అతి చేస్తే నంద్యాల పోలీసుల గతే!

ABN , First Publish Date - 2020-12-05T10:47:38+05:30 IST

అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తి అతి చేస్తే నంద్యాల సలాం కేసులో జైలు పాలైన సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌కు పట్టిన గతే..

అతి చేస్తే నంద్యాల పోలీసుల గతే!

పోలీస్‌ అధికారులకు చంద్రబాబు హెచ్చరిక

మాజీ మంత్రి కొల్లుకు పోలీసు పిలుపులపై ఆగ్రహం


అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తి అతి చేస్తే నంద్యాల సలాం కేసులో జైలు పాలైన సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌కు పట్టిన గతే.. పోలీసులకు పడుతుందని, జైళ్లపాలు కావాల్సి వస్తుందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పేర్ని నానిపై తాపీ మేస్త్రి దాడి చేసిన కేసులో రవీంద్రను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని, ఇలాంటివి తాము చూస్తూ ఉండబోమని హెచ్చరించారు. ‘‘ఇసుక కొరతతో కడుపు మండి తాపీ మేస్ర్తీ ఒకరు మంత్రిపై తిరగబడ్డారు. దీనిలో రాజకీయం లేదని కృష్ణా జిల్లా ఎస్పీ స్వయంగా చెప్పారు. అయినా, ఈ కేసులో విచారణకు రావాలని పోలీస్‌ అధికారులు రవీంద్రకు నోటీసులు ఇవ్వడం ఏంటి? గతంలో ఒక హత్య ఘటనలో తన పీఏ ఫోన్‌ తీసుకొని మాట్లాడినందుకు ఆ కేసులోనూ రవీంద్రను ఇరికించి 53 రోజులు జైలుకు పంపారు. ఇప్పుడు మళ్లీ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు ఎందుకీ అత్యుత్సాహం? నేను గతంలో మాదిరిగా ఉండను. అన్నీ లెక్క రాస్తున్నాను. వడ్డీతో సహా తీరుస్తాం. డీజీపీ అన్నీ వదిలేశారు. ఇలాగే చేస్తే తిరగబడే రోజు వస్తుంది. ఎందురిపై కేసులు పెడతారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై ఏం కేసులు పెడుతున్నారో కూడా రహస్యంగా ఉంచుతున్నారని, ఇలాంటి తప్పుడు వ్యవహారాలను తాము సహించేది లేదన్నారు. ‘‘ఖబడ్డార్‌.. మేం చూస్తూ ఊరుకొంటామని అనుకోవద్దు’’ అని చంద్రబాబు కఠినంగా వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-12-05T10:47:38+05:30 IST