వేల కోట్ల విలువైన భూములను మంత్రి పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డి కబ్జా చేశారు: నల్లారి

ABN , First Publish Date - 2022-07-15T20:00:18+05:30 IST

చిత్తూరు, పీలేరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల విలువైన భూములను మంత్రి పెద్దిరెడ్డి,..

వేల కోట్ల విలువైన భూములను మంత్రి పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డి కబ్జా చేశారు: నల్లారి

చిత్తూరు: చిత్తూరు, పీలేరు సహా రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల విలువైన భూములను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్‌రెడ్డి కబ్జా చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అన్నారు.  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీడియా సాక్షిగా వారి అక్రమాలను నిరూపిస్తామని, సాక్షి మీడియా(SAKSHI MEDIA) కూడా ఈ మీటింగ్‌కు రావాలని చెప్పారు. స్వామిమాలలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి అబద్దాలు చెప్పటం సిగ్గుచేటన్నారు. పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డి ల్యాండ్, శాండ్, వైన్ , మైన్ అన్నింటిలోనూ వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. కమీషన్లు ఇవ్వకుంటే మైనింగ్‌లో పెద్దిరెడ్డి వాటాలు రాయించుకుంటున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నుంచి చైన్నై, బెంగుళూరు‌కు ప్రతి రోజూ 300 లారీల ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్నారు.


తిరుపతిలో డీకేటీ భూములు ఎమ్మార్వో ఆఫీసులో రికార్టులు ట్యాంపరింగ్ చేశారని చెప్పారు. ఎస్పీవై డిస్టలరీ లీజుకు తీసుకుని నాసికరం మద్యం తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో జరిగే ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టులో పెద్దిరెడ్డి,  మిధున్‌రెడ్డికి కమీషన్లు అందుతున్నాయన్నారు.అక్రమ సంపాదనతో వచ్చిన డబ్బుతో ఓట్లు కొని మళ్లీ అధికారంలోకి రావొచ్చని జగన్‌రెడ్డి, వైసీపీ నేతలనుకుంటున్నారని చెప్పారు. ప్రజలు  అమాయకులు కాదు, మీ అరాచకాలపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. శ్రీలకంలో పాలకులకు  పట్టిన గతే ఏపీలో జగన్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మిధున్‌రెడ్డిలకు పడుతుందని నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి  హెచ్చరించారు.

Updated Date - 2022-07-15T20:00:18+05:30 IST