్ని నింపుతున్నారు. అత్యుత్తమ రికవరీ రేటును తమ ఆసుపత్రి సాధించడం వెనుక సిబ్బంది శ్రమ, త్యాగం ఎంతో ఉందంటున్నారు హైదరాబాద్‌లోని ప్రకృతి చికిత్సాలయం పరింటెండెంట్‌ డాక్టర్‌ శొంఠి భవానీ. ఈ విపత్కాలంలో తన అనుభవాలను ‘నవ్య’తో ఆమె పంచుకున్నారు. 


‘‘ప్రకృతి వైద్యురాలిగా నా ముఫ్ఫై ఏళ్ళ అనుభవమంతా ఒక ఎత్తయితే, ఈ కరోనా కాలంలోని అనుభవం మరొక ఎత్తు. ప్రస్తుత పరిస్థితులు నాకు రోజుకొక కొత్త పాఠాన్ని నేర్పుతున్నాయి. ఆరు నెలల క్రితం నా వృత్తి జీవితం పూర్తి భిన్నంగా ఉండేది. ప్రకృతి చికిత్స కోసం వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడం, కాలేజీలో పాఠాలు చెప్పడం, ఆసుపత్రి బాధ్యురాలిగా అడ్మినిస్ట్రేటివ్‌ పనులు... వీటితో నా విధులు ముగిసేవి. ఉదయం తొమ్మిది గంటలకు ఆసుపత్రికి వస్తే సాయంత్రం ఆరు గంటలకు ఇల్లు చేరేదాన్ని. ఇప్పడు అర్థరాత్రి కూడా విధుల్లో ఉంటున్నా. ఒక విధంగా మా వైద్యులం యుద్ధభూమిలో సైనికుల్లా కరోనాను పారద్రోలడానికి పని చేస్తున్నాం. ఈ క్రమంలో నన్ను కదిలించిన ఎన్నో సంఘటనలున్నాయి.


ఒక ఎన్నారై కుటుంబంలో అతని తల్లికీ, తండ్రికీ, తాతకూ, నాయనమ్మకూ కరోనా సోకింది. తాతయ్య చనిపోయారు. నాయనమ్మ ఒక ఆసుపత్రిలో తండ్రి మరొక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ ఎన్‌ఆర్‌ఐ తల్లి మా దగ్గర అడ్మిట్‌ అయ్యారు. తన కుటుంబ సభ్యుల్లో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో అమెరికాలో ఉంటున్న ఆ ఎన్‌ఆర్‌ఐకి తెలీదు. చివరకు మమ్మల్ని సంప్రతించాడు. రోజూ నాలుగైదు సార్లు నాకు ఫోన్‌ చేసి వారి వివరాలు అడిగేవాడు. ఒక్కోసారి ఏడ్చేవాడు కూడా! నాకున్న పరిచయాలతో అతని కుటుంబంలోని వారి వివరాలు సేకరించి, వారి యోగక్షేమాలు అతనికి చెప్పాను. అవి విని అతను ఎంత సంతోషించాడో! మరోవైపు ప్రైవేటు హాస్టళ్ళలో ఉంటున్న యువత, నిరాశ్రయులైన వలస కార్మికులు పడుతున్న బాధలు మా మనసుల్ని మరింత మెలిపెట్టేవి. వారికి చికిత్సతో పాటు ఓదార్పు కూడా అందించాం. ఒకసారి ఒక రోగి కళ్ళు తిరిగి పడిపోయాడు. అతను కొవిడ్‌ బాధితుడనే సంగతి పట్టించుకోకుండా మా ఆసుపత్రి సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, సపర్యలు చేశారు. కోలుకొని తిరిగి వెళ్తున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన ఆనందం, మాటల్లో కృతజ్ఞతాభావం మమ్మల్ని మరింతగా కార్యోన్ముఖుల్ని చేశాయి. చెబుతూ పోతే ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో! అవన్నీ వ్యక్తిగతంగా జీవిత పరమార్థాన్ని నాకు బోధించాయనుకుంటున్నా. 


ఎందరో ముందుకు వచ్చారు

లాక్‌డౌన్‌ తొలి రోజుల్లో నిత్యం హడావిడిగానే ఉండేది. ఒక రోజు అర్థరాత్రి ఆసుపత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘‘మేడమ్‌! వాటర్‌ పైప్‌ లైన్‌ పగిలింది. ఒక్కచుక్క నీరు లేదు’’ అని. ఆ వేళలో, అదీ కరోనా భయం అందరినీ బెంబేలెత్తిస్తున్న సమయంలో ‘ఎవరొస్తారులే!’ అనుకొని వదిలేయలేం కదా! అందులోనూ నీరు లేకపోతే ఎన్నో ఇబ్బందులు... వెంటనే డైరెక్టరీలు వెతికి ప్లంబర్లకు ఫోన్లు చెయ్యడం ప్రారంభించాను. ‘ఉదయాన్నే వస్తాం’ అని కొందరు, రావడానికి వాహనం లేదని మరికొందరు చెప్పారు. చివరకు ఒక వ్యక్తి స్పందించారు. కాటేదాన్‌ నుంచి ఆ వేళలో వచ్చి, పైప్‌లైన్‌ సరిచేశారు. దాంతో పెద్ద గండం గడిచినట్టయింది. మరో రోజు రాత్రి ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి, ఆసుపత్రిలో కరెంటు పోయింది. నాకు ఆ విషయం తెలిసిన వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులతో మాట్లాడాను. అప్పటికప్పుడు ఇద్దరు లైన్‌మేన్లను పంపారు. అరగంటలో సమస్య తీరింది. ఇలా ప్రతికూల పరిస్థితి ఎదురైన ప్రతి సందర్భంలోనూ మాకు అండగా నిలిచినవారెందరో! అలాంటి వారివల్లే మేం సేవలు అందించగలుగుతున్నాం. 


ఆయన సహకారంతోనే...

అలాగే వైద్య సిబ్బందికి కుటుంబాల నుంచీ అందుతున్న సహకారం కూడా ఎనలేనిది. కరోనా రోగుల సేవల కోసం నేను రోజూ ఆసుపత్రికి వెళ్ళేదాన్ని. పైగా నా విధులకు నిర్ణీత సమయం ఉండేది కాదు. లాక్‌డౌన్‌ కారణంగా పబ్లిక్‌, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌  పూర్తిగా బంద్‌ అయింది. నాకు డ్రైవింగ్‌ రాదు. ఈ సమస్యకు నా భర్త శ్రీహరి రూపంలో పరిష్కారం దొరికింది. ఆయన నాగపూర్‌లో ఉద్యోగం చేస్తారు. లాక్‌డౌన్‌ వల్ల హైదరాబాద్‌ వచ్చారు. రోజూ ఆసుపత్రికి ఆయనే తీసుకువెళ్ళి, తీసుకువచ్చేవారు. రాత్రివేళ నాకు ఆలస్యమైతే ఆసుపత్రి ఆవరణలో పడిగాపులు కాచేవారు. ఇంటి పనుల నుంచి నన్ను మినహాయించారు. ఆయన సహకారంతోనే మొదటి మూడు నెలలూ నా విధుల్ని సమర్థంగా నిర్వహించగలిగాను. క్వారంటైన్‌ ప్రకృతి వైద్యంలో భాగమే!

ప్రకృతి వైద్యంలో క్వారెంటైన్‌ పద్ధతి కూడా మిళితమై ఉంది. దీనిలో శుచికీ శుభ్రతకూ ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టే కరోనాకు మొదటి నుంచీ నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రి క్వారంటైన్‌ కేంద్రంగా, ఇప్పుడు ఐసోలేషన్‌ కేంద్రంగా మంచి సేవలు అందించగలుగుతోంది. ప్రకృతి చికిత్సాలయంలో యోగాధ్యయన పరిషత్‌ కళాశాల, వేమన యోగా రీసెర్చ్‌ సెంటర్‌, ప్రాణాయామ రీసెర్చ్‌ సెంటర్‌ కూడా భాగాలే. ఇప్పుడు అన్ని వర్గాలవారూ ప్రకృతి చికిత్సను ఆశ్రయిస్తున్నారు. వారికి అందే సేవల్లో ఎలాంటి తారతమ్యాలూ ఉండవు. ప్రకృతి చికిత్సాలయంలో కొవిడ్‌ పరీక్షలతో పాటు సేవలన్నీ పూర్తి ఉచితం. ఇప్పటి వరకూ పాతికవేల మందికి కొవిడ్‌ పరీక్షలు చేశాం. పధ్నాలుగు వేల మంది మా దగ్గర చికిత్స పొందారు. మూడు షిప్టుల్లో 34 మంది వైద్యులతో సహా 185 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వారిలో గర్భిణులు, పసిపిల్లల తల్లులూ ఉన్నారు. అయినా ఎవరూ వెనకడుగు వెయ్యలేదు. కొందరికి మొదట్లో ఇరుగుపొరుగు వారి నుంచి వివక్ష ఎదురైంది. కానీ వారంతా మనోధైర్యంతో ముందుకు సాగారు. కరోనా విధుల్లో ఎంతో అప్రమత్తంగా ఉంటున్నాం. మా ఆసుపత్రిలో కేవలం ఏడుగురు సిబ్బంది మాత్రమే కరోనా బారినపడ్డారు. వారంతా తక్కువ సమయంలోనే కోలుకొని, తిరిగి విధుల్లో చేరారు. మా దగ్గర చేరిన కరోనా బాధితుల్లో  దాదాపు 98 శాతం మంది వేగంగా కోలుకోవడం సంతోషంగా ఉంది. ఇదంతా మా సిబ్బంది వృత్తి నిబద్ధత, అంకితభావం, సమష్ఠి కృషి ఫలితమే. మానవాళి పాలిట ఉపద్రవంలా దాపురించిన కరోనాపై పోరులో నేనూ భాగస్వామి అయినందుకు గర్వంగా ఉంది. ఆ అవకాశం దక్కినందుకు భగవంతుడికి సర్వదా కృతజ్ఞురాలిని.’’మంచి ఆహారం, వ్యాయామంతో కోలుకోవచ్చు!

కరోనా సోకినవారు తగిన ఆహారం తీసుకోవాలి. అలాగే వ్యాయామం చెయ్యాలి. అప్పుడే వేగంగా కోలుకుంటారు. మా దగ్గర రోగులకు మూడు పూటలా మంచి ఆహారం, ఒక కోడిగుడ్డు ఇస్తాం. సాయంత్రం అల్పాహారంగా పండ్లు, బిస్కెట్లు, డ్రైఫ్రూట్స్‌ ఇస్తుంటాం. కాఫీ, టీలకు బదులుగా మా వైద్యులు ప్రత్యేకంగా తయారుచేసిన కషాయాన్ని రోజుకు రెండుసార్లు రోగులతో తాగిస్తాం. కరోనా నుంచి రక్షణ కోసం జాగ్రత్తల విషయానికొస్తే... కఫాన్ని పెంచే అరటి, పాలు, సపోటా, సీతాఫలం వంటి పండ్లు, ఇతర పదార్థాలను తగ్గించాలి. మా ఆసుపత్రిలో రోజూ రెండు పూటలా రోగులతో యోగా, సూక్ష్మ వ్యాయామాలు చేయిస్తున్నాం. కొన్ని విటమిన్‌ మాత్రలనూ, యాంటీబయోటిక్‌ మాత్రలను అవసరాన్ని బట్టి రోగులకు ఇస్తున్నాం. ఎవరికైనా శ్వాస సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే గాంధీ ఆసుపత్రికి  తరలిస్తున్నాం.


- కె. వెంకటేశ్‌, హైదరాబాద్‌


Advertisement
Advertisement
Advertisement