Abn logo
Apr 11 2021 @ 00:08AM

అమృతోత్సవాలలో నరేంద్రజాలం!

భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు ప్రారంభమయ్యాయి. 2022 ఆగస్టు 15నాటికి భారత స్వాతంత్ర్యం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దానికి ముందు 75 వారాల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. తొంభై యేళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం చేసిన ఉప్పు శాసనాలను ఉల్లంఘించడానికి గాంధీ నాయకత్వంలో జరిగిన దండి యాత్రను స్ఫురణకు తెస్తూ అదే దారిలో సాగే ఫ్రీడంమార్చ్‌ను మార్చి 12న ప్రధాని అహమ్మదాబాద్ నుంచి ప్రారంభించడం ఇందులో తొలిఘట్టం. ఈ సందర్భంగానే ఉత్సవాలకు ఉద్యమం, ఆశయాలు, విజయాలు, చర్యలు, తీర్మానాలు అనే ఐదు లక్ష్యాలను ఆయన ప్రకటించారు. సామాజిక, సాంస్కృతిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో స్వాతంత్ర్యానంతరం దేశం సాగించిన ప్రయాణాన్ని ప్రదర్శించడం కూడా కార్యక్రమంలో ఉంది. అయితే విలువలనూ, ఆశయాలనూ ఒకవైపు పడగొడుతూ మళ్లీ వాటినే నిలబెట్టడం కోసం ఉత్సవాలు జరపడమే ఇక్కడున్న వైరుధ్యం.


నిజానికి మహాత్మా గాంధీ తన అనుచరులతో 1930 మార్చి 12న మొదలుపెట్టి ఏప్రిల్ 5న దండి చేరుకుని మరుసటి రోజు ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించిన ఘటనలో ఉప్పు ఒక సంకేతం మాత్రమే. ప్రభుత్వం నుంచి సంస్కరణలు కోరుతూ అప్పుడు చేసిన పదకొండు డిమాండ్లలో ఉప్పు చివరిది. మిగిలిన అంశాల్లో రాజకీయ ఖైదీల విడుదల, సైనిక శాఖ ఖర్చుల తగ్గింపు, సీఐడీ విభాగంలో సంస్కరణలు, సంపూర్ణ మద్యనిషేధం, రూపాయి- స్టెర్లింగ్‌ల మధ్య అంతరం తగ్గించడం, భూమిశిస్తు సగం చెయ్యడం వంటివి ఉన్నాయి. ఒకవైపు, ప్రశ్నిస్తే చాలు మేధావుల్ని ఖైదు చేస్తూ, రక్షణ శాఖ ఖర్చును పెంచేసి నిరంతరం యుద్ధ సన్నద్ధంగా ఉంటూ, రైతుల్నీ, కార్మికుల్నీ కార్పొరేట్ శక్తుల పరం చేస్తూ మరో వైపు ఫ్రీడంమార్చ్ చేయడం పెద్ద స్వీయ ఖండనం. ఆ మహాప్రస్థానం చెయ్యాల్సింది దేశవ్యాప్తంగా మేధావులు, పౌర సమాజం కదా, డిల్లీ సరిహద్దుల్లో రైతులు కదా, విశాఖ ఉక్కు కార్మికులు కదా! మరి ప్రభుత్వమే ఎదురు చేస్తున్నదేమిటీ? యాంటీ క్లైమాక్సా?


స్వాతంత్ర్య ఉద్యమం ఇచ్చిన విలువల్ని తానే ప్రశ్నార్థకం చేస్తూ తానే ఎలుగెత్తి చాటడం ఇండియా @75 లోని మహేంద్రజాలం. భారత స్వాతంత్ర్య సమరం ఒక మహత్తర సంఘటన. ఎందుకంటే అన్ని స్వాతంత్ర్య సమరాలూ జాతీయోద్యమాలు కావు. అన్ని జాతీయోద్యమాలూ స్వాతంత్ర్య సమరాలు కావు. కానీ భారత స్వాతంత్ర్య సమరం ఒక జాతీయోద్యమం. అన్ని వర్గాల, వర్ణాల, మతాల, ప్రాంతాల ప్రజలు పాల్గొన్న ప్రజాఉద్యమం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్టు ఈ ప్రజలు తమలో తాము సంఘర్షిస్తూ, రాజీపడుతూ, విడిపోతూ, విలీనమవుతూ, మహా శక్తిమంతమైన బ్రిటీష్ సార్వభౌమత్వానికి ఎదురొడ్డారు. ఈ క్రమంలో చారిత్రక సాంస్కృతిక వాస్తవిక ఆచరణాత్మక అవగాహనలో నుంచీ, ఇచ్చి పుచ్చుకోవడంలో నుంచీ ప్రజస్వామిక, లౌకిక, సామ్యవాద విలువల్ని సంతరించుకున్నారు. ఆత్మనిష్ఠం చేసుకున్నారు. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు పూనుకున్నపుడు ఈ భావనలు ఆకాశం నుంచి ఊడిపడలేదు. ప్రజలు నాయకులను, నాయకులు ప్రజలను పరస్పరం ప్రభావితం చేసుకున్న నేపథ్యంలో ప్రజల చైతన్యమూ ఆకాంక్షలే రాజ్యాంగంలో ప్రతిఫలించాయి. రాజ్యాంగం ఆ ఉద్యమ ఫలం. అది మన జీవ ఫలం. జీవఫలం చేదు విషమూ, చేదు విషం జీవఫలమూ అయితే ఎట్లా?


దేశంలో పౌరహక్కులకు తీవ్ర విఘాతం కలిగి అంతర్జాతీయ సంస్థలు ఇండియాను పూర్తి స్వేచ్ఛ కలిగిన దేశాల జాబితాలో నుంచి తొలగించి పాక్షిక స్వేచ్ఛ కలిగిన దేశంగానూ, డెమోక్రటిక్ స్టేటస్ నుంచి దించి ఎలొక్టొరల్ ఆటోక్రసీ గానూ పరిగణిస్తున్న దశలో అసలు స్వాతంత్ర్య ఉద్యమమే మౌలికంగా పౌరహక్కుల ఉద్యమమని గుర్తు చేయవలసి వస్తున్నది. స్వాతంత్ర్యం కోల్పోవడంలో ఇమిడి ఉన్నది జీవించే హక్కు, మాట్లాడే హక్కులను కోల్పోవడమే కదా! మనదేశంలో మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడడమే కదా! తిలక్, గాంధీ మొదలుకుని గాడిచర్ల, గరిమెళ్ల దాకా జైళ్లకు వెళ్లింది మాట్లాడేహక్కు, రాసే హక్కుల కోసమే. మహత్మా గాంధీ ఏమన్నారో తెలుసా? పౌరహక్కులు జీవితానికి నీళ్ల వంటివి అన్నారు. నీళ్లు పలచబడడం తానెప్పుడూ వినలేదనీ అన్నారు. పౌరహక్కులు నిరపేక్షమైన విలువలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి తగ్గించబడరాదని కూడా అన్నారు. మరి ఒక వైపు పౌరహక్కుల్ని కాలరాస్తూ మరో వైపు స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని నిలబెట్టుకోవడం సాధ్యపడుతుందా?


ఎవరెన్ని చెప్పినా స్వాతంత్ర్యోద్యమంలో ముఖ్యభూమిక వహించిన సంస్థ ముమ్మాటికి భారత జాతీయ కాంగ్రెస్‌. దాని మొదటి అధ్యక్షుడు ఉమేశ్ చంద్ర బెనర్జీ హిందూమతస్థుడు. రెండవ అధ్యక్షుడు దాదాభాయ్ నౌరోజీ పార్శీ మతస్థుడు. మూడవ, నాల్గవ అధ్యక్షులైన బద్రుద్దీన్ త్యాబ్జీ, జార్జి యూల్ వరుసగా ముస్లిం, క్రైస్తవులు. ఇక ఐదవ అధ్యక్షుడు కూడా క్రైస్తవుడే. ఆరవ అధ్యక్షుడు పార్శీ కాగా ఏడవ, ఎనిమిదవ అధ్యక్షులు హిందువులు. తొమ్మితో అధ్యక్షుడు మళ్లీ పార్శీ, పదవ అధ్యక్షుడు క్రిస్టియన్. అదీ పరంపర. కాంగ్రెస్ ఎప్పుడూ ఏ మతసమస్య మీద పోరాడలేదనీ, క్రైస్తవులు కాబట్టి బ్రిటీష్ వారు దేశం విడిచిపెట్టి వెళ్లాలని అనలేదంటారు ప్రొఫెసర్ బిపిన్ చంద్ర. రాజ్యాన్ని మతం నుంచి వేరు చేసే ఈ ధోరణే, మతతత్వం దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చినా ఇక్కడ మాత్రం లౌకికవాదం (సెక్యులరిజం) నిలదొక్కుకునేటట్లు చేసింది. లౌకికవాదం అంటే రాజ్యం అన్ని మతాల్నీ సమానంగా చూడడం, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు కల్పించడం లాంటి సాధారణ అంశాలు కాదు. రాజ్యానికి మతం లేకపోవడం అసలు లౌకికవాదం. కొవిడ్ నివారణా మార్గాల్ని గాయత్రీమంత్రంలో చూసే ప్రభుత్వానికి మతం ఉన్నట్లే అనిపిస్తుంది! ఒకవేళ నిజంగా మంత్రంలో మహత్తు ఉంటే, మిగిలిన మతస్థులకు, నాస్తికులకు డోసు ఎలా ఇస్తారో చూడాలి. ఇక ఆహార అలవాట్ల కారణంగా కొన్ని మతాలు, కొన్ని సమూహాలూ దాడులకు గురి కావడం, మతం కారణంగా కొందరికి పౌరసత్వాన్ని నిరాకరించడం ఏ స్వాతంత్ర్యోద్యమ విలువల్ని కాపాడడం?


రైతుల పట్ల ఇంత నిర్దయగా ప్రవర్తిస్తున్న వారికి పటేల్ ఆదర్శపురుషుడూ వికాస పురుషుడు ఎట్లా అయ్యాడో ఆశ్చర్యం వేస్తుంది. పటేల్ సారథ్యంలో రైతులు చేసిన బార్దోలీ సత్యాగ్రహం వీళ్లకు తెలియకుండా ఎట్లా ఉంటుందీ అనుకున్నా - బొంబాయి ప్రెసిడెన్సీలో భూస్వాములనూ, వడ్డీ వ్యాపారులనూ నియంత్రించే చట్టాల రూపకల్పనలో పటేల్ పాత్ర కచ్చితంగా తెలియకపోయి ఉండాలి. ఇక 1936లో ప్రారంభించిన అఖిల భారత రైతు సంస్థకు పటేల్ తొలి అధ్యక్షుడని గుర్తు చెయ్యడానికి ఏం చెయ్యాలో తెలీదు. ఒకవైపు ఆకాశమంత పటేల్ విగ్రహం. మరోవైపు సముద్రమంత రైతుల ఆగ్రహం. మధ్యలో ఆజాదీకా అమృతోత్సవం!


మిశ్రమ ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వరంగ సంస్థలు పెట్టుబడిదారీ, సామ్యవాద వ్యవస్థల మధ్య తుల్యత సాధించడానికి ఉపయోగపడతాయి. సామాన్యులకు, అణగారిన వర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తూ దేశం మొత్తం పెట్టుబడిగా మారకుండా నిరోధిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తుల పరం చెయ్యడం రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడమవుతుందా? దేశాన్ని సామ్యవాదం దిశగా నడిపించడమవుతుందా? స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశీయ పెట్టుబడిదారీ వర్గం విదేశీ పెట్టుబడిదారీ వర్గానికి ద్వితీయశ్రేణి భాగస్వామిగా కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి కల వర్గంగా ఎదగడానికి ప్రయత్నించింది. సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో వెనుకంజ వెయ్యకుండానే వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటూ స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వామి అయ్యింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈ వర్గం పట్ల వలపక్షం చూపించినప్పటికీ మొత్తం మీద స్వాతంత్ర్యం సిద్ధించేనాటికి ఇది స్వతంత్ర వర్గంగా నిలదొక్కుకుంది. ఒకనాటి యూరోపియన్, ఇండియన్ కేపిటలిస్ట్ వర్గాల మధ్య నెలకొన్న వివక్షే ఇప్పుడు దేశంలో కార్పొరేట్ శక్తులకూ, ప్రభుత్వరంగ సంస్థలకూ మధ్య నెలకొని ఉంది. ఈ దశలో స్వాతంత్ర్య స్ఫూర్తిని నిలబెట్టడమంటే ప్రభుత్వరంగ సంస్థల పక్షం వహించడం కదా! మరి జరుగుతున్నదేమిటీ?

కొప్పర్తి వెంకటరమణమూర్తి

Advertisement
Advertisement
Advertisement