కాటేసిన గూడు!

ABN , First Publish Date - 2021-06-24T08:44:31+05:30 IST

ఎండా వాన నుంచి నీడనిస్తున్న గూడే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసింది. ఏళ్లనాటి మట్టిమిద్దె నడిరాతిరి ఉన్నట్టుండి అమాంతం కూలిపోయింది.

కాటేసిన గూడు!

  • నడిరాతిరి నిలువునా కూలిన మట్టిమిద్దె.. 
  • నాన్నమ్మ, మనుమడు నిద్రలోనే సమాధి
  • మృతురాలు సర్పంచ్‌.. అది 50 ఏళ్లనాటి ఇల్లు.. 
  • వనపర్తి జిల్లా బండరావిపాకుల గ్రామంలో విషాదం


వనపర్తి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఎండా వాన నుంచి నీడనిస్తున్న గూడే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసింది. ఏళ్లనాటి మట్టిమిద్దె నడిరాతిరి ఉన్నట్టుండి అమాంతం కూలిపోయింది. దూలాలు, మట్టి పెళ్లలు పిడుగుల్లా మీదపడటంతో గాఢనిద్రలో ఉన్న వృద్ధురాలు, ఆమె మనుమడు నిద్రలోనే సజీవ సమాధి అయ్యారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామంలో ఈ విషాదం జరిగింది. మృతురాలు గంగనమోని లక్ష్మమ్మ (65). ఆమె ఆ గ్రామ సర్పంచ్‌. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆ వృద్ధురాలికి తోడుగా నిద్రించేందుకు వచ్చిన ఆమె మనుమడికి తొమ్మిదేళ్లకే నూరేళ్లు నిండటం మరింత విషాదం. కూలిన ఇల్లు, 50 ఏళ్ల నాటి మట్టి మిద్దె. గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం.. లక్ష్మమ్మకు ముగ్గురు కొడుకులు, కూతురు. అందరికీ పెళ్లిళ్లలయ్యాయి. కుటుంబం పెరగడం, రెండు గదులు మాత్రమే ఉన్న మట్టి మిద్దె చాలకపోవడంతో ముగ్గురు కుమారులు తమ భార్యాపిల్లలతో వేరే ఇళ్లల్లో ఉంటున్నారు. ఆ పాతింట్లో లక్ష్మమ్మ ఒక్కరే ఉంటున్నారు. ఇటీవల ఇల్లు పొటుకు పెట్టడంతో కుమారులు ఆ ఇంటిపై టార్పాలిన్‌ కవర్‌ కప్పి సరిపెట్టారు. పొద్దంతా కొడుకుల దగ్గర ఉండే లక్ష్మమ్మ రాత్రి మాత్రం పాతింటికి వచ్చి నిద్రించేవారు. ఆమెకు తోడుగా చిన్న కుమారుడు సలేశ్వరం కూతురు మనీషా వచ్చేది. ఇటీవల మనీషా హైదరాబాద్‌కు వెళ్లింది. మనీషాకు బదులుగా ఆమె సోదరుడు యోగేశ్‌ (9) రెండ్రోజులుగా నాన్నమ్మకు తోడుగా వెళుతున్నాడు. మంగళవారం ఇద్దరూ మంచమ్మీద నిద్రపోయారు. అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న గది వరకు మిద్దె కూలిపోయింది. చుట్టుపక్కలవారు గాఢనిద్రలో ఉండటంతో ఎవ్వరికీ కూలిన తాలూకు శబ్దం వినపడలేదు. బుధవారం ఉదయం ఆరు గంటలకు అక్కడికి వెళ్లిన సలేశ్వరం, శిథిలాలను చూసి షాక్‌ అయ్యారు. చుట్టుపకక్కల వారితో కలిసి మట్టిని తొలగించి చూసేసరికి అప్పటికే లక్ష్మమ్మ, యోగేశ్‌ చనిపోయారు. ఈ ఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. 


నిరుడు బుద్ధారంలో..

అచ్చంగా ఇలాంటి విషాదమే గత ఏడాది అక్టోబరులో వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారంలో జరిగింది. అర్ధరాత్రి మట్టిమిద్దె కూలడంతో ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతిచెదారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మట్టి మిద్దెల్లోనే ఉంటున్నారు. నిరుడు వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 2793 ఇళ్లు దెబ్బతిన్నాయి. అందులో 439ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి.  9 మంది ప్రాణాలు కోల్పోయారు. పాతబడిన మట్టిమిద్దెల్లో ఉన్నవారిని ఖాళీ చేయించి ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేస్తేనే ప్రమాదాలను నివారించవచ్చు.

Updated Date - 2021-06-24T08:44:31+05:30 IST