నా బాధ్యత మరింత పెరిగింది!

ABN , First Publish Date - 2021-04-03T05:41:12+05:30 IST

ఏడాదిన్నర క్రితం వరకూ ప్రత్యక్ష రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని గృహిణి మంజుశ్రీ జైపాల్‌రెడ్డి. సంగారెడ్డి జిల్లా

నా బాధ్యత మరింత పెరిగింది!

ఏడాదిన్నర క్రితం వరకూ ప్రత్యక్ష రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని గృహిణి మంజుశ్రీ జైపాల్‌రెడ్డి. సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టాక అభివృద్ధిని ఆమె పరుగులు పెట్టించారు.  ఈసారి ‘దీనదయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్‌ పురస్కారా’నికి తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక జిల్లా ప్రజాపరిషత్‌గా సంగారెడ్డి నిలిచింది.ఈ గుర్తింపు వెనుక ఎంతో కృషి చేసిన మంజుశ్రీ తన అనుభవాలను నవ్యతో పంచుకున్నారు.


‘‘మా జిల్లాకు జాతీయ స్థాయి పురస్కారం రావడం, అందులోనూ రాష్ట్రంలో మా సంగారెడ్డి జిల్లా ఒక్కటే దీనికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. అసలు ఇలాంటి అవార్డు ఒకటి ఉంటుందని తెలీదు. మాకు వస్తుందనే ఆలోచన కూడా లేదు. కష్టపడి పని చేయాలనీ, మా జిల్లా ప్రజాపరిషత్‌కు మంచి పేరు తేవాలనీ అనుకున్నాం. అధికారులూ, ఉద్యోగులూ అంకితభావంతో, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించారు. వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. దాని ఫలితమే ఈ పురస్కారం. 


నేను ఇంటర్‌ వరకూ చదువుకున్నాను. ఇప్పుడుయాభై ఎనిమిదేళ్ళ వయసున్న నాకు ఇదే మొదటి రాజకీయ పదవి. గ్రామస్థాయిలో వార్డు మెంబర్‌, సర్పంచ్‌ లాంటి పదవులు ఏవీ నేను నిర్వహించలేదు. ఏడాదిన్నర క్రితం నేరుగా జెడ్‌పిపి ఛైర్‌పర్సన్‌ అయిపోయాను. అయితే మా పుట్టింటి వారిదీ, మెట్టినింటి వారిదీ రాజకీయ కుటుంబాలే. మా నాన్న నర్సింహారెడ్డి అప్పట్లో విద్యుత్‌ సంస్థకు ఛైర్మన్‌గా పని చేశారు. బావ దివంగత పి. మాణిక్యరెడ్డి 1984 నుంచి 1988 వరకూ మెదక్‌ ఎంపీగా ఉన్నారు. నా భర్త జైపాల్‌రెడ్డి డీసీసీ బ్యాంక్‌ వైస్‌ ఛైర్మన్‌గా పని చేశారు. కాబట్టి రాజకీయాలపై అవగాహన, ఆసక్తి మాత్రం ఉన్నాయి. 


జెడ్‌పిపి ఛైర్‌పర్సన్‌ అయ్యాక ప్రజా సమస్యలపై మరింత అవగాహన పెంచుకున్నాను. గ్రామాల్లో పర్యటించినపుఝఝడు ప్రజలు ఎన్నో విషయాలను నా దృష్టికి తెచ్చేవారు. ఆ విధంగా లక్ష, రెండు లక్షల రూపాయలు అందుబాటులో లేకపోవడంతో అసంపూర్తిగా ఉన్న పంచాయతీ, అగన్వాడీ భవనాలు... దాదాపు వంద వరకూ పూర్తి చేయించాను. అలాగే అంగన్వాడీ భవనాలు, పాఠశాలల్లో టాయ్‌లెట్లు, నీటి ఎద్దడి ఉన్న గ్రామాణ ప్రాంతాల్లో బోర్‌వెల్స్‌ నిర్మాణాలను జెడ్‌పిపి నిధులతో చేపట్టాను. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలనూ, వైకుంఠ ధామాలనూ, డంప్‌ యార్డులనూ ఏర్పాటు చేయించాను. అవసరమైనప్పుడు మంత్రి హరీష్‌రావు దృష్టికీ, కలెక్టర్‌ దృష్టికీ తీసుకువెళ్ళి నిధులు మంజూరయ్యేలా చూశాను. 



అదే కలిసొచ్చింది...

2019-20 సంవత్సరానికి సంబంధించి ముప్ఫై ఏడు అంశాలపై నివేదిక పంపించాల్సిందిగా కేంద్రం గత ఏడాది డిసెంబరులో కోరింది. ఈ ఏడాది జనవరిలో నివేదిక పంపించాం. మా జిల్లా ప్రజాపరిషత్‌ ద్వారా చేసిన, చేయించిన పనులే వీటిలో ప్రధానంగా ఉండడం మాకు కలిసివచ్చింది. ముఖ్యంగా స్థాయీ సంఘ సమావేశాలనూ, సర్వ సభ్య సమావేశాలనూ క్రమం తప్పకుండా జరిపించాను. సమావేశాలకు సభ్యులందరూ హాజరయ్యేలా చూశాను. సమావేశాల అజెండాను రెండు, మూడు రోజుల ముందే సభ్యులకు పంపే ఏర్పాటు చేశాను. అంతేకాదు, సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు అధికారులతో అక్కడికక్కడే జవాబులు ఇప్పించాం. ఆ తరువాత లిఖితపూర్వకంగా కూడా సమాధానాలను అందించాం.


నేను ఈ పదవి స్వీకరించిన తరువాత సమావేశాలేవీ వాయిదా పడలేదు. ఇవన్నీ సానుకూలంగా పని చేశాయి. ‘దీనదయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్‌ పురస్కారా’నికి మా జెడ్‌పిపి ఎంపికయింది. ఈ నెల 24న పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పురస్కార ప్రదానం ఉంటుంది. అధికారులతో కలిసి దాన్ని స్వీకరించబోతున్నా. పురస్కారంతో పాటు కేంద్రం నుంచి మా జిల్లా ప్రజాపరిషత్‌కు కేంద్రం రూ. యాభై లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ మొత్తంతో జిల్లాలో వెనకబడిన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ లాంటి అత్యవసరమైన పనులు పూర్తి చేయిస్తాను. 


జెడ్‌పిపి ఛైర్‌పర్సన్‌గా ఎప్పుడూ ప్రజలకూ, ప్రజాప్రతినిధులకూ అందుబాటులో ఉంటాను. గ్రామీణ ప్రజలు వారి సమస్యలు చెప్పుకోడానికి నన్ను కలుసుకోవచ్చా? అని అడుగుతూ ఉంటారు. చాలా వరకూ నేనే ఆ గ్రామాలకు వెళ్ళి, సమస్యలు తెలుసుకుంటాను. వాటి పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తాను. పురస్కారంతో నా బాధ్యత మరింత పెరిగింది. ప్రజల అంచనాల మేరకు పని చేసి, వారి మన్ననలను మరింతగా అందుకోవాలన్నదే నా లక్ష్యం.

 కే.మురళీధర్‌ శర్మ, సంగారెడ్డి


Updated Date - 2021-04-03T05:41:12+05:30 IST