Abn logo
May 23 2020 @ 11:34AM

దళితులపై ప్రతాపమా?: జగన్ సర్కార్‌పై నక్కా ఫైర్

గుంటూరు: డాక్టర్. సుధాకర్ కేసు సీబీఐకు ఇవ్వడాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించడంపై దళిత నేతలు హర్షం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైందని, ఏడాదిలో 63 విషయాల్లో హైకోర్టు ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిందని గుర్తుచేశారు. హైకోర్టు తప్పుబట్టిన అంశాలకు జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్ళకు నైతిక బాధ్యత ఉంటుందని ఆశించడం లేదన్నారు. కరోనా మహమ్మారితో ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్‌లు సేవలు అందిస్తున్నారని వివరించారు. అలాంటిది డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై క్రూరంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు.


సుధాకర్ రోడ్డుపై మద్యం తాగి గోడవ చేశాడని పోలీసులు చెబుతున్నారని.. అలాగైతే  మద్యం తాగిన  సుదాకర్‌ను పిచ్చి ఆస్పత్రికి ఎలా పంపుతారని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక తప్పుగా ఉండటంతో ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిందన్నారు. గతంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌ను కూడా ఇదే విధంగా వేధించి జైల్లో పెట్టారని గుర్తుచేశారు. విశాఖ గ్యాస్ ఘటనలో పరామర్శించిన సీఎం జగన్, ప్రకాశం జిల్లాలో దళితుల చనిపోతే ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ పరిహారంలో కూడా దళితులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరుపై దళిత సంఘాలు, మేధావులు ఆలోచన చేయాలని కోరారు. దేశ వ్యాప్తంగా వైద్యులు స్పందిస్తే.. ఏపీలోని డాక్టర్లు మాత్రం స్పందించకపోవడం దుర్మార్గమని నక్కా ఆనంద బాబు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
Advertisement