మోదీ ఆలోచనా విధానంపై అపోహలు

ABN , First Publish Date - 2021-03-02T06:23:12+05:30 IST

రాజకీయ నాయకులు కొందరు చేసే వ్యాఖ్యలకు, చేసే పనులకు పొంతన ఉండదు. కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని...

మోదీ ఆలోచనా విధానంపై అపోహలు

రాజకీయ నాయకులు కొందరు చేసే వ్యాఖ్యలకు, చేసే పనులకు పొంతన ఉండదు. కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో ఉన్న రాజస్థాన్‌లో పెట్రోల్ పై వ్యాట్‌ను 30 నుంచి 38 శాతానికి, డీజిల్ పై వ్యాట్‌ను 22 నుంచి 28 శాతానికి పెంచిన విషయం ప్రజలకు చెప్పదు. మొత్తం పెట్రోల్ ధరలో కేంద్రప్రభుత్వ పన్నులు 21.59 శాతం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల మొత్తం 41.66 శాతం ఉంటోంది! మోదీ ప్రభుత్వాన్ని పదే పదే విమర్శించే వారు ఈ వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయరు? చంద్రబాబునాయుడు తన హయాంలో పెట్రోల్, డీజిల్ పన్నులను భారీగా పెంచి వాటి ధరలు తీవ్రంగా పెరిగేలా చేశారు. నాడు చంద్రబాబును విమర్శించిన జగన్ పెట్రోల్ పై 31 శాతం, డీజిల్ పై 22.25 శాతం పన్నులు విధించడంతో పాటు మరో రూ.4 అదనపు లెవీ వేశారు. 


పెట్రోల్, డీజీల్ ధరలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఉబలాటపడదు. కానీ గత ప్రభుత్వాలు వివిధ దేశాలకు చెల్లించాల్సిన రూ.లక్షల కోట్ల బకాయీలను వడ్డీతో సహా చెల్లించాల్సిన భారం మోదీ ప్రభుత్వం పై పడింది. అంతేకాక అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర 2020 ఏప్రిల్‌లో బ్యారెల్‌కు 18.38 డాలర్లు కాగా, 2021 ఫిబ్రవరికి అది 59.30 డాలర్లకు పెరిగింది. అంటే 222.63 శాతం పెరిగిందన్నమాట. గత ఒక్క నెలలోనే క్రూడాయిల్ ధరలు 18 శాతానికి పెరిగాయి. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ఉత్పత్తులను తీసుకువచ్చే దిశగా రాష్ట్రాలను ఆలోచింపచేసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. అయితే ఇష్టారాజ్యంగా పన్నులు విధించే వెసులుబాటును రాష్ట్రాలు వదులుకుంటాయా? 


దేశంలో ఒక్క జాతీయ రహదారి రంగంలోనే భారత్ మాలా ప్రాజెక్టు క్రింద 9 లక్షల కోట్లతో 51వేల కి.మీ. ఎక్స్‌ప్రెస్ రహదారులు నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే 65వేల కోట్లతో వివిధ రహదారి ప్రాజెక్టులు చేపట్టారు. ఇటీవలి బడ్జెట్‌లోనే రూ.29,137 కోట్లతో 2389 కి.మీ. రహదారి ప్రాజెక్టులు, రూ.40,064 కోట్లతో 3787. కి.మీ. రైల్వే ప్రాజెక్టులు, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు రూ.9772 కోట్లు కేటాయించారు. వాస్తవమేమంటే ఇవాళ గుజరాత్ కంటే ఎక్కువగా కొన్ని లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌లోనే అమలవుతున్నాయి. మోదీ సర్కార్ మూలంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటి, ఐఐఎం, ఐఐఎస్ఇఆర్, ఎయిమ్స్, త్రిబుల్ ఐటీ, ఎన్‌ఐటి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వ


విద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పడ్డాయి. ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని సంస్థలు ఉన్నాయా? ఏ రాష్ట్రంలోనైనా 20కి పైగా కేంద్ర సంస్థలు, మెడ్‌టెక్, ఎలెక్ట్రానిక్ ఉత్పాదక మండలం వంటివి ఏర్పడ్డాయా? మౌలిక సదుపాయాల రంగానికి వస్తే వైజాగ్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, హెచ్‌పిసిఎల్ విస్తరణకు ప్రభుత్వం కొన్ని వేల కోట్ల ఖర్చు పెట్టడమే కాక చమురు, సహజవాయువు క్షేత్ర రంగాల్లో రూ.లక్ష కోట్లకు మించి పెట్టుబడులు పెడుతున్నది. బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్ వే, అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేసింది కూడా మోదీ హయాంలోనే. భారత దేశంలో మొట్టమొదటి కోస్తా కారిడార్ అయిన విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ మొదటి దశ ఇప్పటికే అమలులో ఉన్నది. రూ.లక్ష కోట్ల సామర్థ్యం గల ఈ కారిడార్ పూర్తయితే ఇరువైపులా పరిశ్రమలు వచ్చి వేలాది ఉద్యోగావకాశాలు రావడమే కాక అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. 14 జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలాలను (ఎన్‌ఐఎంజడ్)లను దేశ వ్యాప్తంగా మంజూరు చేస్తే రెండు జోన్లు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే మంజూరయ్యాయి. గుజరాత్‌లోని ధోలేరా ఎన్ఐఎంజడ్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకూ భూమిని కూడా మంజూరు చేయలేదు. 2 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను, మరో 2 లక్షల పరోక్ష ఉద్యోగాలను కల్పించే ఇలాంటి జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉత్సాహంగా పనిచేయకపోతే కేంద్రప్రభుత్వానిదా తప్పు? గుజరాత్ 85.7 శాతం మేరకు పూర్తిగా తన స్వంతకాళ్లపై నిలబడి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోందని, అదే ఆంధ్రప్రదేశ్ స్వంత వనరుల సామర్థ్యం 55శాతం మాత్రమే నని ఎంతమందికి తెలుసు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద 2015 నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పట్టణాల్లో 20,28,868 ఇళ్లు మంజూరైతే ప్రధానమంత్రి స్వంత రాష్ట్రమైన గుజరాత్‌కు 7,65,281 ఇళ్లే మంజూరయ్యాయి. ఎక్కడుంది వివక్ష?కాని ఆంధ్రప్రదేశ్‌లో 3,59,068 ఇళ్లే నిర్మిస్తే గుజరాత్‌లో 5,21,311 ఇళ్లు నిర్మించారు. ఎవరిది పాపం?


రాష్ట్ర విభజన ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పడే ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమయిన ఎన్నో చర్యలను నరేంద్ర మోదీ వేగంగా తీసుకున్న విషయం రాజకీయ నాయకులు చెప్పకపోయినా,రికార్డుల్లో నమోదైంది. 2014 నుంచి వివిధ రూపాల్లో కేంద్రం నుంచి కొన్ని లక్షల కోట్లు బదిలీ అయ్యాయి. మరిదేనికి రాద్ధాంతం? 1941లో మద్రాస్ ప్రెసిడెన్సీలో రూపకల్పన జరిగిన పోలవరం ప్రాజెక్టుకు 1980లో శంకుస్థాపన జరిగినప్పటికీ 2014 వరకూ దాన్ని అమలు చేయడంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు విఫలమయ్యాయి. 2014లో నరేంద్రమోదీ సర్కార్ అధికారంలో రాగానే ఆగమేఘాలపై పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకుల్ని తొలగించి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు అమలు విషయంలో నిధుల కొరతేలేదని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని గౌరవించినందువల్లే రాజధాని రూపురేఖలు తయారు కాకముందే 2015 మార్చి నాటికే కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూ.1000 కోట్లు కేటాయించింది. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజభవన్ నిర్మాణాలకు రూ.2500 కోట్లు మంజూరు చేసింది. అమరావతిని వారసత్వ నగరంగా గుర్తించింది. 


ప్రపంచంలోనే అతి పెద్దదైన గుజరాత్‌లోని మోటారా స్డేడియంకు బిసిసిఐ నరేంద్రమోదీ పేరు పెట్టడంపై కొందరు అభ్యంతరం వెలిబుచ్చడం ఆశ్చర్యంగా ఉన్నది. మొత్తం క్రీడా సముదాయానికి సర్దార్ పటేల్ పేరుండగా, కేవలం ఒక్క స్టేడియంకు మోదీ పేరు పెడితే తప్పేమిటి? నరేంద్రమోదీ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న కాలంలో ఈ స్థాయి స్టేడియం ఉండాలని కలలు కని దానికి రూపకల్పన చేశారు. గుజరాత్‌లో కానీ, కేంద్రంలో కానీ ఒక్క ప్రజాసంక్షేమ పథకానికైనా నరేంద్రమోదీ పేరుందా? ఈ దేశంలో వందలాది పథకాలకు, విద్యాలయాలకు, విమానాశ్రయాలకు, రహదారులకు, చౌరస్తాలకు పార్కులకు, స్టేడియాలకు, వీధులకు, గల్లీలకు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టుకుంటే ఒక్కరైనా అడిగిన పాపాన పోయారా? కేంద్రప్రభుత్వ పథకాలకు చంద్రన్న, జగనన్న అంటూ బతికున్న వారి పేర్లు పెట్టుకుని పబ్బం గడుపుకోవడం మాటేమిటి? ఇది అభివృద్ధికోసం పోటీపడి ప్రపంచ రాజ్యాలతో సమానంగా నిలిచేందుకు ప్రయత్నించాల్సిన సమయం. విశాల దృక్పథంతో ఆలోచించకుండా వీధి రాజకీయాలకు, పసలేని ఆరోపణలకు దిగజారితే ప్రజలు గమనించకపోరు.


వై. సత్యకుమార్

బిజెపి జాతీయ కార్యదర్శి

Updated Date - 2021-03-02T06:23:12+05:30 IST