కొండపల్లిలో మైనింగ్ అక్రమాలు అరిక్టటాలి: నరహరశెట్టి

ABN , First Publish Date - 2021-07-31T18:12:05+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు అన్నారు.

కొండపల్లిలో మైనింగ్ అక్రమాలు అరిక్టటాలి: నరహరశెట్టి

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు మైనింగ్, ఇసుక, మట్టి ఇలా అందినకాడికి అమ్మేస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కొండపల్లిలో మైనింగ్ అక్రమాలు అరిక్టటాలని ఎప్పటి నుంచో కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. దేవినేని ఉమ వ్యవహారంలో వైసీపీ నేతలు పూర్తిగా రాజకీయ కోణంలోనే కేసులు పెట్టారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాల రాసే విధంగా వైసీపీ ప్రభుత్వం తీరు ఉందని చెప్పారు. 


ప్రతిపక్ష పార్టీ హోదాలో టీడీపీ మాజీ మంత్రులతో నిజనిర్ధారణ కమిటీ వేసిందన్నారు. వారిని బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుని గృహ నిర్భందం చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఎలాంటి అక్రమాలు జరగకుంటే.. వైసీపీ నేతలు పరిశీలనను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని నరహరశెట్టి నరసింహారావు డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడడం సరికాదన్నారు. ఏపీలో అక్రమార్కులు రాజ్యం ఏలుతుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. మద్యం పూర్తిస్థాయి నిషేధమన్న జగన్.. ఇప్పుడు తాగుడుని ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.  పేదల జీవితాలను బలి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాలపైనా సీఎం జగన్ స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలన్నారు. అధికారులు కూడా.. చట్టపరంగా వ్యవహారించాలన్నారు.  పార్టీలకు కొమ్ము కాసేలా పని చేస్తే.. భవిష్యత్తులో  ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నరహరశెట్టి నరసింహారావు  డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-31T18:12:05+05:30 IST