రూ.3,000 టాబ్లెట్‌ రూ.30కే!

ABN , First Publish Date - 2021-05-07T10:24:58+05:30 IST

కొవిడ్‌ చికిత్సకు రెమ్‌డెసివిర్‌తో కలిపి వినియోగించడానికి అనుమతించిన రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఔషధం ‘బారిసిటినిబ్‌’పై భారత్‌లో

రూ.3,000 టాబ్లెట్‌ రూ.30కే!

బారిసిటినిబ్‌పై పేటెంట్ల రద్దుకు నాట్కో యత్నం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ చికిత్సకు రెమ్‌డెసివిర్‌తో కలిపి వినియోగించడానికి అనుమతించిన రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఔషధం ‘బారిసిటినిబ్‌’పై భారత్‌లో కంపల్సరీ లైసెన్సింగ్‌(సీఎల్‌) కోసం హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా దరఖాస్తు చేసింది. 1, 2, 4 ఎంజీ మోతాదుల బారిసిటినిబ్‌ మాత్రలను కొవిడ్‌ చికిత్సకు వినియోగించడానికి ఈ నెల 3న కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీఓ) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కొవిడ్‌ వ్యాప్తి, దేశంలో అత్యవసర ప్రజారోగ్య పరిస్థితులు, కొవిడ్‌ ఔషధాల కొరత, అధిక ధరల కారణంగా కంపల్సరీ లైసెన్సింగ్‌ను కోరనున్నట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా సీఎల్‌కు కంట్రోలర్‌ ఆఫ్‌ పేటెంట్స్‌కు దరఖాస్తు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


బారిసిటినిబ్‌ అనేది పేటెంట్‌ డ్రగ్‌. దీనిపై ఇన్‌సౌట్‌ హోల్డింగ్స్‌ అనే అమెరికా కంపెనీకి హక్కులున్నాయి. అది ఈ ఔషధ లైసెన్స్‌ను ఎలీ లిల్లీ అనే అమెరికన్‌ ఫార్మా కంపెనీకి ఇచ్చింది. ప్రస్తుతం ‘ఓలుమియంట్‌‘ బ్రాండ్‌తో బారిసిటినిబ్‌ను ఎలీ లిల్లీ విక్రయిస్తోంది. అమెరికాలో రెమ్‌డెసివిర్‌తో కలిపి బారిసిటినిబ్‌ను వినియోగించడానికి గత నవంబరులో ఎఫ్‌డీఏ అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కొవిడ్‌ విజృంభణను పరిగణనలోకి తీసుకుని దేశీయంగా బారిసిటినిబ్‌పై ఎటువంటి క్లినికల్‌ పరీక్షలు నిర్వహించకుండానే అత్యవసర వినియోగానికి సీడీఎ్‌ససీఓ అనుమతించిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆక్సిజన్‌ను అందించాల్సి వచ్చే కొవిడ్‌ రోగుల్లో బారిసిటినిబ్‌ ప్రభావవంతంగా పని చేస్తోందని, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వాలని కంపెనీ కోరిందని చెబుతున్నారు. ఈ మేరకు సీడీఎ్‌ససీఓ అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చిందన్నారు. దీని ప్రాతిపదికనే కంపల్సరీ లైసెన్సునూ పొందాలని నాట్కో నిర్ణయించింది. 


లైసెన్స్‌ జారీ చేస్తే..

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ట్రిప్స్‌ ఒప్పందం ప్రకారం ఔషధాలను తక్కువ ధరకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కంపల్సరీ లైసెన్స్‌ ఇవ్వొచ్చు. ప్రభుత్వం నుంచి ఈ లైసెన్స్‌ పొందితే ఔషధాన్ని కనుగొన్న కంపెనీ ఆమోదం లేకుండానే పేటెంట్‌ డ్రగ్‌కు జనరిక్‌ ఔషధాన్ని తయారు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. బారిసిటినిబ్‌పై సీఎల్‌ను జారీ చేస్తే దేశీయంగా ఈ ఔషధం చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుంది. గత రెండేళ్లలో 9,000 టాబ్లెట్లను మాత్రమే భారత్‌ దిగుమతి చేసుకోగలిగిందని.. సగటున ఒక్కో టాబ్లెట్‌ ధర రూ.3,230 పడిందని సీఎల్‌ దరఖాస్తులో నాట్కో ప్రస్తావించినట్లు సమాచారం. కొవిడ్‌ రోగులు రోజుకు ఒక టాబ్లెట్‌ చొప్పున 14 రోజులు ఈ టాబ్లెట్‌ను తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ధర పెద్ద అడ్డంకిగా ఉందని నాట్కో అభిప్రాయపడింది. 4 ఎంజీ టాబ్లెట్‌ను రూ.30కే అందించగలమని దరఖాస్తులో ప్రస్తావించింది. 2ఎంజీ టాబ్లెట్‌ ధరను రూ.20గా, ఒక ఎంజీ టాబ్లెట్‌ ధరను రూ.15గా దరఖాస్తులో కంపెనీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బారిసిటినిబ్‌ ఏపీఐ, ఫినిష్డ్‌ డోసుల తయారీ, మార్కెటింగ్‌కు కంప్లసరీ లైసెన్స్‌ జారీ చేయాలని కంపెనీ కోరింది. బారిసిటినిబ్‌ విక్రయాలపై వచ్చే లాభాల్లో 7 శాతాన్ని ఎలిలిల్లీకి రాయల్టీగా చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.


ఇది రెండో సారే..

కంపల్సరీ లైసెన్సింగ్‌ ప్రతిపాదన చేయడం దేశంలో ఇప్పటి వరకూ ఇది రెండోసారే. దాదాపు దశాబ్దం క్రితం బేయర్‌ కేన్సర్‌ ఔషధంపై నాట్కోనే కంపల్సరీ లైసెన్స్‌ పొందింది. ఇండియన్‌ పేటెంట్‌ కార్యాలయం సీఎల్‌ను మంజూరు చేసింది. చివరి దశకు చేరిన మూత్రపిండాల కేన్సర్‌ చికిత్సకు వినియోగించే నెక్సావర్‌ ఔషధంపై కంపల్సరీ లైసెన్స్‌ సంపాదించింది. అప్పట్లో రూ.2.8 లక్షల ధర ఉన్న 120 టాబ్లెట్ల ప్యాక్‌ను రూ.8,880కే అందుబాటులోకి తీసుకొచ్చింది.’

Updated Date - 2021-05-07T10:24:58+05:30 IST