నల్లజాజి

ABN , First Publish Date - 2020-06-08T08:12:40+05:30 IST

ఈ నగరం తొడుక్కున్న నల్లముఖం ఆనవాళ్లను చెరిపేయగలవా మట్టిమీద మొలిచిన చెట్ల పచ్చదనం పొరల్ని ఒలువగలవా ఒక్కొక్క చెమట చుక్కను దారంపోగులు చేసి...

నల్లజాజి

ఈ నగరం తొడుక్కున్న నల్లముఖం ఆనవాళ్లను చెరిపేయగలవా

మట్టిమీద మొలిచిన చెట్ల పచ్చదనం పొరల్ని ఒలువగలవా

ఒక్కొక్క చెమట చుక్కను దారంపోగులు చేసి

స్వేచ్ఛా జండను అల్లిన ఆ చేతులెవరివి

వేల కొమ్మల మృదుత్వం ఈ దేశ సౌందర్యంలో పొదిగిన పిట్టల రంగేమిటి

గాలిని ఏ వర్ణానికి జతకట్టి దూరంపెడుతావు

ఆ చీకటిఖండమే మీ దేశపు వెలుతురు దారికదా


గొంతులకూ చూపు ఉంటుంది

మెడవాల్చిన చిగురొకటి

మీ మనసుకొక్కానికి ఒక ప్రశ్నను వేలాడదీసింది

దోసిళ్ళతో ఎత్తిపోసిన అవమానాల సాక్షిగా

మీ వర్ణమెప్పుడో వెలిసిపోయింది

లేక్‌ సిటీ ఘనీభవించింది

మిసిసిప్పీ నది చలనరహితమైంది

మినియాపోలీస్‌ మానవస్పర్శలేని చరిత్రను

లిఖించుకుంది


గోడకు వేలాడుతున్న పెయింటింగ్స్‌ మౌనదుఃఖం

రోడ్లన్నీ నినాదాలు పర్చుకుని

పూలగుత్తుల నిరసనలు తెలుపుతున్నవి

ఒక మరణ కాలం

కొత్త రేఖల్ని గీస్తున్నది


ఎన్ని గాయాల్ని మోయాలి

ఎన్ని ఋతువుల్ని రక్తంలో ముంచి తీయాలి

కన్నీళ్లు ఎండిపోయిన రాజ్యమా

తుపాకుల్లోంచి తడిరాలదు

అక్కున చేర్చుకోవలసిన వాళ్ళు 

హక్కులకోసం నిలబడ్డారు

సమాధానం పావురమై భుజాలమీద వాలుతుందో

ఆయుధమై తూటాలు కురిపిస్తుందో

వేముగంటి మురళి

9676598465


Updated Date - 2020-06-08T08:12:40+05:30 IST